Magazines

రైతు సంఘాలతోనే అధిక ఆదాయం సాధ్యం

2 గంటల క్రితం

farmer associations
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

- రైతు నేస్తం 112వ ఎపిసోడ్‌లో రైతు సంఘాల బలోపేతంపై అవగాహన

- వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్

నవతెలంగాణ - అశ్వారావుపేట

రైతులు సంఘటితంగా ఏర్పడితేనే పంటలకు గిట్టుబాటు ధరలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, అధిక ఆదాయం సాధ్యమవుతాయని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) సభ్యుల కోసం రైతు నేస్తం 112వ ఎపిసోడ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల బలోపేతం, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలపై అవగాహన కల్పించారు.

రైతు సంఘాల బలోపేతానికి చర్యలు:

వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో రైతు సంఘాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు.

వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు:

రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఏడు విభాగాలకు చెందిన 37 రకాల వ్యవసాయ యంత్రాలను అద్దెకు అందుబాటులో ఉంచడం ద్వారా చిన్న రైతులకు పెట్టుబడి వ్యయం, సమయం ఆదా అవుతాయని వివరించారు. ఈ కేంద్రాల నిర్వహణతో సంఘాలకు అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. పథకానికి సంబంధించిన నిబంధనలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని వ్యవసాయ కమిషనరేట్ అధికారులు వివరించారు.

ఎల్‌నినో ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు:

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు, క్షేత్రస్థాయి చర్యలపై చర్చించారు. నేల సంరక్షణ లక్ష్యంగా చేపట్టిన 'ఖేత్ బచావో అభియాన్' ప్రాధాన్యతను వివరించారు.

ఎగుమతులతో అదనపు ఆదాయం:

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో సాగు చేస్తున్న గెర్కిన్స్ పంట ఎగుమతుల ద్వారా రైతులు ఆదాయం పొందుతున్న తీరును వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మునగ ఆకుల పొడి తయారీ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలను సంబంధిత కంపెనీల ప్రతినిధులు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.

రబీ సాగుకు సూచనలు:

రబీ సీజన్‌లో నవంబర్ మొదటి పక్షం వరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు విత్తుకోవచ్చని సూచించారు. నవంబర్ 16 తర్వాత నీటి లభ్యత, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. పంటల కీలక దశల్లో తగినంత నీరు అందించాలని, వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన విత్తన రకాలను అధికారిక డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషనరేట్ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారులు, అగ్రిగేటర్లు, విలువ జోడించిన ఉత్పత్తుల తయారీ సంస్థలు, దేశీయ, విదేశీ ఎగుమతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్