Magazines

వడ్డెరంగాపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

16 నవంబర్, 2026

Vadderangapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం


- 91ఇళ్లలో తనిఖీలు..

- 15వాహనాలకు చలాన్లు

- సరైన పత్రాలు లేని ఐదు ద్విచక్ర వాహనాలు సీజ్‌

- కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు

- సీఐ నాగరాజు రెడ్డి


నవతెలంగాణ - అశ్వారావుపేట


మండలంలోని కోయ రంగాపురం పంచాయితీ వడ్డెరంగాపురం గ్రామంలో సోమవారం ఉదయం అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి నేతృత్వంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు,పాల్వంచ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సతీష్ కుమార్ సూచనలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని 91ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. మొత్తం 83ద్విచక్ర వాహనాలు, 11ఆటోలు, ఆరు ట్రాక్టర్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 15ద్విచక్ర వాహనాలకు చలాన్లు విధించి అక్కడికక్కడే జరిమానాలు వసూలు చేశారు.సరైన ధ్రువపత్రాలు చూపించని మరో ఐదు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.


అనంతరం గ్రామస్తులకు పోలీసులు అవగాహన కల్పించారు. రాబోయే సంక్రాంతి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గ్రామాల్లో కోడిపందాలు, పేకాట వంటి జూద శిబిరాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.


మండలంలో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి రవాణా, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తూ,చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడెం చినగంగమ్మ, అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓ, ఎస్సై సాయి కిశోర్ రెడ్డి, అశ్వారావుపేట, దమ్మపేట అదనపు ఎస్సైలు దేవ్ సింగ్, బాలస్వామిలు, అశ్వారావుపేట సర్కిల్ పోలీసు సిబ్బంది, వడ్డెరంగాపురం సర్పంచ్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్