ఉన్నత చదువుల కోసం డబ్బుల్లేక ఇబ్బందులు పడినా.. చదువుపై ఉన్న పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పేదరికాన్ని అధిగమించాడు. తండ్రి నమ్మకాన్ని తన బలంగా మార్చుకొని ఉన్నత విద్యను పూర్తి చేశాడు. అందుకు ఇష్టంగా అనేక కష్టాలు అనుభవించాడు. చివరకు ఎన్ఐఎన్‌లో శాస్త్రవేత్తగా ఎదిగాడు. కూలీ పనులు చేసిన ఆ చేతులే నేడు శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నాయి. 37 ఎండ్ల వేల్పుల సురేష్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఈ వారం ‘జోష్’లో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మారుమూల ప్రాంతమైన మలహార్‌రావు మండలం వల్లేంకుంట గ్రామంలో వేల్పుల వీరయ్య, అరుణ దంపతుల తొలి సంతానం సురేష్. తన కొడుకు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతస్థాయికి చేరాలని ఒకటో తరగతిలోనే హాస్టల్‌లో ఉంచి చదివించాడు తండ్రి. సురేష్ కూడా చిన్ననాటి నుంచే చదువులో చురలుుగా ఉండేవాడు. గురుకుల ప్రవేశ పరీక్షలో ఎంపికై ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు సూరయ్యపల్లిలోని గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం కరీంనగర్‌లో ఇంటర్మీడియట్, పాల్వంచలో డిగ్రీ పూర్తి చేశాడు.
ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు
డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఉన్నత విద్య కోసం ప్రవేశ పరీక్షలు రాయాలి... మంచి ర్యాంకు రావాలంటే కోచింగ్ తప్పనిసరి.. అందుకు డబ్బులు కావాలి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. దీంతో పాటు మానేరు వాగులో ట్రాక్టర్‌లో ఇసుక నింపే పనులకు రోజువారీ కూలీగా వెళ్లేవాడు.
బంగారం కుదవపెట్టి మరీ...
కొడుకుకి చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి... కుమారుడి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా.. భార్య ఒంటిమీద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చారు. ‘నువ్వు చదువుకో పోరా’ అంటూ కుమారుడిని హైదరాబాద్‌కు పంపించారు. తండ్రి అందించిన ఆ నమ్మకమే సురేష్ జీవితంలో కీలక మలుపుగా మారింది.
ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు
హైదరాబాద్‌కు వచ్చిన సురేష్ కోచింగ్ తీసుకుని పీజీ ప్రవేశ పరీక్ష రాశాడు. దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలైన బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఐఐటీ రూర్కీ, ఉస్మానియా యూనివర్సిటీ తదితర విద్యాసంస్థల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో చదువుకు అయ్యే అధిక ఖర్చులు, భాషాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పీజీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఉద్యమంలోనూ.. చదువులోనూ..
పీజీ పూర్తయిన తర్వాత అదే విభాగంలో తాత్కాలిక అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో ఉత్తమ ప్రొఫెషనల్ అవార్డు అడ్నుకున్నాడు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. AMSA (ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్)లో చేరి రాష్ట్రమంతా కలయదిరిగాడు. ఉద్యమ సమయంలో లాఠీదెబ్బలు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు వంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ చదువును ఏ మాత్రం పక్కన పెట్టలేదు.
విదేశాల్లోనూ పరిశోధన
పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సురేష్‌కు ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేసే అవకాశం లభించింది. సహజసిద్ధమైన పదార్థమైన కొండగోగు జిగురును ఉపయోగించి బయోజెనిక్ మల్టీమెటల్ నానోకాంపోజిట్ పదార్థాల తయారీ, వాటి లక్షణాలు, జీవ సంబంధిత అనువర్తనాలపై (“Synthesis, Characterization and Evaluation of Biogenic Multimetal Nanocomposite Material and Its Biological Applications.”) పరిశోధన చేసి 2022 లో డాక్టరేట్ పట్ట పోందారు. పరిశోధనలో భాగంగా విదేశాల్లోనూ పరిశోధన చేసే అవకాశం లభించడంతో పారిస్‌కు వెళ్లాడు.
