Magazines

రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి

10 నవంబర్, 2026

ration dealers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

డీలర్ల సంఘం మండల అధ్యక్షులు మార్కండేయ గౌడ్‌

నవతెలంగాణ-మిడ్జిల్

రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మిడ్జిల్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మార్కండేయ గౌడ్‌ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ప్రభుత్వం డీలర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి తమను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య తాము అరిటాకులా నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలకు ఒకసారి అందుతున్న చాలీచాలని కమిషన్లతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వాపోయారు.


ఉపాధి హామీ కూలీల కన్నా డీలర్ల బతుకులు అధ్వానంగా తయారయ్యాయనీ, ప్రతీ క్వింటాల్ బియ్యానికి మూడు కిలోల వరకు తరుగు వస్తుండటంతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, దీంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారిందని అన్నారు. తక్కువ కోటా ఉన్న గ్రామాల రేషన్ డీలర్లు కుటుంబాలను పోషించలేక అప్పుల పాలవుతున్నారని, డీలర్లకు పారితోషికంతో పాటు గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. రేషన్ సరుకుల హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కేవలం కమిషన్‌పై ఆధారపడకుండా ప్రభుత్వం డీలర్లకు స్థిరమైన పారితోషికంతో పాటు గౌరవ వేతనం అందించాలనీ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న డీలర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే గౌరవ వేతనం ప్రకటించాలని మండల డీలర్ల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్