పడిపోతున్న జల, పవన విద్యుదుత్పత్తి...మెయింటెనెన్స్‌లో బొగ్గు ప్లాంట్లు
గంటల తరబడి కోతలు.. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్
అదనపు సరఫరాల కోసం కేంద్రం వైపు చూస్తున్న రాష్ట్రాలు
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. బగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి పెరిగినప్పటికీ జల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం, మెయింటెనెన్స్ పనుల కారణంగా కొన్ని ప్లాంట్ల నుంచి సరఫరాలు తగ్గడంతో అనేక రాష్ట్రాలలో కరెంటు కోతలు...ముఖ్యంగా రాత్రి సమయంలో అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కేంద్రం నుంచి అదనపు విద్యుత్ కేటాయింపులు కోరుతున్నాయి. పునరుద్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలు కేంద్రం నుంచి అదనపు విద్యుత్ సరఫరాను కోరుతున్నాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు.
విద్యుత్ కొరతకు కారణాలివే
పగటిపూట డిమాండ్‌లో అధిక భాగాన్ని సౌర విద్యుత్ తీర్చగలదు. కానీ బ్యాటరీ నిల్వలు చాలినంతగా లేకపోవడంతో అదనపు సౌర విద్యుత్‌ను సాయంత్రం, రాత్రి సమయాల అవసరాలకు మళ్లించడం కష్టమవుతోంది. అదే సమయంలో జల విద్యుత్ ఉత్పత్తి బలహీనపడడంతో ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిపోవడంతో గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబరులో జల విద్యుదుత్పత్తి 30 శాతం
పడిపోయింది. ఇదిలావుంటే పవన విద్యుదుత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉంది. బగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో మెయింటెనెన్స్ పనులు జరుగుతుండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జల-పవన విద్యుదుత్పత్తి తగ్గడం, బగ్గు ప్లాంట్ల్లలో జరుగుతున్న మెయింటెనెన్స్ పనులు, పెరిగిన పారిశ్రామిక డిమాండ్...ఇవన్నీ కలగలిసి విద్యుత్ కొరతకు కారణమయ్యాయని ఎలారా సెక్యూరిటీస్ పరిశోధక విశ్లేషకుడు రూపేష్ సంఖే 'రాయిటర్స్' వార్తా సంస్థకు తెలిపారు.
బగ్గు ప్లాంట్లలో ఉత్పత్తి పెరిగినా...
2023 ఆగస్ట్ తర్వాత విద్యుత్ కొరత అత్యధిక స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. విద్యుత్ కొరత సెప్టెంబరులో 560 మిలియన్ కిలోవాట్ గంటలకు చేరింది. 2023 ఆగస్ట్ తర్వాత విద్యుత్ కొరతలో ఇదే అత్యధిక స్థాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి బగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని గణనీయంగా పెంచినప్పటికీ కొరత తప్పడం లేదు. గత సంవత్సరం సెప్టెంబరుతో పోలిస్తే పోయిన నెలలో విద్యుదుత్పత్తి 13.3 శాతం పెరిగింది. కానీ జల విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం, బగ్గు ప్లాంట్లలో జరుగుతున్న మెయింటెనెన్స్ పనుల కారణంగా ఉత్పత్తిలో ఏర్పడిన లోటును భర్తీ చేయడం సాధ్యపడడం లేదు. గ్రిడ్ ఇండియా డేటా ప్రకారం సుమారు 41 గిగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆందోళన కలిగించే మరో ముఖ్యమైన విషయమేమంటే సుమారు 47 శాతం బగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కీలక ఇంధన నిల్వల కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటి వద్ద నిర్దేశించిన సరఫరాలలో నాలుగో వంతు కంటే తక్కువగానే ఈ నిల్వలు ఉన్నాయి.
