Magazines

అయ్యర్‌ అదరహో

1 గంట క్రితం

Iyer is sensational.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

ఛేదనలో శ్రేయస్‌ అజేయ సెంచరీ
తొలి టీ20లో భారత్‌ ఘన విజయం
వెస్టిండీస్‌ 171/10, భారత్‌ 172/2
పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి టీ20లో వెస్టిండీస్‌పై 8 వికెట్లతో ఘన విజయం సాధించిన భారత్‌ ఈ ఫార్మాట్‌లో వరుసగా పదో విజయం ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా విజయాలు దక్కినా.. బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ (102 నాటౌట్‌) తొలిసారి సత్తా చాటాడు. ఛేదనలో అజేయ సెంచరీతో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌ లక్నోలో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీతో 172 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 14.4 ఓవర్లలోనే ఊదేసింది.

నవతెలంగాణ-లక్నో : తొలి టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో ఘనంగా మొదలెట్టింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (102 నాటౌట్‌, 43 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. కెరీర్‌ తొలి టీ20 సెంచరీ సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌.. నాయకుడిగా తొలిసారి దీటైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఇషాన్‌ కిషన్‌ (37 నాటౌట్‌, 27 బంతుల్లో 5 ఫోర్లు) సైతం రాణించటంతో 172 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 14.4 ఓవర్లలో ఊదేసింది. మరో 32 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 19.1 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్‌ షయ్‌ హోప్‌ (52, 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెర్ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌ (56, 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో విండీస్‌ మంచి స్కోరు సాధించింది. శతక హీరో శ్రేయస్‌ అయ్యర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. భారత్‌, వెస్టిండీస్‌ రెండో టీ20 శుక్రవారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.

శ్రేయస్‌ శతక్కొట్టాడు
ఛేదనను భారత్‌ దూకుడుగా మొదలెట్టింది. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అభిషేక్‌ శర్మ (21, 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన శైలిలో రెచ్చిపోయాడు. సంజు శాంసన్‌ (11) సైతం దూకుడు చూపించాడు. కానీ ఓపెనర్లు ఇద్దరూ ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. 3.3 ఓవర్లలో 35 పరుగులకే ఓపెనర్లు డగౌట్‌కు చేరారు. పిచ్‌ నుంచి స్పిన్‌కు అనుకూలత కనిపించటంతో మ్యాచ్‌ ఉత్కంఠగా సాగటం ఖాయమే అనిపించింది. కానీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (102 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (37 నాటౌట్) జోడీ విండీస్‌ ఆశలను ఆవిరి చేసింది. లక్నోలో తిరుగులేని రికార్డున్న శ్రేయస్‌ అయ్యర్‌ విండీస్‌ బౌలర్లను ఉతికారేశాడు. 8 ఫోర్లతో 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన అయ్యర్‌.. మరో 14 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఆరు సిక్సర్లు, మరో రెండు బౌండరీలతో విశ్వరూపం చూపించాడు. మరో ఎండ్‌లో ఇషాన్‌ కిషన్‌ చక్కగా సహకారం అందించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ అలవోకగా గెలుపు గీత దాటేసింది.

ఆ ఇద్దరు మెరువగా
తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను కెప్టెన్‌ షయ్‌ హోప్‌ (52) మరోసారి ఆదుకున్నాడు. హోప్‌ మెరుపులతో మంచి ఆరంభమే దక్కినా.. కామిల్‌ పూరన్‌ (12) వికెట్‌తో అర్ష్‌దీప్‌ సింగ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. అక్షర్‌ పటేల్‌ పవర్‌ప్లే ఆఖరు ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మెయిడిన్‌ ఓవర్‌తో విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. హెట్‌మయర్‌ (2), రోవ్‌మాన్‌ పావెల్‌ (0) పవర్‌ప్లేలోనే నిష్ర్కమించారు. రూథర్‌ఫోర్డ్‌ (56)తో జతకట్టిన హోప్‌ నాల్గో వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. హోప్‌ అవుటయ్యాక.. మిడిల్‌ ఆర్డర్‌ సైతం కుప్పకూలింది. దీంతో విండీస్‌ మరో ఐదు బంతులు ఉండగానే ఆలౌటైంది. భారత బౌలర్లలో నమన్‌ ధిర్‌ ((3/31), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/33), అక్షర్‌ పటేల్‌ (2/26) రాణించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్