ప్రేమ.. పెళ్లి.. మరో ప్రత్యేకత
పరిశోధన సమయంలో తనతో పాటు పరిశోధన చేస్తున్న ధాత్రితో పరిచయం ఏర్పడింది. అది ఆ తరువాత ప్రేమగా మారింది. వారిది వేరు వేరు సామజిక వర్గాలు కావడంతో చాలా సమన్వయంతో ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. విద్య ద్వారా ఏర్పడిన పరిచయం కుటుంబ బంధమైందని సురేష్ అంటుంటాడు.
పేద విద్యార్థులకు అండగా..
పేదరికం నుంచి బయటపడటానికి, జీవితాన్ని మార్చుకోవడానికి విద్యే ప్రధాన మార్గమని సురేష్ బలంగా విశ్వసిస్తాడు. ఫూలే, అంబేద్కర్ చూపిన విద్యా మార్గమే సామాజిక మార్పుకు దారితీస్తుందని ఆయన చెబుతుంటాడు. తన జీవితంలో ఎదురైన కష్టాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగాడు కనుకే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో సురేష్ తన తోటి విద్యార్థులకు, ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారికి అండగా నిలిచేవాడు. గ్రామాలనుండి నుంచి చదువు కోసం లేదా ఇతర పనుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన వారికి తన హాస్టల్ గదిలో ఆశ్రయం కల్పించేవాడు.
శాస్త్రవేత్తగా కొత్త ప్రయాణం..
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించిన వేల్పుల సురేష్.. పీహ్చెడీతో తన విద్యా ప్రస్థానాన్ని ముగించకుండా, శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను కొనసాగించారు. పరిశోధనలో సాధించిన అనుభవాన్ని వృత్తిపరమైన రంగంలోకి తీసుకెళ్లి, బయోఫార్మాస్యూటికల్, క్లినికల్ ల్యాబొరేటరీ విభాగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2022 నుంచి 2024 వరకు హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న Applied Bio-pharmaceuticals and Clinical Labs (Dr.ABC Labs)లో Scientistగా పనిచేశాడు. ఈ కాలంలో బయోఫార్మాస్యూటికల్, క్లినికల్ ల్యాబొరేటరీ రంగాల్లో తన నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకున్నాడు. పరిశోధనలో సంపాదించిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తూ వృత్తిపరంగా ఎదిగాడు. అనంతరం 2024 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ తార్నాకలోని ICMR–National Institute of Nutrition (NIN)లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. Diet and Biomarkers Survey in India (DABS-I) కార్యక్రమంలో Lab Manager (Consultant–Biochemistry)గా సేవలందిస్తున్నాడు.
దేశవ్యాప్తంగా ఆహారం, పోషకాహారం, ఆరోగ్యానికి సంబంధించిన బయోమార్కర్లపై సమాచారాన్ని సేకరించి, విశ్లేషించే ఈ కార్యక్రమంలో ల్యాబొరేటరీ కార్యకలాపాల నిర్వహణలో సురేష్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
ఒకప్పుడు ఉన్నత చదువుల కోసం డబ్బుల్లేక కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి.. నేడు దేశంలోని ప్రముఖ పోషకాహార పరిశోధనా సంస్థ అయిన NINలో శాస్త్రవేత్తగా కీలక బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరుకోవడం ఆయన ప్రస్థానంలోని మరో ముఖ్యమైన మైలురాయి.
కష్టాలు ఆపలేదు.. అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు సాగాడు. పీహ్చెడీతో ఆగిపోకుండా.. శాస్త్రవేత్తగా, ల్యాబొరేటరీ మేనేజర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు వేల్పుల సురేష్..
ఓదెల రాజబాపు, 9493261367






కామెంట్‌లు (0)