ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఆర్థిక, పర్యావరణ భారం
యువత సమయాన్ని, విద్యుత్, నీటిని హరించేస్తున్న కృత్రిమ మేధ
వనరుల దుర్వినియోగాన్ని పెంచుతున్న వైనం
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇప్పటికే కోట్లాది మంది యువత ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో మరో సమస్య వచ్చి పడింది. ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయడమే కాదు.. నిరుద్యోగ యువత విలువైన సమయాన్ని, దేశ వనరులను కూడా ఖర్చు చేయిస్తోంది. ఉచితంగా లభిస్తున్న ఏఐ సేవల వెనుక విద్యుత్, నీటి వినియోగం, విదేశీ సంస్థల లాభాలు దాగి ఉన్నాయి. ఉపాధి కల్పించాల్సిన సాంకేతికతే మరో కొత్త సంక్షోభానికి కారణమవుతోందన్న ఆందోళన పెరుగుతోంది.
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయం నెలకొంది. అయితే భారత్‌లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. ఇక్కడ ఇప్పటికే తగినన్ని ఉద్యోగాలు లేక నిరుద్యోగం తీవ్ర సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఏఐ రాకతో ఉద్యోగాలు పోవడమే కాకుండా, నిరుద్యోగ యువత పనిలేకుండా గడిపే సమయాన్ని కూడా భారంగా మార్చేస్తోంది. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్, నీటి వనరులపై భారం పెరుగుతుండగా, దాని ద్వారా వచ్చే ప్రధాన లాభాలు విదేశీ కంపెనీలకు చేరుతున్నాయి.
నిరుద్యోగం.. ఆందోళనకరం
ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయం అమెరికా, ఐరోపా దేశాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. కానీ భారత్‌లో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ చాలామంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే ప్రధాన లక్ష్యం. ప్రయివేటు రంగంలోనూ తగినన్ని అవకాశాలు లేక నిరుద్యోగం వేధిస్తోంది. నిరుద్యోగ సమస్యకు తోడు ఇప్పుడు ఏఐ వినియోగం మరో భారంగా మారుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగం ఐదు శాతం స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తున్నా.. వాస్తవ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వారంలో కనీసం ఒక్కరోజు ఒక గంట పనిచేసినా ఉపాధి పొందిన వ్యక్తిగా లెక్కించే విధానం వల్ల నిరుద్యోగ తీవ్రత పూర్తిగా బయటపడటం లేదని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఇది పూర్తిస్థాయి ఉద్యోగం కాదు.. అరకొర ఉపాధి మాత్రమే. జూన్‌లో యువత నిరుద్యోగం 16.2 శాతానికి చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని నిపుణులు చెప్తున్నారు.
పెరుగుతున్న ఏఐ వినియోగం.. విద్యుత్, నీటిపై భారం
మరోవైపు దేశంలో ఇంటర్నెట్, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. భారత్‌లో కోట్లాది మంది చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఏఐ సేవలపై ఆధారపడుతున్నారు. ఉచిత సేవల పేరుతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఉచితంగా లభించే సేవల వెనుక వినియోగదారుల సమాచారం, వారి వినియోగమే కంపెనీలకు విలువైన వనరులుగా మారుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల విద్యుత్ ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది. ఒక్కో ప్రశ్నకు విద్యుత్ వినియోగం తక్కువగానే కనిపించినా, కోట్లాది మంది ఒకేసారి ఉపయోగిస్తే దాని ప్రభావం పెద్దదిగా మారుతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం ఏడాదికి 945 టెరావాట్ గంటలకు చేరవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా.
ఇది జపాన్ ప్రస్తుత వార్షిక విద్యుత్ వినియోగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. డేటా సెంటర్లకు విద్యుత్‌తో పాటు భారీగా నీరు కూడా అవసరం. ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఇది మరింత సమస్యగా మారవచ్చు. ఏఐ ఉత్పాదకతను పెంచి మానవ శ్రమను తగ్గించాల్సి ఉండగా, సరైన ఉపాధి అవకాశాలు లేని దేశంలో అది మరో సమస్యగా మారుతోంది. సాంకేతికత అభివృద్ధి ఫలాలు కొద్దిమంది కంపెనీలకే పరిమితమైతే, సామాన్య యువతకు మిగిలేది నిరుద్యోగం, సమయ నష్టం, పెరిగిన వనరుల వినియోగమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏఐ ఉద్యోగాలను ఎంతవరకు భర్తీ చేస్తుందన్నదానికంటే, అది దేశంలో నిరుద్యోగ సమస్యను, ఆర్థిక అసమానతలను, వనరుల దుర్వినియోగాన్ని ఎంతగా పెంచుతుందన్నదే ఇప్పుడు అసలు ఆందోళనగా మారిందని చెప్తున్నారు.
అమెరికా కంపెనీలకు భారీ లాభాలు
భారత్ ఇప్పటికే పరిశ్రమల ఆధారిత ఉద్యో గాలను తగినంతగా సృష్టించలేకపో యింది. సేవల రంగం, ముఖ్యంగా ఐటీ రంగమే లక్షలాది మంది మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ రంగంలోనూ ఏఐ ప్రవేశంతో ఉద్యో గాల పునాది బలహీనపడుతోంది. ఏటా యువతకు జనాభా ప్రయోజనం (డెమోగ్రాఫిక్ డివిడెండ్) ఉందని చెప్తున్నప్రభుత్వం.. వారికి తగిన ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ఇక ఏఐ సాంకేతికతకు అవసర మైన చిప్‌లు, మోడళ్లు, భారీ లాభాలు ప్రధానంగా అమెరికా కంపెనీల చేతు ల్లోనే ఉన్నాయి. భారత్ మాత్రం వినియోగదారులను, డేటాను, విద్యుత్‌ను అందిస్తోంది. గతంలో భారత్ నుంచి పత్తిని తీసుకెళ్లి బ్రిటన్‌లో వస్త్రాలు తయారుచేసి తిరిగి మనకే విక్రయించిన వలస పాలకుల తరహాలో.. ఇప్పుడు మనం ప్రశ్నలను పంపి, విదేశీ కంపెనీల నుంచి సమాధానాలను కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది.
ఐటీ రంగానికి షాక్
మరో కీలక పరిణామం ఐటీ రంగంలో కనిపిస్తోంది. దేశంలోని ఐదు ప్రధాన ఐటీ కంపెనీల్లో రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఉద్యోగుల సంఖ్య నికరంగా తగ్గింది. టీసీఎస్‌లోనే 23 వేల మందికి పైగా ఉద్యోగులు తగ్గారు. రానున్న మూడేండ్లలో మనుషులతో సమానంగా ఏఐ ఏజెంట్లను ఉపయోగించవచ్చని ఆ సంస్థ చైర్మెన్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు లభించే పరీక్షలు, సాంకేతిక సహాయం, డాక్యుమెంటేషన్ వంటి ప్రారంభ స్థాయి పనులను ఏఐ భర్తీ చేసే ప్రమాదం ఉంది. దీంతో అనుభవం సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాల్సిన యువతకు అవకాశాలు తగ్గుతాయి.







కామెంట్లు (0)