మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొన్ని చరిత్రకు సంబంధించినవి. కొన్ని భక్తికి సంబంధించినవి. కొన్ని కాలగమనానికి సంబంధించినవి. సమాజంలో ఒక స్ఫూర్తిని నింపి, మానవత్వాన్ని బోధించేందుకు ఈ పండుగలు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ.
తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా ఆనందంగా జరుపుకునే ఈ పండుగకు ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. పూలను అందంగా పేర్చి బతుకమ్మను తయారుచేసి, దాని చుట్టూ చేరి పాటలు పాడుతూ తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఆడే బతుకమ్మ సంబరం తెలంగాణ పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
మహిళల ఐక్యతకు వేదిక
బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీక. మహిళల ఐక్యతకు వేదిక. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం. ముఖ్యంగా మహిళలు తమ కుటుంబ బాధ్యతల నుంచి కొంత సమయం బయటకు వచ్చి ఒకరితో ఒకరు కలుసుకొని తమ ఆనందాన్ని పంచుకునే సామాజిక సందర్భంగా బతుకమ్మ నిలుస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక అనేక కథలు ఉన్నాయి. చోళ రాజు అయిన ధర్మాంగదునికి వందమంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టక పుట్టక పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టి, నిండు నూరేళ్లు బతకాలని ఆ అమ్మాయిని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి బతుకమ్మగా పూజలు అందుకుంటుందని అందరూ నమ్ముతారు.
తొమ్మిది రోజుల సంబురం
‘బతుకమ్మ’ అంటే ‘బతుకు అమ్మ’ అనే భావంతో జీవనాన్ని సౌభాగ్యాన్ని ప్రకృతిని గౌరవించే సంప్రదాయం ఇందులో కనిపిస్తుంది. సాధారణంగా వివిధ రకాల రంగు రంగుల పూలను సేకరించి వాటిని గోపురం ఆకారంలో పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చ గన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి పూలను సేకరించి అందంగా పేర్చి పైన పసుపు ముద్దను పెట్టి గౌరీదేవిగా కొలుస్తారు. తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. తొమ్మిది రకాల ఫలహారాలను సమర్పిస్తారు. మొదటిరోజు మహాలయ అమావాస్య (పెత్రమాస) నాడు పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెరను ఫలహారంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. మూడవరోజు ముద్దపప్పు బతకమ్మగా పిలుస్తారు. ఈరోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా చేస్తారు. నాలుగవ రోజు నాన్న బియ్యం, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలకల బతుకమ్మ, ఈరోజు ఆరవ రోజున అర్రెమి అంటారు. ఈరోజు ఎవరి ఇళ్లలో వాళ్లు బతుకమ్మ ఆడుతారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా, తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పువ్వులు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటి శుద్ధి అవుతుంది. అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయింది
పాటలకు ప్రత్యేకం
బతుకమ్మ పాటల బాణీలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఆయా ప్రాంతాల ఆచారాలు, పేర్లు, అలవాట్లని, భాషను కలబోసుకుని, ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోల్ అని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నేలో అని మాటలను చివరన చేరుస్తూ పాటలు పాడుతారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు, కన్నవారు ఆడపిల్లలకు కట్న కానుకలను బహుకరిస్తారు. అత్తగారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు పుట్టింటి వారి కోసం ఎదురుచూస్తుంది. ఆ ఎదురుచూపును కూడా పాటల రూపంలోనే చెబుతుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు పాటల రూపంలో పాడుకుంటారు.
