జుట్టుపోలుగాడు : ఎహె నేను దిగనుగాక దిగను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మా లక్ష్యం ఒకే దేశం ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే ఎన్నిక. దానికి తగ్గట్టు నడుచుకుంటాం. ఎన్ని అక్రమాలైనా చేస్తాం. ఎంతకైనా తెగిస్తాం. లోపలైతే మా న్యాయమూర్తులు, మా న్యాయవాదులు, మా ఐఎఎస్ అదికారులు.. ఇలా ఎందరో వుంటారు. బయట అయితే మా భక్తులు మేం ఏం చెబితే అది చేస్తారు. వాళ్లని మీరు గూండాలు, గుడ్డి భక్తులు అంటే మాకేంటి? మీరనే అక్రమాలు మాకు సక్రమాలే.
కేతిగాడు : రాముడే దేవుడన్నారు. అయోధ్యలోనే పుట్టారన్నారు. అక్కడ బాబ్రీ మసీదును పడగొట్టి రామాలయం కట్టారు. వచ్చిన విరాళాలు భోంచేశారు. పైగా ఆ పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టారు. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్నారు.
జట్టుపోలుగాడు : మరి అధికారం తేరగా వస్తుందా? ప్రజల ప్రాణాలు మాకు ఈకతో సమానం. హిందువులంతా ఒక్కటయ్యి ఓట్లేస్తే మేం ఇట్టే గట్టెక్కుతాం. ఈ రహస్యం తెలుసు గనుకనే గుజరాత్ నరమేధం జరిగింది. ఆ తర్వాత మా నాయకుడు దేశాధినేత అయ్యాడా లేదా? హ్యాట్రిక్ కొట్టాడు.
కేతిగాడు : అరె, కాస్త నింపాదిగా ఆలోచించరా. 2014లో మీ బిజెపి కొచ్చింది 282 సీట్లు. 2019లో 303, 2024లో 240. అంటే మెజీర్టీ రాలేదు.
జుట్టుపోలుగాడు : అయితేనేం టిడిపి చంద్రబాబుతో, బీహార్ నితీష్‌తో కలిసి అధికారాన్ని ఎలగబెడ్తున్నాంగా. ఎవడ్నైనా ఎట్టా లొంగదీసుకోవాలో మాకు తెల్సు. మా లక్ష్యం కోసం రాజ్యాంగాన్ని ఎలా వాడుకోవచ్చో చాటుగా సలహాలిచ్చే మేధావులు కూడా మాకున్నారు తెల్సా...
కేతిగాడు : ఇప్పుడు ‘సర్’ ప్రక్రియ కూడా అలాంటిదేనా?
జుట్టుపోలుగాడు : వార్ని.. ఇంత చెప్పినా నీ బుర్రకెక్కలేదంటే నీ తెలివికి నా జోహార్లు. ఓ సారి హోంమంత్రి అమిత్‌షా మాటలు గుర్తుచేసుకో... ‘‘ఎవరెంత మొత్తుకున్నా చెదపురుగుల్లాంటి చొరబాటు దారుల్ని గుర్తించడం, తొలగించడం, గెంటేయడం తథ్యమని’’ చెప్పాడా లేదా? అసలు ఏళ్ల తరబడి ఓట్ల జాబితా తప్పుల తడకగా నడుస్తుంది. అది సరిచేయడానికే ఈ సర్.
కేతిగాడు : చొరబాటు దార్లు చెదపురుగులు కాదురా. మనలాంటి మనుషులే. పోన్లే వాళ్లు మీ దృష్టిలో ఎంతమంది వుంటారు.
జుట్టుపోలుగాడు : రెండు కోట్లమంది. బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల నుండి వస్తున్నారు.
కేతిగాడు : బతుకు తెరువుకోసం ఇరుగుపొరుగు దేశాల నుండి వస్తారు. మనమూ వెళ్తాం పనికోసం. పొట్టకూటి కోసం. శ్రమ సర్వాంతర్యామి. దానికి కులం లేదు, మతం లేదు.
జుట్టుపోలుగాడు: కానీ ఎవడికైనా దేశం వుంటుందిగా. జననీ జన్మభూమి స్వర్గాదపీ గరీయసీ. అందుకే దేశంలో వున్నవారికే ఓట్లు. పరాయి దేశస్థులకు కాదు.
