Magazines

అరివీర అభిషేక్‌

2 గంటల క్రితం

Abhishek
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 4 నిమిషాల చదవడం

35 బంతుల్లోనే సెంచరీ బాదిన ఓపెనర్‌
మూడో టీ20లో భారత్‌ ఏకపక్ష విజయం
3-0తో ఐదు 
మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సొంతం


అభిషేక్‌ శర్మ (113) అరివీర భయంకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 11 సిక్స్‌లు, 9 ఫోర్లతో పవర్‌హిట్టింగ్‌కు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. 15 బంతుల్లో అర్థ సెంచరీ, 35 బంతుల్లో సెంచరీ బాదిన అభిషేక్‌ శర్మకు 15 ఏండ్ల బుడతడు వైభవ్‌ సూర్యవంశీ (45) జతకలిశాడు.


ఈ ఇద్దరూ ఏడు ఓవర్లలోనే 133 పరుగులు జోడించగా.. వెల్లింగ్టన్‌లో మూడో టీ20 ఏకపక్షమైంది. 199 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 13.2 ఓవర్లలో ఊదేయగా.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే భారత్‌ 3-0తో సొంతం చేసుకుంది. అభిషేక్‌ శర్మ అరివీర భయంకర ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్‌ బౌలర్ల గణాంకాలు గల్లంతు కాగా, టీ20 ఫార్మాట్‌లో పలు రికార్డులు గల్లంతయ్యాయి!


నవతెలంగాణ-వెల్లింగ్టన్‌

భారత్‌, న్యూజిలాండ్‌ మూడో టీ20లో విధ్వంసక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (113, 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 35 బంతుల్లో సెంచరీ సాధించిన అభిషేక్‌ శర్మ మూడో టీ20లో భారత్‌కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. వైభవ్‌ సూర్యవంశీ (45, 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) సైతం చెలరేగాడు. ఓపెనర్ల మెరుపులతో 199 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 13.2 ఓవర్లలో ఛేదించింది. మరో 40 బంతులు ఉండగానే 6 వికెట్ల తేడాతో అలవోక విజయం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. డార్లీ మిచెల్‌ (89 నాటౌట్‌, 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించగా, ఫిన్‌ అలెన్‌ (40, 25 బంతుల్లో 5 సిక్స్‌లు), బెవాన్‌ జాకబ్స్‌ (39 నాటౌట్‌, 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. రికార్డు సెంచరీతో చెలరేగిన అభిషేక్‌ శర్మ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. భారత్‌, న్యూజిలాండ్ నాల్గో టీ20 శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగనుంది.

అభిషేక్‌, వైభవ్‌ మోత

199 పరుగుల ఛేదనలో ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (113), వైభవ్‌ సూర్యవంశీ (45) జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగారు. 7.1 ఓవర్లలో 133 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మలు సిక్సర్ల మోత షురూ చేశారు. దీంతో తొలి ఓవర్లోనే భారత్‌ 26 పరుగులు పిండుకుంది. 2.2 ఓవర్లలోనే 50 పరుగులు దాటేసిన భారత్‌.. పవర్‌ప్లేలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆరు ఓవర్లలో 118 పరుగులు చేసి అత్యధిక పవర్‌ప్లే స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. దంచికొట్టుడులో దూకుడు ప్రదర్శించిన అభిషేక్‌ శర్మ ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో వైభవ్‌ సూర్యవంశీ సైతం అర్థ సెంచరీకి చేరువైనా, పవర్‌ప్లే అనంతరం వికెట్‌ కోల్పోయాడు. జోరు కొనసాగించిన అభిషేక్‌ శర్మ మరో 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్‌ శర్మకు ఇది నాల్గో సెంచరీ కాగా, ఓవరాల్‌గా 11వ శతకం. అభిషేక్‌ దెబ్బకు భారత్‌ 7.4 ఓవర్లలోనే 150 పరుగులు చేసింది. అభిషేక్‌ అవుటైన తర్వాత సంజు శాంసన్‌ (18, 13 బంతుల్లో 2 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (5, 10 బంతుల్లో) నెమ్మదిగా ఆడినా.. భారత్‌ మరో 40 బంతులు ఉండగానే గెలుపు గీత దాటింది. తిలక్‌ వర్మ ( 1 నాటౌట్‌), నమన్‌ ధీర్‌ (4 నాటౌట్‌) లాంఛనం ముగించారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జెమీసన్‌ (2/45), మిచెల్‌ శాంట్నర్‌ (1/17) రాణించారు.

