27న సమ్మె సన్నాహక సదస్సు : కార్మిక సంఘాల సమావేశంలో యూనియన్ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆశా వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆశాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా భవిష్యత్ పోరాట నిర్దేశం కోసం సీఐటీయూ, బీఆర్‌టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూ అనుబంధ ఆశా యూనియన్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ మూర్తి మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వారికి పనిభారం బాగా పెరిగిందనీ, నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి స్థితిలో ఆశాలకు వేతనాలు పెరగకపోవటంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు యూనియన్స్ వారీగా విడివిడిగా అనేక పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. వినతి పత్రాలు అందజేసినట్టు తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం కనిపించటం లేదని చెప్పారు. ఆశా వర్కర్లకు సమ్మె తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 27న సమ్మె సన్నాహాక రాష్ట్ర సదస్సును హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో ఆశా యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్. నీలాదేవీ, కోశాధికారి పి. గంగమణి, ఆశా యూనియన్ (బీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.సంతోష, ఆశా యూనియన్ (ఏఐటీయూసీ ) రాష్ట్ర అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రజిని, ఆశా యూనియన్ (ఐఎన్‌టీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మైముద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)