- అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం
నవతెలంగాణ-సత్తుపల్లి
'మురసు' తుఫాను ప్రభావంతో సత్తుపల్లి ప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సత్తుపల్లి మండలం వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మండలంలోని పలు ప్రాంతాల్లో రహదారులు వరద నీటితో పూర్తిగా దిగ్బంధమయ్యాయి. కిష్టారం - యాతాలకుంట, రుద్రాక్షపల్లి - నాచారం మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. సత్యనారాయణపురం, గంగారం - రామానగరం తదితర గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదకరంగా మారిన ఈ రహదారులపై సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు కాపలా కాశారు. వరద ఉధృతి తగ్గే వరకు ఎవరూ ప్రయాణించవద్దని పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు గ్రామస్తులు తెలిపారు. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ అకాల వర్షం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
సత్తుపల్లి పట్టణంలో పొంగి పొర్లిన డ్రైనేజీలు
సత్తుపల్లి పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పట్టణంలో డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి మురుగునీరు భారీగా చేరింది. మున్సిపల్ కమిషనర్ కొండ్ర నరసింహ, కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా వర్షంలోనూ డ్రైనేజీలను క్లియర్ చేసే పనులను వారు దగ్గరుండి పర్యవేక్షించారు. సిద్ధారం రోడ్డు నుంచి రాజీవ్‌నగర్ వెళ్లే రహదారి పూర్తిగా వాగును తలపించింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిపేందుకు పోలీసులు ట్రాక్టర్లను అడ్డం పెట్టారు. ఎమ్మార్ గార్డెన్ వైపు రాజీవ్‌నగర్ ఎంట్రన్స్‌లో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలను నిలువరించారు. పట్టణ పరిధిలోని కాకర్లపల్లి రోడ్డు, శివసాయి నగర్ ప్రాంతాల్లోనూ వరి చేలు నీట మునిగాయి. అధికార యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.






కామెంట్‌లు (0)