Magazines

సెట్ల తీర్తం

1 గంట క్రితం

The end of sets
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 6 నిమిషాల చదవడం

పోరగాండ్లను ఎటోళ్ళనటు స్కూలుకు తోలి నంక వాన గొట్టి ఎలిసినట్టు ఉంటది ఇల్లు. గట్లా వాళ్లను తోలి పుర్సత్‌గా కూసోని చాయ చప్పరించుకుంట, సెల్లుల మొకంబెట్టుకున్న మా సూరి తోని ‘మా అమ్మోళ్ళు చెట్లతీర్తం పోతండ్రట, మనల్ని గూడ రమ్మన్నరు పోదామా’.

‘మల్లనా, పోయొచ్చి నెలన్న గాలే మల్ల గింత జెల్దీనా,’.. మీవోళ్ల ఇంటికంటే నడు నడుమంటవ్ మా వోళ్ళింటికంటే కాలు కదులది పార్శాలిటోడ..’

‘నువ్వేమన్న తక్కువనా మీ ఇంటికి పది సార్లు పోతే మా ఇంటికి ఒక్కసారి. ఏది పార్షాలిటీ! పోరగాండ్ల నడుగు సాఫ్ సాఫ్ జెప్తరు’ సెల్లుల నుంచి ముఖం తీయకుండానే అన్నడు.

సరే గానీ.. చెట్ల తీర్థమంటే ఎట్లుంటదొ యెరికే గద! చెట్లల్ల వండుక తినుడు, చుట్టాల మధ్యన చెప్పనలివి గాని సంబురం. పిల్లగాండ్లు కూడా మస్తు ఎంజాయ్ చేస్తరు పోదామే సూరి’ అన్న కండ్లల్ల మొకంబెట్టి బతిలాడినట్టుగా.

‘నేనెందుకబ్బా! అచ్చిదానికి పచ్చిదానికి అమ్మోళ్ళు అని ఉరుకుతవ్ ఉరుకు, పోరగాండ్లను గూడ ఎందుకురికిస్తవు! వాళ్ళ స్కూలేంగావాలె.

‘ఒక్క రోజుకే ముంచుక పోయేదేమున్నది? తిప్పి తిప్పి కొడితే రెండు గంటల జర్నీ. రోజుల రోజుల జర్నీనా? వో.. నీలుగ వడితివి’

‘నీలెక్క నాకు లీవులియ్యరు. పిల్లల్ని నువ్వే తీస్కపో. టీచర్లకు లీవులు దొరికేటట్టున్నదా! గీ టీచర్ కొలువేందో గాని అన్నిటికీ టీచర్లనే సంపుతండ్రు. బడిబాటకు, జనాభా లెక్కలకు, ఇంటింటి సర్వేలకు, ఎలెక్షన్లకు అన్నిటికీ టీచర్లే. ఈసారి ఎండాకాలం సెలవులను కూడా మింగేసిండ్రు. అన్నిటికీ అగ్గువ సగ్గువకు టీచర్లమే దొరికినము గీ గౌరుమెంట్‌కి చికాకు, పిల్లగాండ్ల స్కూలు కూడా పోతది. నీకంత కాయిషుంటే నువ్వు పోయిరా’ అని కటిమిటిగా సెప్పిండు.

‘పోయేదే పోరగాండ్ల కోసం. గాళ్లకు సెట్లు, సేమలు, పిట్టలు, పశువులు, వాగులు సూపిచ్చి ఎంజాయ్ చెపిచ్చే దానికి వాళ్ళు లేకుంట నేనొక్కదాన్నెట్ల పోత! మన చిన్నప్పుడు గవన్ని ఎంజాయ్ చేసి ఉన్నోళ్లము. వాళ్ళు గూడ సెయ్యద్దా! చెట్ల తీర్థం ఎప్పటికి వచ్చేదా! ఏడాదికొక్కసారి అదీ ఆషాడంలనే.

నువ్విట్ల పుల్లలేస్తవని ముందే అనుకున్నలే’ అని చాయ గ్లాసు యిసిరి కొట్టిన.

