Magazines

డాలర్‌@95.22

1 గంట క్రితం

Dollar @ 95.22
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

మూడు రోజుల్లో 84 పైసల పతనం

ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌‌లో భారత రూపాయి విలువ వరుసగా మూడో రోజూ పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే సోమవారం మరో 29 పైసలు క్షీణించి 95.22 వద్ద ముగిసింది. దీంతో గడిచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి ఏకంగా 84 పైసలు కోల్పోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు అధిక ధరలు, డాలర్‌ బలోపేతం కావడం దేశీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభపడినప్పటికీ రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. సోమవారం ఇంటర్‌ ‌బ్యాంక్‌ ‌ఫారిన్‌ ఎక్సేంజీలో రూపాయి 94.92 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 95.26 కనిష్ట స్థాయికి పడిపోయి చివరకు 95.22 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి 12 పైసలు క్షీణించి 94.93 వద్ద నమోదయ్యింది. అమెరికా ట్రెజరీ బాండ్‌ రాబడుల పెరుగుదల కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. పశ్చిమాసియా, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు, చమురు సరఫరాపై ఆందోళనలు రూపాయిని మరింత బలహీనపరిచే అవకాశం ఉందని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ పరిశోధన విశ్లేషకుడు అనూజ్‌ చౌధరి పేర్కొన్నారు. విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడి పెరిగితే రూపాయి మరింత క్షీణించవచ్చని.. అయితే ఆర్బీఐ జోక్యం కొంత ఉపశమనం కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.90 నుంచి 95.50 మధ్య కదలాడవచ్చని అంచనా వేశారు. 95.50 స్థాయిని దాటితే రూపాయిపై మరింత పతన ఒత్తిడి పెరిగే అవకాశముందని లెమన్‌ పరిశోధన విభాగాధిపతి గౌరవ్‌ గార్గ్‌ హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్