కోళ్ల రైతులకు తప్పని కష్టాలు
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యం
ఆహార పంటలపై పెరుగుతున్న ఒత్తిడి
మొక్కజొన్న ధరలు 2019లో కిలో రూ.12 - 14
ఇప్పుడు రూ.27 - 28కు
మోడీ సర్కారు
ఇంధన విధానంపై
విమర్శలు
చమురు దిగుమతుల భారాన్ని తగ్గించాలన్న పేరుతో మోడీ ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తున్న ఈ20 విధానం ఇప్పుడు ఆహార పంటలపై ఒత్తిడిని పెంచుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇథనాల్ తయారీకి మొక్కజొన్న వినియోగం భారీగా పెరగడంతో పౌల్ట్రీ రైతులకు దాణా ధరలు పెరిగి ఉత్పత్తి ఖర్చులు భారమవుతున్నాయి. తిరిగి దాని భారం వినియోగదారులపై పడే ప్రమాదం ఉంది. మరోవైపు మొక్కజొన్న సాగు పెరిగితే పప్పులు, నూనెగింజల సాగు తగ్గి భవిష్యత్తులో దిగుమతులపై ఆధారపడే పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలే మోడీ సర్కారు విధానంపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న మోడీ ప్రభుత్వ లక్ష్యం.. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఈ20 కోసం మొక్కజొన్నకు పెరిగిన డిమాండ్ పౌల్ట్రీ రైతులపై భారంగా మారుతోంది. 2019లో కిలో రూ.12–14గా ఉన్న మొక్కజొన్న ధర ఇప్పుడు రూ.27–28కు చేరడం, కొన్ని ప్రాంతాల్లో ఆఫ్‌సీజన్‌లో రూ.32 వరకు పలకడం ఇందుకు నిదర్శనంగా రైతులు చెప్తున్నారు. ఇంధనానికి మొక్కజొన్నను మళ్లించే విధానంతో ఆహారం, పౌల్ట్రీ దాణా, పప్పులు, నూనెగింజల అవసరాల మధ్య సమతుల్యం దెబ్బతింటోందన్న ప్రశ్నలు ఇప్పుడు మోడీ సర్కారు ముందుంచుతున్నాయి.
మొక్కజొన్న.. ఇథనాల్‌కు మళ్లింపు
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ద్వారా పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం. ఈ20 అంటే పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలపడం. దీనివల్ల 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ.1.9 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసినట్టు కేంద్రం చెప్తోంది. అయితే ఇథనాల్ తయారీలో మొక్కజొన్న వినియోగం వేగంగా పెరిగింది. 2021-22లో ఇథనాల్ మిశ్రమంలో మొక్కజొన్న వాటా దాదాపు శూన్యం. అయితే.. 2025-26లో అది సుమారు 37 శాతానికి చేరింది. ఆ ఏడాది మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ తయారీకి సుమారు 126 లక్షల టన్నుల మొక్కజొన్న వినియోగం, కేటాయింపు జరిగినట్టు పార్లమెంటు సమాధానాల్లో నమోదైంది.
కోళ్ల రైతులపై భారం
కోళ్లకు ప్రధాన దాణా మొక్కజొన్న. తర్వాత సోయామీల్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. కాబట్టి మొక్కజొన్న ధర పెరిగితే గుడ్లు, చికెన్ ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. చివరకు దాని ప్రభావం వినియోగదారులపై పడుతుంది. మహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన పౌల్ట్రీ రైతు సుజిత్ పాటిల్ ప్రకారం.. 2019లో ఒక్క గుడ్డు ఉత్పత్తి ఖర్చు రూ.2.50–2.60 ఉండగా ఇప్పుడు రూ.4–4.50కు చేరింది. అప్పట్లో మార్కెట్లో రూ.5కు లభించిన గుడ్డు ఇప్పుడు రూ.8–10కు చేరిందని ఆయన తెలిపారు. నాసిక్‌కు చెందిన మరో రైతు అనిల్ ఫడ్కే మాట్లాడుతూ... ఐదేండ్ల క్రితం కిలో మొక్కజొన్న రూ.14–15 ఉండగా ఇప్పుడు రూ.25–28కు చేరింది. ఇథనాల్ తయారీకి మొక్కజొన్న మళ్లించడంతో పౌల్ట్రీ రంగానికి అది అందుబాటులో ఉండటం తగ్గింది. దీంతో ధర పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతులకు లాభమా.. డిస్టిలరీలకు లాభమా?
