Magazines

పేదల కడుపు నింపడమే లక్ష్యంగా ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

5 గంటల క్రితం

Minister Duddilla Sridhar Babu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ – మల్హర్ రావు: పేదలకు కడుపునిండా నాణ్యమైన ఆహారం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

ఆదివారం కాటారం మండలం మేడిపల్లి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు కలుగుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారుడి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పేదల కడుపు నింపడంతో పాటు వారికి నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు ధనవంతులు మాత్రమే తినే సన్నబియ్యాన్ని నేడు ప్రభుత్వ చర్యల వల్ల పేదలు కూడా తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పండుగ రోజున లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో కలిసి భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. భోజనం ఎంతో రుచిగా ఉందని, సన్నబియ్యం నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యమని, ప్రతి నిరుపేద కుటుంబంలో ఆనందం నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్నబియ్యం తమ కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, నాణ్యమైన బియ్యం అందిస్తున్నందుకు మంత్రి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీకాంత్, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సర్పంచ్ ప్రవల్లిక, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్