Magazines

భీంగల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి

3 గంటల క్రితం

drought zone
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 
జిల్లాలోని అన్ని మండలాల కంటే భీంగల్‌ చాలా వెనకబడిందనీ, ఎల్‌నీనోతో పంటలు ఎండి రైతులు అరిగోసలు పడతున్నారని, వెంటనే భీంగల్‌ను కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు రాజునాయక్, ఇక్రమ్, సిద్ధపల్లి రాములు, జీసన్, అబ్దుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు నవతెలంగాణతో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో చేతికి వచ్చిన పంటలు నీళ్ళులేక నేలవాలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవికాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశముందని చెప్పారు. గతేడాది 46 డిగ్రీల వేడి తీవ్రతతో ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కున్నారనీ, ఈ ఏడాది ఎల్‌నినో దాడితో 48-50 డిగ్రీలతో ఎండలు మండిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇప్పటికే దాదాపు సగం పంట నీళ్ళలేమితో రైతుల చేజారిపోయి, పెట్టుబడి రాక అప్పులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, నాయకులు నిమ్మకునీరత్తనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలోని బడా నాయకులు టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డిలు ఈ కఠిన పరిస్థితులను చూస్తూనే మండల రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, భీంగల్‌ను కరువు మండలంగా ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు వీరు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


కేసీఆర్‌ హయాంలో మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భీంగల్ మండలాన్ని సస్య శ్యామలం చేయడానికి వేముగంటి ప్రాజెక్టు లిఫ్టు, కాలేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని లిఫ్టులను, పెద్దవాగు, కప్పల వాగు నింపి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నముకైన వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారనీ, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, కాలేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తు, సకాలంలో రైతుబంధు, రైతు బీమా, పెట్టుబడి సాయం అందించారనీ, కరోనా విపత్తు సమయంలోనూ కొత్త రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని తెలిపారు.


ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వమొచ్చే.. కరువు తెచ్చే అన్నచందంగా రాష్ట్రం తయారైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పంటపొలాల్లో సిరులు పండించారనీ, ఇప్పుడు అందుకు భిన్నంగా కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకముందే కాంగ్రెస్ నాయకులు మొద్దునిద్ర వీడి, సాగు, తాగునీటికి శాశ్వత ప్రణాళికాలను రూపొందించాలని హితవు పలికారు. వెంటనే భీంగల్‌ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మరోసారి పునరద్ఘాటించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్