సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా బ్లాక్ నేతలు
ఓటర్ల తొలగింపుపై ఈసీ రికార్డులన్నీ బయటపెట్టాలి
రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర కమిటీ వేయాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించి ఎలాంటి విధానాలు అనుసరించారు? ఎన్నికల సంఘం నిర్ణయాల వెనుక ఉన్న పూర్తి వివరాలను పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ ఇండియా బ్లాక్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం అంతర్గత రికార్డులను కోర్టు తెప్పించుకోవడంతోపాటు, ఓటర్ల తొలగింపులపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని కోరారు. సోమవారం సుప్రీంకోర్టులో ఇండియా బ్లాక్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌లో సర్ ప్రక్రియపై మధ్యంతర నిలుపుదల విధించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్), సౌగతా రాయ్ (టీఎంసీ), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), తేజస్వి ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎంఎ బేబీ (సీపీఐ(ఎం), డి. రాజా (సీపీఐ), సుప్రీయా సూలే (ఎన్సీపీ), మహువా మాంఝీ (జెఎంఎం), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్)లు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు పారదర్శకంగా, చట్టబద్ధంగా తీసుకున్నారా లేదా అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇతర ఎన్నికల కమిషనర్లకు తెలియకుండా, వారి ఆమోదం లేకుండా సంఘం సమిష్టి అధికారాలను వినియోగించుకున్నారనే ఆరోపణలనూ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ అంశాలపై సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ పనితీరుపై దాఖలైన సంబంధిత పిటిషన్లపై నేడు (మంగళవారం) సుప్రీంకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
పాత రికార్డుల నుంచి డిజిటల్ లాగ్‌ల వరకు..
సర్ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లు, సమావేశాల మినిట్స్, అధికారుల నోటింగ్స్, ఎన్నికల కమిషనర్లు నమోదు చేసిన అభ్యంతరాలను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈసీ డిజిటల్ వ్యవస్థలైన ఈసీఐనెట్, ఈఆర్‌ఓనెట్ యాక్సెస్ లాగ్‌లను కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 2025 జూన్ 24న దేశవ్యాప్తంగా సర్ చేపట్టాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి ఫైల్‌ను సమర్పించాలని కోరారు. ఆ నిర్ణయం రాజ్యాంగంలోని 324వ అధికరణ, 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలోని 18వ సెక్షన్‌కు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలుంటే వాటిని రద్దు చేయాలని కోరారు.
రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేయాలి
ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన పేర్లపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు, తొలగింపునకు కారణాలు, వయసు, లింగం తదితర వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచురించాలని కోరారు. అర్హులైన ఓటర్లు తిరిగి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. నోటీసు ఇవ్వకుండా, సంబంధిత వ్యక్తుల వాదనలు వినకుండా ఏ ఒక్కరి పేరునూ ఓటర్ల జాబితా నుంచి తొలగించరాదని ఆదేశించాలని కోరారు.
ఆన్‌లైన్ ఫారం మార్పులపైనా అభ్యంతరం
కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఫారం-6లో ఎన్నికల సంఘం చేసిన మార్పులనూ పిటిషనర్లు ప్రశ్నించారు. దరఖాస్తుదారుడు లేదా వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గతంలో నిర్వహించిన సర్ ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా అనే అదనపు ప్రకటనను ఫారంలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనలను సవరించకుండా ఫారంలో మార్పులు చేయడం చట్టబద్ధమేనా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సంబంధిత నిబంధనలను సవరించే వరకు ఆన్‌లైన్ ఫారం-6ను ప్రస్తుత చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
14 సందర్భాల్లో అభ్యంతరాలు?
ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలపై వచ్చిన వార్తా కథనాలను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23న ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ప్రకారం, గత పది నెలల్లో సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఉత్తర్వులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు నమోదు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సంఘం మాత్రం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నట్టు తన వాదనను వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రికార్డులను పరిశీలిస్తేనే నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారన్నది స్పష్టమవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)