Magazines

ఐటి విప్లవంలో నాలెడ్జ్ వర్కర్లే కీలకం

59 నిమిషాల క్రితం

వేగవంతంగా మారుతున్న ఈ ప్రపంచం (Fast Changing World)లో ‘నాలెడ్జ్ వర్కర్’ (Knowledge Worker) లేదా ‘జ్ఞాన కార్మికుడు’ అనే పదం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 5 నిమిషాల చదవడం

'The most valuable assets of a 20th-century company were its production equipment. The most valuable assets of a 21st-century institution, whether business or nonbusiness, will be its knowledge, workers, and their productivity. - Peter Drucker

ఇరవై ఒకటో శతాబ్దం మానవ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఆటోమేషన్ వంటి సాంకేతిక విప్లవాలు సాంప్రదాయ పరిశ్రమల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి.



వేగవంతంగా మారుతున్న ఈ ప్రపంచం (Fast Changing World)లో ‘నాలెడ్జ్ వర్కర్’ (Knowledge Worker) లేదా ‘జ్ఞాన కార్మికుడు’ అనే పదం ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ మేనేజ్‌మెంట్ గురువుగా ప్రసిద్ధికెక్కిన పీటర్ డ్రక్కర్ 1959లో The Landmarks of Tomorrow గ్రంథంలో ‘నాలెడ్జ్ వర్కర్’ అనే పదాన్ని ప్రతిపాదించారు. కేవలం శారీరక శ్రమతో వస్తువులను ఉత్పత్తి చేసేవారిని శ్రామికులు (మాన్యువల్ వర్కర్లు)గా మనం పిలుస్తాం. ఇందుకు భిన్నంగా తమ మేధస్సు, ఆలోచనా శక్తి, విశ్లేషణ, సృజనాత్మకత, జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి, సమాచారాన్ని సంపదగా మార్చే మేధోసంపన్నులను పీటర్ డ్రక్కర్ ‘నాలెడ్జ్ వర్కర్లు’గా నిర్వచించారు.

ప్రస్తుత కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, పరిశోధకులు, వ్యూహాత్మక విశ్లేషకులు ఈ కోవకే చెందుతారు. ఇప్పుడు వీరి పాత్ర కేవలం ఒక ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి సరైన దిశలో నడిపించే చోదక శక్తిగా అవతరించింది. ప్రపంచీకరణలో భాగంగా ధనం, పెట్టుబడులతో పాటు సమాచార విస్ఫోటనం (Information Explosion) జరుగుతున్న నేటి డిజిటల్ విప్లవంలో ‘డేటా(Data)’నే అతిపెద్ద ఆస్తిగా మారింది. అయితే, కేవలం ముడి డేటా (Raw Data) ఉన్నంత మాత్రాన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ డేటాను సరైన పద్ధతిలో క్రోడీకరించి, విశ్లేషించి, సంస్థల వృద్ధికి ఉపయోగపడేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో నాలెడ్జ్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైనది. AI, ఆటోమేషన్ పుంజుకుంటున్న నేటి తరుణంలో, యంత్రాలు చేయలేని సృజనాత్మక, సంక్లిష్ట సమస్యల పరిష్కారాలను కనుగొనడం ద్వారా నాలెడ్జ్ వర్కర్లు భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించబోతున్నారు.