‘యే.. అది గాదు మేడమ్..’

‘ఏది గాదు, మూసుకో. నేనైతే రేపు లీవ్ బెట్టి పోరల్ని తీసుకొని పోవుడే. నువ్వు వస్తేరా, లేకుంటే లేదు’ అని కోపంతోని దబ దబ తయారై టిఫిన్ బాక్స్ బ్యాగుల సదురుకొని బైటి కొచ్చిన. సూరి ఇంటికి తాలమేసి బండి స్టార్ట్ చేస్తే.. పోయి బండి మీద కూసున్న. నేను పంజేసే స్కూల్ కాడ దించి తన స్కూల్‌కి పోయిండు సూరి. దించేదే గ్యారెంటీ, సాయంత్రానికి వుండది. నేను మా సూరి, ఇద్దరం స్కూల్ టీచర్లము. మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు తొమ్మిది, బిడ్డ ఆరు చదువుతుండ్రు.

నా చిన్నప్పుడు బతుకమ్మ తర్వాత బాగ ఖాయిషు పడ్డ పండుగ చెట్ల తీర్థమే. ఆకుపట్టిన అడవి, పక్కనుంచి పారే వాగు నీళ్లల్ల ఆటలు, ఎన్నెన్నో పేర్లు తెలువని పూలు, పండ్లు, పిట్టలు, సోపతిగాళ్ళతో అలివి గాని ఆటల సంబురాలు. చుట్టాలు బంధువుల ప్రేమలు, వాళ్ళ మీద గావురాలు, అలకలు బుజ్జగింపులు. గియన్ని మా పోరలకు కూడా సూపియ్యాలని, వాళ్ళ సంబురం జూసి నేను గూడ సంతోషపడాలనీ సూరి గూడ ఉంటే అదోతుత్తి. స్కూలుకు రేపొక్క రోజుకు లీవ్ పెట్టి, ఇంటికొచ్చి పిల్లల క్లాస్ టీచర్లకు మెయిల్ల లీవ్ పంపిచ్చి, పిల్లలను తయారు చేయించిన. రాత్రి ఏడు గంటలకల్లా తయారైనంక, మా సూరి వచ్చి బస్సు ఎక్కిచ్చి పోయిండు.

గీ ముచ్చోడు ఏమ్మనిషో ఏమో! ఎటు రాడు ఎటు పోడు. ఎప్పటికీ బడి ఇల్లు, సెల్లు. ఓ.. సినిమా అనడు, షికారు అనడు. ఏ సంబురం లేదు సారం లేదు. ఈస్తటిక్స్ లేని ఇడియట్ దొరికిండు నా ప్రాణానికి. అని మనసుల ఇయ్యర మయ్యర తిట్టుకున్న. మా స్కూల్ల నా తోటి టీచర్ల మొగుళ్ల కంటే మా సూరి జెర నయమే అని సరిపెట్టుకునుడే గానీ యేమి ఫాయిద లేదు. రాత్రి పదికల్లా అమ్మోళ్ళ యింటికి చేరుకున్నము. మా పెద్దక్క వాళ్లు మా జిల్లా కేంద్రం ఆస్పత్రిల క్లీనర్లు. నా కన్నా ముందే వచ్చిండ్రు. మా చిన్నక్కోల్లు, అన్నోళ్ళు రాలే. వాళ్లు గోలేటి, సింగరేణిల పంజేస్తరు. వాల్లక్కడనే ఆసిఫాబాద్ చెట్ల తీర్థం జోర్దార్‌గా, తీన్మార్‌గా చేస్తరు.

