- ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు
- రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి 12 అడుగుల భారీ కొండచిలువ జనావాసాల్లోకి చేరి కలకలం రేపింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే స్పందించిన స్థానిక అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలోని స్నేక్ క్యాచర్ ఎక్స్‌పర్ట్, రిటైర్డ్ అటవీ శాఖ అధికారి మహమూద్‌ను ఘటనా స్థలానికి రప్పించారు. స్నేక్ క్యాచర్ మహమూద్ ఆ 12 అడుగుల భారీ కొండచిలువను అటవీ శాఖ సిబ్బంది సాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు.
స్థానికులు తెలిపిన కథనం మేరకు... సత్తుపల్లి మున్సిపల్ పరిధిలోని కృషి బైపాస్ రోడ్డులో ఉన్న భారత్ ముళ్ల తీగల ఫ్యాక్టరీ సమీపంలో గత మూడు నెలలుగా ఓ భారీ కొండచిలువ సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ విషయమై స్థానికులు అప్పట్లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే వారు స్పందించారు. కొండచిలువను పట్టుకొనేందుకు అటవీ అధికారులను పిలిపించారు. జేసీబీతో ఆ ప్రాంతంలోని పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేయించారు. అయితే అప్పట్లో ఆ కొండచిలువ అక్కడి నుంచి తప్పించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి అదే కొండచిలువ ముళ్ల తీగల ఫ్యాక్టరీ రోడ్డు వద్ద మళ్లీ ప్రత్యక్షమైంది.
సమాచారం అందుకున్న ఎఫ్‌బీఓలు అబీద్, కోటేశ్వరరావు, బేస్ క్యాంప్ సిబ్బంది బాబురావు స్నేక్ క్యాచర్ ఎక్స్‌పర్ట్ మహమూద్‌ను తీసుకుని అప్పటికప్పుడే కొండచిలువ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అటవీ సిబ్బంది సాయంతో 12 అడుగుల భారీ కొండచిలువను స్నేక్ క్యాచర్ మహమూద్ సురక్షితంగా పట్టుకున్నారు. పట్టుకున్న ఆ కొండచిలువను అటవీ సిబ్బంది సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎక్కడైనా కొండచిలువలు కనిపిస్తే ప్రజలు వాటిని చంపకుండా వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా సమయస్ఫూర్తితో స్పందించి కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్
మహమూద్‌ను, అటవీ శాఖ సిబ్బందిని ఎమ్మెల్యే రాగమయి దయానంద్, మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, స్థానికులు అభినందించారు.







కామెంట్‌లు (0)