- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-సంగారెడ్డి
సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటు చోరికి పాల్పడుతుందని, జ్ఞానేష్ కుమార్ ను మోడీ ఎంతకాలం కాపాడుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ప్రశ్నించారు.ప్రజా ఉద్యమాలను నిర్బంధంతో కేంద్ర ప్రభుత్వం ఆపాలని చూడటం అవివేకమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటాలను అణచివేసే హక్కు మోడీకి లేదన్నారు. శనివారం
ఢిల్లీలో కొనసాగుతున్న పోలీసుల అణచివేతను, అరెస్టులను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. అనేక మంది నిరసనకారులతో పాటు సిపిఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి, పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్, సీనియర్ నేత బృందాకారత్, పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.వి.గోవిందన్, విజయ రాఘవన్, ఇతర కేంద్ర కమిటీ సభ్యులను అరెస్టు చేశారన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పదవి నుండీ తొలగించాలన్నారు.
రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సి ఉండి ఎలక్షన్ కమిషన్ ఇవాళ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా మార్చుకొని సర్ పేరు మీద ఓట్లను తొలగించేటు వంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమం తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించినట్టుగా ఇప్పటికే లెక్కలు వచ్చాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను అనేక ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మానిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, రేవంత్, కృష్ణ నాయకులు అశోక్, బాలరాజు, శివ కుమార్, దత్తు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)