Magazines

రైల్వేలో 2,800కి పైగా అప్రెంటిస్ పోస్టులు..పరీక్ష లేకుండానే

15 గంటల క్రితం

railwaypost
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఐటీఐ అర్హతతో భారీ సంఖ్యలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ), ముంబై ఆధ్వర్యంలో మొత్తం 2,861 ఖాళీలను భర్తీ చేయనుండగా, రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ముంబై, భుసావల్, పుణె, నాగ్‌పుర్, షోలాపూర్ క్లస్టర్ల పరిధిలోని వర్క్‌షాప్‌లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీవోపీఏ) వంటి పలు ట్రేడులలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. అత్యధికంగా ముంబై క్లస్టర్‌లో 1,712 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 2026 నవంబర్ 3 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 2, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.9,600 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్