మిచెల్‌ మెరిసినా

టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. భిన్న పరిస్థితులతో కూడిన వెల్లింగ్టన్‌లో బౌలింగ్‌ చేసేందుకు ఆరంభంలో భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. ఓపెనర్‌ టిమ్ సీఫర్ట్‌ (2)ను అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆరంభంలోనే అవుట్‌ చేసినా.. ఫిన్‌ అలెన్‌ (40), డార్లీ మిచెల్ (89 నాటౌట్‌) రెండో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఎనిమిది ఓవర్ల అనంతరం న్యూజిలాండ్‌ 88/1తో భారీ స్కోరు దిశగా సాగింది. కానీ ఇక్కడే నితీశ్‌కుమార్‌ రెడ్డి మ్యాచ్‌ గమనాన్ని మార్చివేశాడు. అప్పటికే డార్లీ మిచెల్‌, ఫిన్‌ అలెన్‌లు ఎనిమిది సిక్సర్లు సంధించి జోరుమీదున్నారు. ఫిన్‌ అలెన్‌కు స్ట్రయిట్‌ బాల్‌ సంధించిన నితీశ్‌.. అతడిని లాంగ్‌ ఆన్‌లో క్యాచౌట్‌గా వెనక్కి పంపాడు. నితీశ్‌కుమార్‌ దారిలోనే ఇతర బౌలర్లు నడిచారు. దీంతో అక్కడ్నుంచి కివీస్‌ పరుగుల వేట కష్టమైంది. 26 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన డార్లీ మిచెల్‌.. తను ఆడిన ఆఖరు 26 బంతుల్లో 35 పరుగులే చేశాడు. ఆఖర్లో బెవాన్‌ జాకబ్స్‌ (39 నాటౌట్‌) మెరవటంతో న్యూజిలాండ్‌ 198 పరుగులు చేసింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ.. డార్లీ మిచెల్‌ వేగంగా ఆడలేకపోయాడు. ఫలితంగా న్యూజిలాండ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది!. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

స్కోరు వివరాలు

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : టిమ్‌ సీఫర్ట్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, ఫిన్‌ అలెన్‌ (సి) నమన్‌ (బి) నితీశ్‌ 40, డార్లీ మిచెల్‌ నాటౌట్‌ 89, గ్లెన్ ఫిలిప్స్‌ (సి,బి) అక్షర్‌ 17,
బెవాన్‌ జాకబ్స్‌ నాటౌట్‌ 39, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198.

వికెట్ల పతనం : 1-4, 2-90, 3-123.

బౌలింగ్‌ : భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-40-0, అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-33-1, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-44-0, అక్షర్‌ పటేల్‌ 4-0-36-1, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 4-0-38-1.

భారత్‌ ఇన్నింగ్స్‌ : వైభవ్‌ సూర్యవంశీ (సి) డార్లీ (బి) ఫిషర్‌ 45, అభిషేక్‌ శర్మ (సి) ఫిలిప్స్‌ (బి) జెమీసన్‌ 113, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) ఫిలిప్స్‌ (బి) శాంట్నర్‌ 5, తిలక్‌ వర్మ నాటౌట్‌ 1, నమన్‌ ధీర్‌ నాటౌట్‌ 4, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (13.2 ఓవర్లలో 4 వికెట్లకు) 199.

వికెట్ల పతనం : 1-133, 2-178, 3-193, 4-195.

బౌలింగ్‌ : జాకబ్‌ డఫ్పీ 2-0-44-0, ఆడం మిల్నె 2-0-33-0, మైకల్‌ బ్రాస్‌వెల్‌ 2-0-36-0, కైల్‌ జెమీసన్‌ 3.2-0-45-2, మాథ్యూ ఫిషర్‌ 1-0-25-1, మిచెల్‌ శాంట్నర్‌ 3-0-17-1.


118

వెల్లింగ్టన్‌లో భారత్‌ పవర్‌ప్లే స్కోరు 118. ఐసీసీ మెన్స్‌ టీ20ల్లో ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు. 2021లో సెర్బియాపై రోమానియా 116 పరుగుల రికార్డును టీమ్‌ ఇండియా న్యూజిలాండ్‌పై అధిగమించింది. ఓవరాల్‌ రికార్డు సన్‌రైజర్స్‌ పేరిట ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 125/0 పరుగులు చేసింది.


7.4 ఓవర్లు

వెల్లింగ్టన్‌ టీ20లో 150 పరుగులు చేసేందుకు భారత్‌ తీసుకున్న ఓవర్లు 7.4 ఓవర్లు మాత్రమే. ఇప్పటివరకు ఐపీఎల్‌లో లక్నోపై హైదరాబాద్‌ 150 పరుగులకు 8.2 ఓవర్లు ఆడటమే వేగవంతం. కానీ వెల్లింగ్టన్‌లో భారత్‌ ఆ రికార్డును బద్దలుకొట్టింది.


11

టీ20 ఫార్మాట్‌లో అభిషేక్‌ శర్మ చేసిన సెంచరీలు 11. భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అభిషేక్‌ నిలిచాడు. విరాట్‌ కోహ్లి (10)ని అభిషేక్‌ వెనక్కి నెట్టాడు. ఓవరాల్‌గా క్రిస్‌ గేల్‌ (22), బాబర్‌ ఆజామ్‌ (13) ముందున్నారు.


13.2 ఓవర్లు

199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్‌ ఇండియా ఆడిన ఓవర్లు 13.2 ఓవర్లు మాత్రమే. ఐసీసీ ఫుల్‌ మెంబర్స్‌ టీమ్స్‌ పరంగా 190 ప్లస్‌ టార్గెట్లకు ఇదే అత్యంత వేగవంతమైన ఛేదన.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్