మా పెద్దక్క పిల్లలు, మా పిల్లలు కలిసినారో లేదో మస్తు మస్తు మజాలున్నరు. పట్ట పగ్గాలు లేని పండుగ వాళ్లకు. వాళ్ళ ముఖాలల్ల గింత సంబురం మా ఇంట్ల కనబడది. స్కూలుకు వురుకుడు, హోమ్ వర్క్‌లు, ప్రాజెక్టులతో ఏడుపుగొట్టు ముఖాలేసుకొని ఉంటరు. రాత్రంతా నేను, మామ్మ నాన మా పెద్దక్కల ఒడువని ముచ్చట్లతో తెల్లారింది. మా నాన పొద్దుగాల కోడి కోసం ఊర్లకి పోయిండు. అమ్మ నిన్ననే బెల్లం కొబ్బరికాయ, గుడాలేసుకునే దానికి శెనిగలు తెచ్చిపెట్టింది. అల్లమెల్లిగడ్డ, మసాల గిట్ల నూరి తయారు పెట్టింది. నేను మా పెద్దక్క లేసి పోరగాండ్లు బోరింగ్ కాన్నుంచి నీల్లు తెస్తే ఆకిలూడిసి, అలుకేసి బోళ్ళు తోమినం. కడపలు కడిగి బొట్లు బెట్టినం.

దుబ్బల ఆడే నా బిడ్డను జూసి ‘సీ.,. సీ..ఎందే నీ అవుతారము, తానం చేపిత్త దా! అని పిలిస్తే.. మా అమ్మ ‘నీ బిడ్డ కేందే తంగెడుపూవున్నట్టున్నది. వావ్వో! అమ్మా! పోయి పోయి నా బిడ్డను తంగెడు పువ్వుంటవేందే.. గా తంగెడు పూలను ఎవలన్న కానుతరానే. నా బిడ్డను లిల్లీ పువ్వొ, బంతి పువ్వో గులాబీ పువ్వో అనకుంటాగా విలువ లేని తంగెడు పూవని అంటివెందే నా బంగారాన్ని, నా బిడ్డను అని అలుముకొని ముద్దాడిన.

అంతలనే కోడిపుంజు పట్టుకొని వచ్చిండు నాన. పిల్లలందరికీ తానాలు పోసి తయారు జేపిచ్చి, మేమందరం తయారై అమ్మ జేసిన వుకుమ తిన్నము.

అమ్మ చెట్లల్లకు తీసుకపోయే గంపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టింది. వండుకునే గంజు గిన్నెలు యిస్తారాకులు, గంటెలు, గ్లాసులు, కారం పసుపు నూనె మాల్ మసాలా ఉల్లిగడ్డలు గిట్ల అన్ని గంపల పొందించి పెట్టింది. బియ్యం శనిగలు సంచిల సదిరింది. మా చిన్నాయనోళ్లు పెదనాయనోళ్లు మా గూడెపోల్లందరం కలిసి బయలుదేరినము. ఇండ్లల్ల పిల్ల జిల్లా ముసలి ముతుక ఎవ్వరుండరు. ఇళ్లకు తాళాలేశి అందరు చెట్లల్లకే. ఇంటికో గంపగా ఆడోల్లు గంపలు ఎత్తుకున్నరు. పిల్లలు మొగోళ్లు బిందె, కుండ, కోడి, పోయిల కట్టెలు, పట్టుకున్నరు. అందరూ సోలుపుగా నడుస్తాంటే.. పిల్లల లొల్లి, కోళ్ళలొల్లి జాతర జాతర. వాగొడ్డుకు ఉండే చెట్లల్లకు గూడెం పెద్ద మనుషులు ముందు నడుస్తా వుంటే, మేము వెనక నడుస్తున్నము సంచులతోనీ. నడవలేనీ ముసలి ముతుక, మరీ సిన్న పిల్లలు, బాలెంతలు టూ వీలర్స్ మీద పోయిండ్రు.

కొంచెం దూరం పోయినంక ‘అమ్మా నాకియ్యే, కొంచెం సేపు నేను గూడ ఎత్తుకుంట’ అని మా పెద్దక్క గంపెత్తుకున్నది. ‘తర్వాత నాకియ్యక్కా నేను గూడ ఎత్తుకుంట’ అన్న హుషారుగా. మా పెద్దమ్మలు చిన్నమ్మలు, వాళ్ళ బిడ్డలు కోడండ్లు ఒకల తర్వాత ఒకలు గంపలెత్తుకుంటండ్రు. వో మైలు దూరం నడిసినంక పెద్దమ్మా! ‘ఏందే చెట్లన్నీ కొట్టేసినారే, తొవ్వపోంటి సెట్లే కనబడతలేవు. ఇదివరకు నా సిన్నప్పుడు మన వూరి నిండా, పోలిమేరల బోలెడు బొచ్చెడు చెట్లుండే.. పోయినేడు వున్న సెట్లు ఈ యేడు కనబడత లేవు’ అటిటు వురికే నా బిడ్డ సేయి పట్టుకొని...

