నవతెలంగాణ – నాచారం
జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో చక్రిపురంలోని చక్రి విద్యానికేతన్ హైస్కూల్లో ఆదివారం 134వ నెల ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పా శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్, జిల్లా కోశాధికారి జెన్నీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముప్పా శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనవిజ్ఞాన వేదిక గత 134 నెలలుగా నిరంతరాయంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఆరోగ్య అవగాహన కల్పిస్తోందన్నారు. బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులను ముందుగానే గుర్తిస్తే నియంత్రించడం సులభమని, 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమతుల ఆహారం, నిత్య వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించి శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోందని తెలిపారు.
జిల్లా కోశాధికారి జెన్నీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఖరీదైన వైద్య సేవలు భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
వైద్యులు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ జయరాజ్, డాక్టర్ దేవిక, డాక్టర్ నవనీత, డాక్టర్ సంగీత నాయక్ శిబిరంలో పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు సీహెచ్ ప్రభాకర్, శేషగిరిరావు, నాగరాజు, రాజేశ్వరి, సోమయాచారి, ఎం.ఎల్. చౌదరి, శేషు, నర్సింగరావు, తేజస్వి, శశిధర్ రెడ్డి, ఉదయ్ కుమార్, వాలంటీర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






కామెంట్లు (0)