Magazines

కేరళలో కృత్రిమ విద్యుత్‌ సంక్షోభం సృష్టిస్తున్నారు: పినరయి విజయన్‌

8 గంటల క్రితం

Artificial power crisis being created in Kerala: Pinarayi Vijayan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ–హైదరాబాద్‌ : కేరళలో యుడిఎఫ్‌ ప్రభుత్వం కృత్రిమంగా విద్యుత్‌ సంక్షోభాన్ని సృష్టిస్తోందని ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, జాతీయ స్థాయిలోనూ తీవ్ర విద్యుత్‌ సంక్షోభం లేదని శుక్రవారం పేర్కొన్నారు. విద్యుత్‌ లభ్యత మెరుగుపడుతున్న సమయంలో రాష్ట్రంలో సంక్షోభం ఉందంటూ ప్రచారం చేయడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.


విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని విజయన్‌ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రతిపాదనకు బదులుగా జీఎన్‌ఏ ఎనర్జీతో ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. జీఎన్‌ఏ ఎనర్జీ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ కాదని, డిజిటల్‌ ఓటీసీ ప్లాట్‌ఫామ్‌ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో టెండర్లు, పారదర్శక విధానాలు పాటించలేదని విమర్శించారు. అసలు విద్యుత్‌ సరఫరా చేసే ఉత్పత్తి సంస్థ ఏదో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.


కేరళ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (కేఎస్‌ఈబీ) అంచనాల్లోని లోపాలు, భవిష్యత్తులో వాటిల్లే ఆర్థిక నష్టాలను ఎత్తిచూపినందుకే అప్పటి విద్యుత్‌ శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి ఆర్‌. రాజమాణిక్యాన్ని పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ఒత్తిడికి తలొగ్గకపోవడంతోనే ఆయనను బదిలీ చేశారని పేర్కొన్నారు. బోర్డు అంచనాల్లో లోపాలుంటే వాటిని ప్రభుత్వం నిరూపించాలని, అయితే ఇప్పటివరకు అలాంటి ఆధారాలు చూపలేదని అన్నారు.


జీఎన్‌ఏ ఒప్పందాన్ని సమర్థించుకునే క్రమంలో సవరించిన టారిఫ్‌ వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించలేదని విజయన్‌ ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి అదనంగా రూ.727 కోట్ల ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సవరించిన విద్యుత్‌ ఆఫర్‌లో పీక్‌ అవర్స్‌ సరఫరాకు ప్రత్యేక నిబంధనలు ఉండగా, జీఎన్‌ఏ ఒప్పందంలో రోజంతా ఒకే రేటు వర్తించేలా నిబంధనలు ఉన్నాయని వివరించారు. ఈ వివరాలను దాచిపెట్టి పాత ఆఫర్‌ను ప్రముఖంగా చూపడం సరికాదని విమర్శించారు.

బార్‌ లైసెన్సుల వివాదంపైనా విజయన్‌ స్పందించారు. బార్‌ లైసెన్సులకు సంబంధించిన నిబంధనలను ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టం చేశారు. 2011–2016 మధ్య ఎఫ్‌ఎల్‌-7 పేరుతో కొత్త కేటగిరీని ప్రవేశపెడుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ బార్లకు అనుమతులు ఇచ్చేందుకు అప్పట్లో నిబంధనలు సవరించారని గుర్తుచేశారు. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం వాటిలో ఎలాంటి మార్పులు చేయకుండా అప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగించిందన్నారు. ప్రస్తుత వివాదానికి తమ ప్రభుత్వాన్ని బాధ్యులుగా చూపేందుకు ముఖ్యమంత్రి వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విజయన్‌ విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్