Magazines

వ్యవసాయ కళాశాలను సందర్శించిన విద్యార్థులు

1 గంట క్రితం

Agricultural College
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

- విజ్ఞాన యాత్రలో భాగంగా 200 మంది విద్యార్థుల పర్యటన

- ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించిన ఏడీ డాక్టర్ హేమంత కుమార్ 

నవతెలంగాణ - అశ్వారావుపేట

విజ్ఞాన యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 200 మంది విద్యార్థులు శనివారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను సందర్శించారు. 

ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ విద్యార్థులకు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.


అనంతరం కళాశాలలోని ప్రదర్శన క్షేత్రాలను సందర్శించిన విద్యార్థులు వివిధ పంటల సాగు విధానాలను పరిశీలించి శాస్త్రీయ సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నారు. డాక్టర్ నాగాంజలి, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రావిక, బి. శివ విద్యార్థులకు చిరుధాన్యాల సాగు, పందిరి విధానంలో కూరగాయల పెంపకం, మల్చింగ్, సూక్ష్మ నీటిపారుదల, ఫెర్టిగేషన్, పూల పంటల సాగు పద్ధతులను వివరించారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతర పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయల పెంపకంపై అవగాహన కల్పించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం, వర్మీకంపోస్టు తయారీ, మట్టి పరీక్షల విధానాలను కూడా వివరించారు.


కళాశాలలోని ప్రదర్శన క్షేత్రాలు, వివిధ పంటల సాగు విధానాలను పరిశీలించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి విజ్ఞాన యాత్రలు విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన పెంపొందించడంతోపాటు, శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్