- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ డిమాండ్
నవతెలంగాణ–నాచారం
నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు జీవో నంబర్ 21 ప్రకారం నెలకు రూ.21,623 కనీస వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ డిమాండ్ చేశారు. కార్మికులకు హెడ్లైన్స్ పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలను వారంలోగా చెల్లించాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి కాంట్రాక్టు కార్మికులు మూడు రోజులపాటు సమ్మె నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ వారం రోజుల్లో పెండింగ్ జీతాలు చెల్లిస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చినట్లు ఎం. నరసింహ తెలిపారు. అనంతరం కార్మికులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపరింటెండెంట్ ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జీవో నంబర్ 21 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని కార్మిక సంఘాలు పోరాటాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం కార్మికుల వేతనాలను పెంచాలని, వారికి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు చెల్లిస్తే వారు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నర్సింగరావు, భాస్కరాచారి, పద్మావతి, నిరంకారీ కౌర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)