నవతెలంగాణ-మల్హర్ రావు
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కెడిసిసిబి) తాడిచర్ల శాఖ ఆధ్వర్యంలో మండలం అడ్వాలపల్లిలో గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క అధ్యక్షతన ఆర్థిక, అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించి, పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. బ్యాంకులో డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాంకు ద్వారా క్రాప్ లోన్లు, వ్యవసాయ రుణాలు, తనఖా రుణాలు, మ్యారేజి రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, విద్యా రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు వంటి వివిధ రకాల రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుందని, భవిష్యత్తులో రుణాలు పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి బీమా పథకాల ద్వారా తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ పొందవచ్చని తెలిపారు. అర్హతలు, పథకాల నిబంధనలకు అనుగుణంగా బీమా ప్రయోజనాలను పొందవచ్చని వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ఓటీపీ బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు.
ఖాతాదారుల విలువైన వస్తువుల భద్రత కోసం బ్యాంకులో లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.
బ్యాంకు అందిస్తున్న వివిధ సేవలను సద్వినియోగం చేసుకొని పొదుపు అలవాటును పెంపొందించుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు అజ్మీరా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ బానోత్ రాజేందర్, సిపిఎల్ ప్రతినిధి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, సిఈఓ సంతోష్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ సదయ్య, బ్యాంకు సిబ్బంది, సంఘాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)