కేతిగాడు : అందరం అంగీకరిస్తాం. నీవన్నట్టు ఆ పరాయివాళ్లు 2 కోట్లు. కానీ గల్లంతయిన ఓట్ల సంఖ్య పదమూడున్నర కోట్లు. మిగిలిన పదకొండున్నర కోట్ల ఓటర్ల మాటేమిటి? 2024లో పార్లమెంటు ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తాయని మీరు కలలు కన్నారు. ఎన్ని అక్రమాలు ‘మీ భాషలో సక్రమాలు’ చేసినా మెజార్టీ రాలేదు. ఈసారి ఇంకా ఓట్లు తగ్గి అసలుకే మోసం జరుగుద్దేమోనన్న భయం పట్టుకుంది మీకు. అందుకే ఓ పద్ధతి ప్రకారం ఓట్లు తొలగించేందుకు సిద్దమవుతున్నారు.
జుట్టుపోలుగాడు : అరె, నీ దిమాక్ సరిగా వుందా లేదా? ఎన్నికల కమిషన్ నియామకమే ఓ పెద్ద వ్యూహాత్మకం. సర్ ప్రక్రియ ఆ చెట్టుకు కాసిన కుక్కమూతి పిందె. ఎన్నికల కమిషనర్ ఎంపిక త్రిసభ్య కమిటీ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్రమంత్రిని ఉంచింది అందుకే. అప్పుడిక ఎప్పటికీ మేమే మెజార్టీ. ఆ తర్వాత ఎలాంటి అవకతవకలు చేసినా కమిషన్‌పై ఎలాంటి చర్యా తీసుకోకూడదని బిల్లును కూడా రూపొందించాం. దానిమీద కూడా సుప్రీం ధర్మాసనం కిమ్మనదు. ఎందుకంటే ఆ ప్రధాన న్యాయమూర్తి కూడా మా వాడే.
కేతిగాడు : మరెందుకమ్మా... ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు చట్ట వ్యతిరేకంగా వుంటే రద్దు చేస్తాం అంటున్నారు.
బంగారక్క : ప్రజా ఉద్యమ సెగ తగిలి. ఆ దావానలం ఎటునుండి ఎటువైపు మళ్లి తన మీదకొస్తుందేమోనని పాలనతో అంటకాగుతున్న ప్రతిఒక్కరూ భయపడి చస్తున్నారు. చూస్తూ వుంటే మేస్తూ పోతున్నట్టు బిజెపి తెరచాటు భాగోతం ఇన్నాళ్లూ సాగింది. ఇంటింటికెళ్లి ఓటర్లను బూత్ స్థాయి అధికారులు వాకబు చేస్తారని ఇప్పుడు చెబుతున్నారు. ఎంత వినయం? ఎంత నమ్రత? నంగనాచి తుంగబుర్రలు. పాపం. ఓట్లు గల్లంతయిన వాళ్లు ఏం చేయాలో తెలియక అధికార్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. 13 కోట్ల మంది వున్నారంటే మాటలా? ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఎలక్షన్ కమిషన్ ఏమన్నా రాజ్యాంగేతర శక్తా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల భూయాన్ ఏమన్నాడో తెలుసా.. ఓటు హక్కు పౌరసత్వానికి అసలైన ప్రాణం. ఓటు తీసేయడం అంటే శరీరం నుండి ఆత్మను వేరు చేయడమే. ఓట్ల తొలగింపు రాజ్యాంగ ద్రోహం. 2024 ఎన్నికల తర్వాత, ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, బిజెపి విజయం వెనుక సర్ మోసాల జాడ్యం నీడలా వెంటాడుతుంది. ఇప్పుడు కాక్రోచ్ యువత, యావత్ ప్రతిపక్షం ఏకోన్ముకంగా ఈ సర్ దుర్మార్గాన్ని ప్రతిఘటిస్తూ పోరాడటం, ఆధునిక భారత రాజకీయాల్లో అపురూప ఘటన. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి ప్రణమిల్లుదాం. ప్రతి ఒక్కరం పాల్గొందాం.
కె.శాంతారావు, 99597 45723






కామెంట్‌లు (0)