సరఫరాాడిమాండ్ మధ్య భారీగా అంతరం
పున్ణపంపిణీకి అందుబాటులో ఉన్న విద్యుత్‌లో ఇప్పటికే అధిక భాగాన్ని రాష్ట్రాలకు కేటాయించడంతో వాటి నుంచి వచ్చే తాజా అభ్యర్థనలకు అంగీకరించడం కేంద్రానికి చాలా కష్టంగా ఉంది. అవసరాలకు మించి ఉత్పత్తి జరుపుతున్న రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను తీసుకొని లోటుతో బాధపడుతున్న రాష్ట్రాలకు సరఫరా చేయడం మినహా కేంద్రం చేసేదేమీ లేదని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేసవి కాలం సుదీర్ఘంగా ఉంటుందని రాష్ట్రాలు ఊహించలేదు. దీంతో అవి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోలేకపోయాయి. విద్యుత్ రేటు అధికంగా ఉండడంతో పవర్ ఎక్స్ఛేంజ్‌ల నుంచి రాష్ట్రాలు కరెంటును కొనుగోలు చేయాల్సి వస్తోంది. అధిక పారిశ్రామిక డిమాండ్, సుదీర్ఘమైన వేడి వాతావరణం, తగ్గిపోయిన జల-పవన విద్యుదుత్పత్తి, బగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో మెయింటెనెన్స్ పనులు వంటి పరిణామాలు విద్యుత్ సరఫరా, డిమాండ్ మధ్య అంతరాన్ని మరింత పెంచుతున్నాయి.
కీలకంగా మారిన బ్యాటరీ నిల్వ
దేశంలో ఎదురవుతున్న విద్యుత్ కొరత పునరుద్పాదక ఇంధన విస్తరణ విషయంలో ఎదురవుతున్న సవాలును ఎత్తిచూపుతోంది. వాస్తవానికి మన దేశంలో సౌర విద్యుదుత్పత్తి వేగంగానే జరుగుతోంది. కానీ తగినంత బ్యాటరీ నిల్వలు లేకపోవడంతో పగటిపూట ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రాత్రి సమయంలో ఎదురవుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఉపయోగించుకోవడం సాధ్యపడడం లేదు. పునరుద్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే వారిని బ్యాటరీ నిల్వ వ్యవస్థలతో మరింత వేగంగా అనుసంధానించాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. బ్యాటరీ నిల్వ తగినంతగా ఉంటే పగటిపూట ఉత్పత్తి అయిన సౌర విద్యుత్‌ను నిల్వ చేసి, సాయంత్రం లేదా రాత్రి సమయాలలో డిమాండ్‌కు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల బగ్గు, జల విద్యుత్ ప్లాంట్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఏదేమైనా ప్రస్తుతానికి కరెంటు కష్టాలు తీవ్రం కావడంతో అనేక రాష్ట్రాలు అదనపు సరఫరాల కోసం కేంద్రం వైపు చూడక తప్పడం లేదు.
రాష్ట్రాల డిమాండ్‌ను తీర్చేదెలా ?
బొగ్గు, జల విద్యుత్ ప్లాంట్ల నుంచి కేంద్రానికి సుమారు 14-15 గిగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుంది. దీనిని విద్యుత్ కొరత ఏర్పడిన సమయంలో రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తుంది. అయితే జల విద్యుదుత్పత్తి పడిపోవడంతో కేంద్రం వద్ద అవసరమైన మేరకు విద్యుత్ అందుబాటులో లేదు. సెప్టెంబరులో పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలలో రోజుకు 14 గంటల వరకూ విద్యుత్ కోత విధించారు. దీంతో కేంద్రం ఇప్పటికే ఆ రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ను కేటాయించాల్సి వచ్చింది. మన దేశంలో పునరుద్పాదక ఇంధన సామర్ధ్యం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ రాత్రి సమయంలో ఎదురవుతున్న అధిక విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం కష్టమవుతోంది. దీంతో రాష్ట్రాల డిమాండ్లను ఎలా తీర్చాలో అర్థం కాక కేంద్రం తల పట్టుకుంటోంది.







కామెంట్‌లు (0)