సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్
తిరువనంతపురం : ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌కే దేశవ్యాప్త నిరసనలు పరిమితం కాలేదని, ఇవి ప్రజాస్వామ్య వాణి వినిపించే అవకాశాలను తిరిగి పొందేందుకు ఉద్దేశించిన పోరాటమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ తెలిపారు. తిరువనంతపురంలో 'ది హిందూ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తున్నాయనే భావన విస్తృతంగా వ్యక్తమవుతోందని చెప్పారు. "ప్రజాస్వామ్య ప్రక్రియ లేదా స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు లేకపోతే, మిగిలినవన్నీ అర్థరహితం అవుతాయి. మీరు రాజకీయ పార్టీని నడుపుతున్నా లేదా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నా, దానికి ఎటువంటి విలువ ఉండదు. సమాజంలోని ప్రతి వర్గం దీని వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశం సాధించిన విజయాలు, దాని ప్రగతిశీల ఆదర్శాలు అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఇప్పుడు ప్రజలు 'ఇక చాలు' అని గళమెత్తుతున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా నిరసనల్లో ముందుకు..
ముస్లిం - హిందూ చర్చలతో ఇంకెంత దూరం వెళ్లగలరు? ఒకప్పుడు బీజేపీకి ఓటు వేసిన వారు కూడా ఇప్పుడు ఈ నిరసనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు" అని ఆయన అన్నారు. జంతర్‌మంతర్ నిరసనలు దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయని అన్నారు. నీట్ - యూజీ పరీక్షా పత్రం లీక్ ఘటనపై జంతర్ మంతర్ వద్ద మొదటి విడత నిరసనల తర్వాత రాజీనామా చేసిన కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉదంతంతో పోలిస్తే, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అంత సులభంగా జరగదని చెప్పారు.
అంతా వారే చేస్తున్నారు
“ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల ఎన్నికల ప్రణాళికలన్నింటినీ అమలు చేస్తున్న వ్యక్తి ఆయనే కాబట్టి, ఒక మంత్రిని వదులుకున్నంత సులభంగా ఆయనను వదులుకోలేరు. వారికి భారతదేశంలో పారదర్శకమైన లేదా స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగడం ఇష్టం లేదు. ఒకవేళ వారు జ్ఞానేశ్ కుమార్ ను తొలగిస్తే, అప్పుడు పరిణామాలు వేగంగా మారుతాయి. ప్రజల డిమాండ్లు మరింత పెరిగిపోతాయేమోనన్న భయంతో వారు సందిగ్ధంలో ఉన్నారు. ఈ పరిణామాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కీలకమైన అంశం” అని బ్రిట్టాస్ పేర్కొన్నారు. తాము మరోసారి వెనక్కితగ్గితే అది తమ పార్టీకి విపత్కరంగా మారుతుందని బీజేపీ ఆందోళన చెందుతోందని అన్నారు. అందువల్లే రెండో విడత నిరసనల పట్ల కేంద్రప్రభుత్వం మరింత అణచివేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు.
“సరిహద్దులను కాపాడాల్సిన వారందరినీ ఢిల్లీలో మోహరించారు. పౌర నిరసనలను నిర్వహించడంలో శిక్షణ లేని కేంద్ర పారామిలిటరీ బలగాలను భారీ సంఖ్యలో రంగంలోకి దించారు. అందుకే ఈ క్రూరత్వం ఇంత ఎక్కువగా ఉంది” అని ఆయన అన్నారు. ‘ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, సంప్రదాయ రాజకీయ పార్టీలు లేదా కూటములకు అతీతంగా, ప్రతి ఒక్కరికీ ఒక పాత్ర ఉంది. ఈ ఉద్యమం తమకు లాభిస్తుందా లేదా కొత్తగా రంగంలోకి దిగిన వారు తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తారా అనే రాజకీయ పార్టీల సంకుచిత లెక్కలన్నీ పక్కన పెట్టాల్సిన సమయం ఇది. ప్రజాస్వామ్య వాణిని అడ్డుగోడలు అణచివేయలేవు’ అని బ్రిట్టాస్ స్పష్టం చేశారు.
జంతర్‌మంతర్ నిరసనలతో తలకిందులైన రాజకీయ ముఖచిత్రం
“జంతర్ మంతర్ నిరసనలు భారతదేశంలోని రాజకీయ ముఖచిత్రాన్ని అక్షరాలా తలకిందులు చేశాయి. సామాజిక సంభాషణ మారిపోయింది. ఇండ్లలో జరిగే సంభాషణలు కూడా మారాయి. ఒక మ్యానిఫెస్టో కంటే ఒక మీమ్ చాలా శక్తివంతమైనదని ఇప్పుడు మీకు తెలుసు. సోనియా గాంధీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేరడం లేదా మోడీ ఒక రీల్‌లో కనిపించవలసి రావడం వంటి వాస్తవాలు, సాంప్రదాయ రాజకీయాలపై జెన్-జెడ్ నిరసనలు చూపిన అపారమైన ప్రభావాన్ని పరోక్షంగా ప్రతిబింబిస్తున్నాయి,” అని ఆయన అన్నారు. ఇటీవలి నిరసన ఉద్యమాలలో ప్రధాన సమీకరణ శక్తులలో ఒకటిగా పనిచేసిన వామ పక్షాలు, ఎన్నికల ఫలితాల్లో అంతటి ప్రభావం చూపలేకపోవడంపై ఆయన మాట్లాడుతూ "భౌతిక రాజకీయ రూపంగా వామపక్షం వేరు, దాని ఆలోచనా విధానం వేరు, అది ప్రజలను ఎలా ప్రేరేపిస్తుంది, నిరసనకారులకు ఒక గమనాన్ని ఎలా నిర్దేశిస్తుంది అనే విషయాలు వేరు. సంఖ్యలు అంత ముఖ్యం కాదని నేను భావిస్తున్నాను.
మీరు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు లేదా ఒక పరిస్థితిని ఎలా ప్రభావితం చేయడానికి ప్రయత్ని స్తారు అనేది చాలా ముఖ్యం. మోడీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు, అందుకే వామ పక్షాన్ని నిర్మూలించాలని తాను కోరుకుంటున్నానని అంటున్నారు" అని బ్రిట్టాస్ తెలిపారు. “సాంప్రదాయ మీడియాపై ఇంతటి తీవ్రమైన దాడిని నేను ఎప్పుడూ చూడలేదు. నిరసన జరుగుతున్న ప్రాంతాల నుంచి వారిని వెళ్లగొట్టారు. వారిని కేవలం ప్రచార సాధనాలుగా లేదా ఒక పక్షం యొక్క వాదనలను మోసేవారిగా ప్రజలు చూస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. మీకు కార్పొరేట్ ప్రయోజనాలు ఉండవచ్చు లేదా సంకుచిత లక్ష్యాలు ఉండవచ్చు, కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నిరసనల్లో కొంత ప్రశాంతత నెలకొన్నట్టు అనిపించవచ్చు. కానీ ఇది తుపానుకు ముందున్న నిశ్శబ్దం మాత్రమే” అని బ్రిట్టాస్ చెప్పారు.






కామెంట్‌లు (0)