ఉత్పాదకత, సేవారంగాల్లో తలెత్తే క్లిష్టమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం కేవలం నాలెడ్జ్ వర్కర్లకు మాత్రమే సాధ్యం. అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక, ఆర్థిక లేదా సామాజిక సవాళ్లకు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, సరికొత్త ఆవిష్కరణల ద్వారా తక్షణ, శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో నాలెడ్జ్ వర్కర్లే అత్యంత కీలకమైన వనరుగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ, రోబోటిక్స్ సాంకేతికతలు మరింత అభివృద్ధి చెందడం వల్ల సాధారణ, ఒకేలా పునరావృతమయ్యే పనులన్నీ ఆటోమేట్ అవుతాయి. దీనివల్ల నాలెడ్జ్ వర్కర్ల పాత్రకు మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ పూర్తిగా నాలెడ్జ్ వర్కర్లను భర్తీ చేయలేదు. ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోగల నాలెడ్జ్ వర్కర్, వాటిని ఉపయోగించని ఇతరుల కంటే ఎంతో ముందంజలో ఉంటాడు. నిరంతరాయంగా సాగే రోజువారీ సాధారణ పనులను ఏఐకి అప్పగించి, మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమయ్యే వ్యూహాత్మక ఆలోచనలు, నిర్ణయాత్మక కార్యాల్లో నాలెడ్జ్ వర్కర్లు కీలకం కానున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, నేడు నేర్చుకున్న నైపుణ్యం మరో మూడేళ్లలో పనికిరాకుండా పోవచ్చు. అందువల్ల, నాలెడ్జ్ వర్కర్లు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం తప్పనిసరి. నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి నాలెడ్జ్ వర్కర్ల ప్రథమ కర్తవ్యం. వీటికి తోడు బహుముఖ ప్రజ్ఞ కూడా ఎంతో అవసరం. భవిష్యత్ కార్పొరేట్ ప్రపంచంలో కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా, రెండు మూడు విభిన్న రంగాలపై పట్టు ఉన్న నాలెడ్జ్ వర్కర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకు వైద్య రంగంతో పాటు డేటా సైన్స్ తెలిసిన వారికి, ఫైనాన్స్‌తో పాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన ఉన్నవారికి సరికొత్త అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాల కలయికతో పాటు గ్లోబల్ కొలాబరేషన్ భవిష్యత్తు నాలెడ్జ్ వర్కర్లకు అత్యంత కీలకం. ఏఐ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, మనుషుల మధ్య ఉండే పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలతో కూడిన నిర్ణయాలు కేవలం నాలెడ్జ్ వర్కర్లకే సాధ్యమవుతాయి.

వివిధ రంగాలలో నాలెడ్జ్ వర్కర్లు పోషించబోతున్న పాత్ర గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. సాంకేతిక విప్లవం మూలాన విద్యారంగంలో నాలెడ్జ్ వర్కర్ల పాత్ర గణనీయంగా మారుతోంది. గతంలో ప్రొఫెసర్లు కేవలం పాఠ్యపుస్తకాలలోని సమాచారాన్ని విద్యార్థులకు చేరవేసేవారు. నేడు ఇంటర్నెట్, గూగుల్, ఏఐ చాట్‌బాట్స్ వల్ల సమాచారం అందరికీ ఉచితంగా, వేగంగా అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో విద్యా రంగానికి చెందిన నాలెడ్జ్ వర్కర్లు కేవలం బోధకులుగా కాకుండా లెర్నింగ్ గైడ్స్ లేదా ఫెసిలిటేటర్స్‌గా రూపాంతరం చెందుతున్నారు. నెట్‌లో లభించే అపారమైన డేటాలో నిజానిజాలను విశ్లేషించే విమర్శనాత్మక ఆలోచనా శైలిని (Critical Thinking) విద్యార్థులకు నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. ప్రతి విద్యార్థి మానసిక సామర్థ్యం, ఆసక్తులకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన విద్యను (Personalized Learning) అందించేందుకు, ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలను డిజైన్ చేయడానికి ఉపాధ్యాయులు ఏఐ టూల్స్ సహాయం తీసుకుంటున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో సాధారణ పనులు డిజిటల్ యాప్స్, ఏఐ అల్గారిథమ్స్ ద్వారా వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆర్థిక రంగ నాలెడ్జ్ వర్కర్ల పాత్ర సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా గ్లోబల్ ట్రెండ్స్, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ పరిణామాల విశ్లేషణ, ఖాతాదారుల పెట్టుబడులకు రక్షణ కల్పించే నమ్మకమైన సలహాదారులుగా నాలెడ్జ్ వర్కర్లు వ్యవహరించనున్నారు. రిస్క్ అనలైజర్స్‌గా కార్పొరేట్ రుణాల వల్ల వచ్చే నష్టాలను, మార్కెట్ సంక్షోభాలను ముందే ఊహించి బ్యాంకులను అప్రమత్తం చేయడంలో ముఖ్యపాత్ర పోషించబోతున్నారు. నిమిషాల వ్యవధిలో జరిగే సైబర్ మోసాలను, మనీ లాండరింగ్ చర్యలను అధునాతన టెక్నాలజీ సహాయంతో అడ్డుకునే వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలను నాలెడ్జ్ వర్కర్లు నిర్మించగలుగుతారు.

