మీకు తెలుసా
భూమి వెలుపల జీవం ఉందా? అంటే 90శాతం మంది ఖగోళ శాస్త్రజ్ఞులు, పరిశోధకులు ‘అవును’ అనే సమాధానం ఇచ్చారు. సౌర కుటుంబం వెలుపల ఓ గ్రహం నుంచి జీవరసాయన సంకేతాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భూమికి వెలుపల జీవం జాడ ఉనికి గుర్తించడానికి భారీ టెలిస్కోప్ నిర్మాణం కొనసాగుతోంది.
చిలీలోని అటకామా ఎడారిలో ఇసుక, గట్టి శిలలు, అగ్నిపర్వతాలు, లవణాలతో కూడిన మైదానాలు ఉంటాయి. అక్కడ ఏడాదిలో 320 రోజులు మబ్బులు కూడా కనిపించవు. ఇక కొన్ని ప్రాంతాల్లో శతాబ్దంలో కొన్నిసార్లు మాత్రమే వర్షం పడిన చరిత్ర ఉంది. అతి తక్కువ తేమ, వాతావరణం పలుచగా, మేఘాల జాడలేని ఈ ప్రాంతంలో ఈ ఇంజినీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆటంకాల్లేకుండా చాలా ఎక్కువ సమయం విశ్వాన్ని వీక్షించడానికి అనుకూలమైన వాతావరణమే విశ్వ వీక్షణకు దోహదపడే అతిపెద్ద నేత్రం ఇక్కడ నిర్మించడానికి గల ఏకైక కారణం.
ఖగోళజీవశాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులతో ఓ సర్వే నిర్వహించగా భూమికి వెలుపల ప్రాథమిక జీవం ఉండొచ్చని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. 60 శాతం మంది మేధో జీవుల ఉనికి ఉండొచ్చని చెప్పారు.
సౌర కుటుంబం వెలుపల ఉన్న కె2-18బి అనే గ్రహం నుంచి జీవరసాయన సంకేతాలను గుర్తించిన పరిశోధకులు అవి సముద్రజీవానికి సంబంధించిన ఆనవాళ్లను అందిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భూమికి వెలుపల జీవం ఉనికిని గుర్తించే పరిశోధనలకు సాయం అందిండంతో పాటు చిన్నపాటి గ్రహాల ద్రవ్యరాశిని ఈఎల్‌టీ లెక్కిస్తుంది.
ఈఎల్‌టీ నిర్మాణం ఇది పెద్ద ఇంజినీరింగ్ సవాల్ కాగా, 16 ఐరోపా దేశాలు కన్సార్షియంగా ఏర్పడి కొనసాగిస్తున్నాయి. ఈఎల్‌టీ డోమ్ ఎత్తు 80 మీటర్లు కాగా, వేల టన్నుల కాంక్రీటు, ఉక్కు, అత్యంత కచ్చితత్వంతో రూపొందిన 798 అద్దాల సెగ్మెంట్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఎడారిలో మానవ ఆవాసంలేని పర్వతంపైకి తరలించడమే పెద్ద టాస్క్.
టెలిస్కోపుల సాయంతో ఖగోళాన్ని నిశితంగా పరిశోధించవచ్చు. ఈ నేపథ్యంలో టెలిస్కోపుల నిర్మాణం, పరిమాణం ఏటా పెరుగుతూనే ఉంది. అందులో కొన్నింటికి ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు, మరికొన్నింటికి అవి నిర్మించే ప్రదేశాల పేర్లను పెట్టగా, చాలా టెలిస్కోపులకు పరిమాణం ఆధారంగా పేర్లను ఖరారు చేస్తున్నారు. 18వ శతాబ్దంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త విలియం హెర్షెల్ ‘గ్రేట్ ఫార్టీ ఫుట్ టెలిస్కోపు’తో ఈ పోకడను ప్రారంభించగా, సదరన్ ఆఫ్రికన్ లార్జ్ టెలిస్కోపు, స్పెయిన్‌లోని గ్రాన్ టెలిస్కోపియో కనారియాస్, ఆరిజోనాలో లార్జ్ బైనాక్యులర్ టెలిస్కోపు ఆ తర్వాత నిర్మితమయ్యాయి.
చిలీలోని అటకామా ఎడారిలో వెరీ లార్జ్ టెలిస్కోప్ (వీఎల్‌టీ) నిర్మించగా, దీనికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ పర్వతంపై అంతకుమించిన మరో యంత్రాన్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. 16 యూరప్ దేశాల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ నిర్మాణానికి ఎక్స్‌ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ (ELT) అని పేరు పెట్టారు. భూమిపై నుంచి విశ్వ వీక్షణకు దోహదపడే అతిపెద్ద నేత్రం ఇదే కానుండగా వచ్చే ఏడాది నిర్మాణం పూర్తి కానుంది. 2030 నుంచి పరిశోధనలు ప్రారంభించనున్నారు.
జీవం జాడ కోసం...
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)