- ప్రాజెక్టు పరిశీలనలు, పత్రికా ప్రకటనలేనా?
- పంట కోల్పోయిన రైతులకు పరిహారం ఏది?
- యుద్ధప్రాతిపదికన పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ చేపట్టాలి
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్
నవతెలంగాణ - అశ్వారావుపేట
పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడానికే ప్రజాప్రతినిధులు పరిమితమవుతున్నారని, వాస్తవంగా పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, ధ్వంసమైన ప్రాజెక్టును పునరుద్ధరించడం పై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తగిన దృష్టి సారించడం లేదని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య విమర్శించారు.
ఇటీవల సంభవించిన మురసు తుఫాన్ ప్రభావంతో ధ్వంసమైన పెద్దవాగు ప్రాజెక్టు రింగ్ బండ్ ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్ గతంలో ఒకసారి, 2024లో రెండోసారి, తాజాగా సంభవించిన తుఫాన్ కు మూడోసారి కొట్టుకుపోయిందని గుర్తుచేశారు.
2024లో రింగ్‌బండ్ కొట్టుకుపోయిన సమయంలో గిరిజన రైతుల పొలాల్లో భారీగా ఇసుక మేటలు పేరుకుపోయాయని తెలిపారు. ఇసుక మేటలను తొలగించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని అప్పట్లో హామీలు ఇచ్చారని, అయితే నేటికీ ఇసుక మేటల తొలగింపు పూర్తికాలేదని ఆరోపించారు. కొద్దిమందికి మాత్రమే నష్టపరిహారం అందించి బాధితుల కళ్లనీళ్లు తుడిచినట్లుగా చేశారని ఎద్దేవా చేశారు.
సుమారు రూ.3 కోట్లతో రింగ్‌బండ్ నిర్మించినప్పటికీ, అధికారుల పర్యవేక్షణ, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే అది మళ్లీ కొట్టుకుపోయిందని పుల్లయ్య విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన రక్షణ వ్యవస్థలు వరుసగా విఫలమవుతుంటే బాధ్యత ఎవరిదనే ప్రశ్నకు అధికారులు, పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.3 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన రింగ్‌బండ్ ఒక్క తుఫాన్‌కే కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పుల్లయ్య విమర్శించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించారా? సాంకేతిక పర్యవేక్షణ సక్రమంగా జరిగిందా? పనులు పూర్తయిన తర్వాత సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా తనిఖీలు నిర్వహించారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి వరద వచ్చినప్పుడూ ప్రజాప్రతినిధుల సందర్శనలు, అధికారుల హామీలు, పత్రికా ప్రకటనలతోనే సరిపెట్టకుండా, ప్రజాధనం వృథా కావడానికి కారణమైన వారిపై బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులు పంటలు, భూములు కోల్పోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, పాలకులు కేవలం పరిశీలనలకే పరిమితమైతే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదన్నారు.
బాధిత రైతులకు తక్షణ పరిహారం, ఇసుక మేటల తొలగింపు, రింగ్‌బండ్ నాణ్యతపై సమగ్ర విచారణతో పాటు పెద్దవాగు ప్రాజెక్టును శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించడమే ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోని గిరిజన రైతులు స్వల్పకాలిక పంటలు సాగు చేశారని తెలిపారు. అయితే అకాలంగా విరుచుకుపడిన మురసు తుఫాన్ ఆ పంటలను సైతం తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.
వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి, ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని గిరిజన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు సమస్యను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. తాత్కాలిక మరమ్మతులతో కాలయాపన చేయకుండా, భవిష్యత్తులో వరదల సమయంలో మళ్లీ గండ్లు పడకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి, గిరిజన సంఘం జిల్లా నాయకులు ప్రసాద్, మడిపల్లి వెంకటేశ్వరరావు, రంగాపురం గిరిజన రైతులు జల్లి దామయ్య, జల్లి ముత్యాలు, చిచ్చోడి కన్నయ్య, జల్లి తమ్మయ్య, చిచ్చోడి రవి, మడివి హరీష్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)