మొక్కజొన్న ఉత్పత్తి పెరిగితే రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంది. కానీ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా పెరగకపోతే పౌల్ట్రీ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మొక్కజొన్న ఉత్పత్తి పెంచడం, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందించడం, పౌల్ట్రీ రంగానికి దాణా అందుబాటులో ఉంచడం వంటి చర్యలు అవసరమని పౌల్ట్రీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే 2025-26లో మొక్కజొన్న కొరత సుమారు 1.7 కోట్ల టన్నుల వరకు ఉండొచ్చని పరిశ్రమ అంచనాలు చెప్తున్నాయి. దీంతో మొక్కజొన్న దిగుమతులకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ ఇప్పటికే మొక్కజొన్న నికర ఎగుమతిదారు స్థాయి నుంచి దిగుమతిదారు దిశగా మారిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
ఈ20పై సమగ్ర సమీక్ష అవసరమా?
ఇథనాల్ ద్వారా చమురు దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యం ఒక వైపు. కానీ అదే సమయంలో ఆహార పంటల ధరలు, పౌల్ట్రీ రైతుల ఉత్పత్తి ఖర్చు, పప్పులు-నూనెగింజల సాగు, భవిష్యత్తు దిగుమతులు వంటి అంశాలను కూడా కలిపి చూడాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం ఈ20 వల్ల విదేశీ మారకద్రవ్య ఆదా జరిగిందని చెప్తోంది. అదే సమయంలో వ్యవసాయ నిపుణులు మాత్రం ఇథనాల్ కోసం పెరుగుతున్న మొక్కజొన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేశ ఆహార భద్రతపై సమగ్ర లెక్కలు వేయాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తున్నారు.
పప్పులు, నూనెగింజల పరిస్థితి ఏమిటి?
ఇక్కడే ఈ20 విధానంపై పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. దేశంలో వ్యవసాయ భూమి పరిమితమే. మొక్కజొన్న సాగు పెరగాలంటే మరో పంట సాగు తగ్గాల్సి రావచ్చు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన వ్యవసాయ నిపుణుడు ఆర్. రామకుమార్ అభిప్రాయం ప్రకారం.. మొక్కజొన్న కోసం పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గితే భవిష్యత్తులో వాటిని దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు. ఇది దేశ ఆహార భద్రతకు సంబంధించిన ప్రశ్న. ఒకవైపు చమురు దిగుమతుల బిల్లు తగ్గించేందుకు ఇథనాల్ వినియోగం పెంచుతుంటే.. మరోవైపు వంట నూనెలు, ఇతర పంటల దిగుమతులపై ఖర్చు పెరిగితే మొత్తం ప్రయోజనం ఎంత అన్నది పరిశీలించాల్సిన అంశమని నిపుణులు చెప్తున్నారు.
ఆహారమా.. ఇంధనమా..?
మొక్కజొన్న ఉత్పత్తి పెంచకుండా దానిని ఇథనాల్‌కు మరింతగా మళ్లిస్తే పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని రైతులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర పౌల్ట్రీ రైతుల సంఘం ప్రతినిధి సంజయ్ నల్గిర్కర్ ఈ ఏడాది తక్కువ వర్షాలతో మొక్కజొన్న దిగుబడి సాధారణ స్థాయిలో 30–40 శాతానికే పరిమితం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గుడ్ల ధరలు పెరిగినప్పటికీ ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే రైతుల లాభాలు పెరగడం లేదని పౌల్ట్రీ రంగం గణాంకాలు చెప్తున్నాయి. దాణా ధర పెరిగిన వెంటనే ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారుడిపై వేయలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని మార్కెట్ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం మొక్కజొన్న కొరత లేదని చెప్తోంది. 2025లో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో ఇథనాల్, పౌల్ట్రీ తదితర అవసరాలకు మొక్కజొన్న సరిపోతుందనీ, రైస్ బ్రాన్, బ్రోకెన్ రైస్, సజ్జలు, గోధుమ వ్యర్థాలను ప్రత్యామ్నాయ దాణాగా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.





కామెంట్‌లు (0)