‘సెట్లనేడ బతుక నిత్తండ్రు బిడ్డా! ఒక్కొక్కడు చెట్లను కొట్టుడు పీలేట్లు జేసి అమ్ముకునుడు. సెట్టేడ బతుకుతది, పిట్టేడ బతుకుతది, బూమేడ బతుకుతది. అంతా నాశనం సేత్తండ్రు. గిట్లా మాట్లాడుకుంటా నడుస్తాంటే మా అమ్మ, పెద్దమ్మ సడన్గా పక్కనున్న పిల్లబాటలబడి పోయిండ్రు. ఎందుకో అనీ చూసేటాలకు, తంగెడు పూలు సిగనిండ బెట్టుకొని కొన్ని సేతుల పట్టుకొని మీ ఆడిపిల్లలందరు పెట్టుకోండ్రి అని యిచ్చిండ్రు మాకు.

‘యే ! గీ పూలెవరు పెట్టు కుంటరే, నాకద్దే. మల్లెలు కనకాంబరాలు, గులాబీలు పెట్టుకుంటరు గానీ గీ పూలనెవ్వరు తలల పెట్టుకుంటరే.. సిటీల ఎవ్వరి తలల గీ పూలు కననేపడయి. ఇదివరకు బతుకమ్మలల్లా కనబడేయి. ఇప్పుడండ్ల గూడ కానొస్త లేవు’ అని ఏందో షానిగ సెప్పబోయిన.

‘అరే.. అట్లనద్దు బిడ్డా! తంగేడును తక్కువ జేయొద్దు. ముత్తయిద పూలు. గౌరమ్మ నోములకు తంగేడు పూలే పెడుతరు. తంగేడాకు పొడితోనే గౌరమ్మ ముంగట పట్టు (ముగ్గు) ఎయ్యాలే. అది ఎప్పుడు పడితప్పుడు పూయది. దసురకు దాసుకుంటది. దియ్యల పండుక్కు దిగబూస్తది. గందుకే గౌరమ్మ నోములు దియ్యల పండుక్కే సేత్తరు.’

‘అమ్మా! గీ నోములు మనమెన్నడన్న సేసినమే..’ అడిగిన అనుమానంగా.

‘సెయ్యలేదు. మనగూడెం ఆడోళ్లకు లేవు. వూల్లే ఆడోళ్ళు సేత్తరు.’ తంగేడు పూసినప్పుడు దాని పూలు పెట్టుకోవాలే. లేకుంటే, ‘ఓ తలకు మాసిన ఆడోల్లార నన్ను తలల బెట్టుకోండ్రె, సల్లగుంటరు అని పిలుసుకుంట తిడుతయట. అందికే తంగేడు పూలేడ పూసినా సూసి సూడనట్టు పోవద్దు’ అని సెప్పింది మామ్మ.

సిటీల గీ పూలు తెలువయి. మా టీచర్లు కొందరు తంగేడు సెట్టు ఎట్లుంటదని అడిగినోల్లు గూడున్నరు.’

‘సిటీలేంది మన ఊర్లల్ల గూడ అందరాడోళ్ళు పెట్టుకుంటరా. మనసోంటి పనిపాటలు జేసుకొని బతికే ఆడోల్లమే ఖాయిషుగ పెట్టుకుంటము’ అని నడక ఆపకుంటనే నా జెడల, మాక్క జెడల పెట్టింది ప్రేమగా మా పెద్దమ్మ.