పాత బాణీలలో కొత్త చైతన్యం
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు తల్లి బాధ వినవమ్మా ఉయ్యాలో
పుట్టింటి గడప దాటి వెళ్లిన వేళ
పరాయి ఇంట్లో కన్నీటి జాడ ఉయ్యాలో
కట్నమంటూ గుండె కోసే మాటలు
కానుకలంటూ కాటికి పంపే చేతలు
మౌనంగా భరించమని చెప్పకమ్మా
మా ఆడబిడ్డకు అండగా నిలువమ్మా
బతుకమ్మ బతుకమ్మ అంటూ
బాధలన్నీ నీ ముందే చెప్పుకుంటూ
భయపడని బతుకును మాకు ఇవ్వమ్మా
ఆత్మగౌరవంతో నిలబడే దారి చూపమ్మా
గునుగు పూల వలయంలో గుండెలు కలిసాయి
ఆడపడుచుల మాటల్లో బాధలు తెలిశాయి
కన్నీటి చారలను దాచింది చాలమ్మా
అన్యాయాన్ని భరించేది ఇక లేదమ్మా
చేతిలో చెయ్యేసి ఒకటిగా నిలుద్దాం
హక్కులకై పోరాడ గొంతేత్తుదాం
ఆడపిల్ల అంటే ఆత్మ గౌరవమని చాటుదాం
చదువు కావాలి స్వేచ్ఛ కావాలి
తన కాళ్ళపై తను నిలిచే బలం కావాలి
భయం లేని బతుకును అందించమ్మా
ప్రతి ఆడపిల్ల నవ్వును కాపాడమ్మా’
అంటూ పాత బాణీలలో కొత్త చైతన్యాన్ని నింపుకోవడం ప్రతి ఆడబిడ్డ తక్షణ కర్తవ్యంగా భావించాలి. ఈ విధంగా బతుకమ్మ పాటలు తెలంగాణ స్త్రీల భావ ప్రపంచానికి అద్దం పడతాయి. కుటుంబ జీవితం. పుట్టింటి జ్ఞాపకాలు, అత్తింటి అనుభవాలు, ప్రకృతి అందాలు, పండుగల ఆనందం లాంటివి పాటలలో కనిపిస్తాయి.
అందమైన సాంస్కృతిక దృశ్యం
పూల సువాసన, రంగుల అందం, జానపద గీతాలు మాధుర్యం, మహిళల సమూహ నృత్యం ఇవన్నీ కలిసి బతుకమ్మ పండుగ ఒక అందమైన సాంస్కృతిక దృశ్యంగా మారుతుంది. బతుకమ్మ పాటల్లో తెలంగాణ జీవన విధానం కుటుంబ సంబంధాలు, ప్రకృతి, పల్లె సంస్కృతి, స్త్రీల అనుభవాలు ప్రతిబింబిస్తాయి. తరతరాలుగా పాడుకుంటున్న ఈ పాటలు తెలంగాణ ప్రజల మౌఖిక సాహిత్య సంపదను ముందు తరాలకు అందించే సాంస్కృతిక వారసత్వంగా కాపాడుతున్నాయి.
మహిళలే ప్రధాన పాత్రధారులు
బతుకమ్మ పండుగలో మహిళలే ప్రధాన పాత్రధారులు. చిన్నా పెద్ద భేదాభావం లేకుండా అందరూ ఒక దగ్గర చేరి ఆడటం, ఆర్థిక స్థితి వంటి భేదాలను పక్కనపెట్టి అందరూ ఒకే సమూహంగా ఆడటం వల్ల బతుకమ్మ సామాజిక ఐక్యతను పెంచే పండుగగా చెప్పవచ్చు. మహిళా సాధికారతకు మొదటి మెట్టు ఐక్యత. ఒకరి సమస్యను మరొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం, తమ అనుభవాలను పంచుకోవడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బతుకమ్మ మహిళలను ఒకచోట చేర్చి, వారి సామాజిక సంబంధాలను బలోపేతం చేసే వేదికగా పనిచేస్తుంది. మహిళా సాధికారత అంటే మహిళలు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను ఆత్మవిశ్వాసంతో తీసుకోగలగడం. విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలను పొందడం. బతుకమ్మ ఒక్కటే మహిళా సాధికారతను సాధించగలరని చెప్పలేము. కానీ మహిళల ఆత్మవిశ్వాసం, ఐక్యత, నాయకత్వం, సామాజిక భాగస్వామ్యం పెరగడానికి ఇది ఒక సాంస్కృతిక వేదికగా ఉపయోగపడుతుంది. బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. బతుకమ్మలను సిద్ధం చేయడం, కార్యక్రమాలను సమన్వయం చేయడం, అందరినీ కలుపుకొని వెళ్లడం వంటి పనులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుతాయి.
ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
బతుకమ్మ సందర్భంగా పూలకు, పూల అలంకరణలకు, చేతి వృత్తి వస్తువులకు, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పూల అలంకరణలు, ఆహార పదార్థాలు, హస్త కళా వస్తువుల వంటి ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం వల్ల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు లభిస్తుంది. ఈ పండుగలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో విరివిగా లభించే స్థానిక పూలను ఉపయోగించడం ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలను పండుగలో భాగం చేస్తారు. పూలను గౌరవించడం, చెట్లను సంరక్షించడం, ప్రకృతిని ప్రేమించడం వంటి విలువలను బతుకమ్మ గుర్తు చేస్తుంది. అందుకే బతుకమ్మను ప్రకృతి- మహిళ- సమాజం మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
వినోదానికే పరిమితం కాదు
నేటి కాలంలో బతుకమ్మ తెలంగాణ గ్రామాలకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాదుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో, విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు కూడా బతుకమ్మను జరుపుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలు బతుకమ్మ కార్యక్రమాలను విధిగా నిర్వహిస్తున్నాయి. ఆధునిక కాలంలో బతుకమ్మ మహిళలకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి కూడా ఒక వేదికగా మారుతుంది. పాటలో నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక అవగాహన కార్యక్రమాల్లో మహిళలు చురుకుగా పాల్గొంటున్నారు. అయితే పండుగను కేవలం వినోదానికి పరిమితం చేయకుండా మహిళా విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, సమానత్వం, భద్రత, హక్కులపై అవగాహన లాంటి అంశాలలో అనుసంధానిస్తే బతుకమ్మ సామాజికంగా మరింత ఉపయోగకరమైన వేదికగా మారుతుంది.
అప్పుడే సామాజిక అర్థం
బతుకమ్మ తెలంగాణ నేల సంస్కృతికి ప్రతీక. అది పూల పండుగ మాత్రమే కాదు. మహిళల ఆనందం, ఐక్యత, ఆత్మవిశ్వాసం, ప్రకృతి, ప్రేమ, సంస్కృతిక, వారసత్వం కలగలిసిన జీవనోత్సవం. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ చేరి పాడే ప్రతి పాటలో ఒక జ్ఞాపకం ఉంది. ప్రతి చప్పట్లలో ఎంతో ఆనందం ఉంది. ప్రతి అడుగులో ఒక ఐక్యత ఉంది. ఆ ఐక్యతను మహిళా సాధికారతకు ఉపయోగించుకుంటే బతుకమ్మ పండుగకు మరింత సామాజిక అర్థం లభిస్తుంది. పూలతో బతుకమ్మను పేర్చినట్లే ఐక్యతతో మహిళల జీవితాలను మార్చుకోవాలి. పూల వలయంలా మహిళలంతా ఒక్కటై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని బతుకమ్మ పండుగ ఇచ్చే గొప్ప సందేశం. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రస్తావన, ఆట లేని సమావేశం లేదంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ ఆటపాటతో ఉద్యమం ఒక పోరాట రూపమై ఎదిగింది. ఉద్యమంలో కూడా స్త్రీలను భాగస్వామ్యం చేసింది. మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని వచ్చి పోరాట బిడ్డలకు స్వాగతం చెప్పి నుదుటన వీర తిలకం దిద్దారు. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడిగా కొలవడం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా పాడుకోవడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు. ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు. .
డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ, 9704226681






కామెంట్‌లు (0)