ఇకపై అది నిరసన వేదిక కాదు
ప్రత్యామ్నాయంగా ఢిల్లీలో మూడు కొత్త వేదికలు
ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ప్రకటన
కేంద్రం తీరుపై ప్రతిపక్షాల మండిపాటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్దాలుగా ఆందోళనలు, ధర్నాలకు వేదికైన జంతర్ మంతర్‌ను ఢిల్లీ పోలీసులు మూసివేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఆ ప్రాంతాన్ని నిరసనల జాబితా నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారమొక ప్రకటన విడుదల చేశారు. ఇకపై ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైటాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించేం దుకు మూడు ప్రదేశాలు ‘రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్ ’ ను వెల్లడించారు. ఆ ప్రాంతాలలోనే ఇక మీదట ఆందోళలు, ప్రదర్శనలు, బైటాయింపు కార్య క్రమాలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేర్వేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు.కాగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటరు జాబితాల నుంచి ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి, యువజన సంఘాలు జంతర్ మంతర్‌కు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌ను నిరసనలు తెలిపే ప్రాంతం నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. మరోపక్క జంతర్ మంతర్‌ను నిరసనలు తెలిపే ప్రాంతం నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీసు కమిషనర్ జారీ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డాయి. ప్రజాస్వా మ్యబద్ధంగా నిరసనలు తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.







కామెంట్‌లు (0)