గీ పిల్టర్లు గిప్పుడచ్చినయి గానీ, గా కాలమ్‌ల తంగేడు పూలే పిల్టర్లు. బతుకమ్మల పేరుతోనీ తంగేడు పూలను సెర్లెత్తే... నీళ్లల్ల గింత నాసు, బీసు, పురుగు పుట్ర లేకుంటా తేటగ జేస్తే.. గవ్వి తాగి బతికిండ్రు మనోల్లు మా పెద్దక్క మాట కలిపింది. ఒక్క పూలేనా గీ మందులు మాకులు లేని కాలాన మా ఎనుకటి తరాలకు తల్లోలే నిలవడ్డయి తంగేడు సెట్లు. పొద్దంతా వానల బురదల పనిచేసేటోల్ల కాళ్లన్నీ నాని జావ జావయితే తంగేడాకు నూరి కాళ్లకు పెట్టుకుంటే.. ఒక్క పూటకే దెంక పోయేదని మా ముసలోళ్ళు కొందరు ఇప్పటికీ గా వైదిగం సెప్తరు’ మా పెద్దమ్మ ఆయాస పడుకుంటా.

లచ్చక్కా! నా ఎరుకల గూడ మన తాతోల్లకు లంద గోలెముండేనాట. గా సంగ జ్జెప్పవానే బిడ్డెలింటరు. ఔ! గప్పుడు లందగోళాలుండే. తోలు నానేసే గోలెమును లందంటరు. ఆ కాలాన మోటగొట్టే తొండం, కమ్మరి తిత్తులు, నీళ్ల తిత్తులు, తలుగులు, సెప్పులు గిట్ల ఎవుసానికి అక్కెరకచ్చే అరొక్క యిసిరె తోలుతోనే తయారు జేద్దురు మన తాతోల్లు.

తంగేడు చెక్క లేకుంటే తోలు బయటికత్తదా. తోలు, లందల వారమ్ నీళ్ళల్ల నాననిచ్చి సాఫ్ జేసినంక, మళ్ళా వారమ్ తంగేడు సెక్కల్ల నాన బెట్టి నాంకనే తోలు గమ గమ వాసనలతో తోలు బైటికత్తది. తోలు నాననీకి నీళ్లన్నీమోసి మోసి నా నెత్తంత కాయగాసింది. లందల మురుగువాసన పట్టిన తోలుకు మురుగంతా తీసేసి మంచి వాసనతో మెత్తగా, సాఫ్‌గా నున్నంగా జేసేది గీ తంగేడు సెక్కే. తంగేడు చెక్కలేకుంటే, తోలు లేదు తోలు లేకుంటె ఎవుసం లేదు. మనకు బువ్వలేదు. గసోంటి తంగేళ్ల బాటలు చూద్దామన్న కనబడకుంట జేసిరి.

పెద్దమ్మ చెప్పిన తంగెడు ముచ్చట్లు తలకెక్కినంక, ‘ఇంత విలువ గల్ల తంగేడును తెలువక గేలి జేత్తినే పెద్దమ్మా’ నొచ్చుకున్న మొఖంబెట్టి. మనం ఎట్లా బతికినమో, మన సుట్టూత వున్న సెట్టు సేమ గొడ్డు గోదా మనల్ని ఎట్లా బతికిచ్చినయో ఎట్లా సాయంగున్నయో ఇప్పటి మన పోరగాండ్లకు తెల సెప్పాలె బిడ్డా! ‘మా స్కూలు పిల్లలకు మా పిల్లలకు గీసొంటి జ్ఞానాలన్ని సెప్పుతనే. రేపు పట్నం బోయేటప్పుడు తల నిండా తంగేడు పూలు పెట్టుకొని పోతనే పెద్దమ్మా’.

వాగొడ్డచ్చింది, చెట్ల తీర్తమచ్చింది రాండ్రి రాండ్రి అని ఎవరో పిలుస్తన్నరు. వావ్వో గంత దూరం నడుస్తనో లేదో అనుకున్న, ముచ్చట్లల్లవడి దూరమే తెల్వకుంట నడిసిన. పెద్దమ్మ సెప్పిన సుద్దులు మైండంత పరుసుకున్న పచ్చబొట్టైన సెట్లతీర్తం.

జూపాక సుభద్ర


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్