ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ప్లేయర్ ట్రేడింగ్
హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 20వ సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పదును పెంచుకునే పనిలో నిమగ్నమైంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణించిన తమిళనాడు పేసర్, తంగరసు నటరాజన్ తిరిగి ఆరెంజ్ ఆర్మీ గూటికి చేరుకున్నాడు. ఐపీఎల్ 2027 ఆటగాళ్ల వేలం ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రేడింగ్ చేసుకుంది. సన్‌రైజర్స్ బౌలర్ జీషన్ అన్సారి రూ.40 లక్షల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోగా.. రూ.5 కోట్ల ధరకు టి నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నటరాజన్‌ను వేలంలో రూ.10.75 కోట్లకు తీసుకోగా.. ఆ ప్రాంఛైజీ తరఫున రెండు సీజన్లు ఆడాడు. ప్రస్తుత ధర తగ్గించుకున్న నటరాజన్ సన్‌రైజర్స్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో ఇబ్బంది పడిన నటరాజన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన నటరాజన్ 55 ఇన్నింగ్స్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. 2024 ఐపీఎల్లో 19 వికెట్లతో మెరిసిన నటరాజన్‌ను 2025 ఐపీఎల్ ముంగిట వేలంలో భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎగరేసుకుపోయింది. లక్నో సూపర్‌జెయింట్స్ నుంచి రిషబ్ పంత్‌ను తెచ్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనూ ప్లేయర్ ట్రేడింగ్ డీల్ చేసుకుంది. డిసెంబర్లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం గోవా వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ ఆఖరులోకా ప్రాంఛైజీలు రిటెయిన్ ప్లేయర్స్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. వేలానికి ముందు, వేలం తర్వాత సైతం ప్లేయర్ ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.






కామెంట్లు (0)