విద్యా ఆర్థిక రంగాల తర్వాత ఎంతో ముఖ్యమైంది వైద్య ఆరోగ్య రంగం. గతంలో వైద్యం కేవలం రోగి చెప్పే లక్షణాలు, సాధారణ ల్యాబ్ రిపోర్టులపైనే ఆధారపడేది. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో హెల్త్‌కేర్ నాలెడ్జ్ వర్కర్లు, బయో-ఇన్ఫర్మేటిక్స్ నిపుణులు భవిష్యత్తు వైద్యులుగా కీలక పాత్ర పోషించబోతున్నారు.ఆరోగ్య విభాగంలో పర్సనలైజ్డ్ మెడిసిన్ (వ్యక్తిగత వైద్యం) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రోగి డిఎన్ఏ ప్రొఫైల్, జన్యు నిర్మాణం, జీవనశైలి డేటాను విశ్లేషించి, వారికి వంద శాతం సరిపోయే ప్రత్యేక చికిత్స అందిస్తారు. డేటా అనలిటిక్స్ సహాయంతో ఒక వ్యక్తికి భవిష్యత్తులో వచ్చే జబ్బులను ముందే ఊహించి, నివారణ మార్గాలను సూచించే ప్రిడిక్టివ్ హెల్త్‌కేర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యావశ్యకమైన టెక్నాలజీ-సస్టైనబిలిటీ రంగాల్లో నాలెడ్జ్ వర్కర్ల సేవలు విశిష్టమైనవిగా మారనున్నాయి.

సాధారణ కోడింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ పనులను ఏఐ టూల్స్ సులభంగా పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల ఐటీ రంగంలో మార్పులు మొదలయ్యాయి. ఏఐ సిస్టమ్స్ నుండి ఖచ్చితమైన ఫలితాలను రాబట్టడానికి, సరైన ఇన్పుట్స్ ఇవ్వగల నైపుణ్యం ఉన్న ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. మరోవైపు పర్యావరణ మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో.. పరిశ్రమలు, కంపెనీలు కాలుష్యం లేకుండా, తక్కువ కార్బన్ ఉద్గారాలతో లాభాలు గడించడానికి సలహాలు ఇచ్చే ‘సస్టైనబిలిటీ కన్సల్టెంట్స్’ అవసరం మున్ముందు కీలకం కానుంది. మార్పులు ప్రపంచ నియమం. వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు. నిరంతరం అప్‌గ్రేడ్ అవ్వడమే యువత కర్తవ్యం. కేవలం సమాచారాన్ని మనసులో నిక్షిప్తం చేసుకోవడమే కాకుండా, ఆ సమాచారాన్ని సరికొత్త సాంకేతికతతో ముడిపెట్టి మానవాళి శ్రేయస్సుకు, సామాజిక-ఆర్థిక ప్రగతికి ఉపయోగించగలిగేది నాలెడ్జ్ వర్కర్లే. రానున్నరోజుల్లో ప్రపంచాన్ని నడిపించే అత్యంత విలువైన మానవ వనరుగా నాలెడ్జ్ వర్కర్లు రూపాంతరం చెందనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదువుపై నిశిత దృష్టి సారించాల్సి ఉంటుంది. భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి విద్యార్థికి పటిష్టమైన అకడమిక్ ఫౌండేషన్ అందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉంది.


ప్రొ|| బెల్లి యాదయ్య

9848392690

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్