Magazines

ఆహార భద్రతలో నిర్లక్ష్యం

1 గంట క్రితం

Negligence in food
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

గడువు తీరిన ఉత్పత్తులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

రిలయన్స్‌, బ్లింకిట్‌, జొమాటో సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌

రూ.48.09 లక్షల విలువైన పాడైన, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు స్వాధీనం

మహారాష్ట్ర అధికారులు, పోలీసుల చర్యలు


థానే, పూణే : ప్రజలకు విక్రయించకూడనీ, గడువు ముగిసిన, దెబ్బతిన్న ఆహార పదార్థాలను ధ్వంసం చేయాల్సింది పోయి తిరిగి మార్కెట్‌లో విక్రయించినట్టు ఆరోపణలు రావడంతో రిలయన్స్‌, బ్లింకిట్‌, జొమాటోకు చెందిన సిబ్బందిపై మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) చర్యలు చేపట్టింది. థానే, పూణే జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.48.09 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా.. ఈ వ్యవహారంలో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్వంసం చేయాల్సిన ఆహార పదార్థాలను అక్రమ మార్గాల్లో బయటకు తరలించి, తిరిగి వినియోగదారులకు విక్రయించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ధ్వంసం చేయాల్సిన సరుకులే విక్రయానికి..

ఈనెల 14, 15 తేదీల్లో ఎఫ్‌డీఏ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వినియోగానికి పనికిరాని, గడువు ముగిసిన, దెబ్బతిన్న, వినియోగదారులు తిరస్కరించిన ఆహార పదార్థాలను నాశనం చేయాల్సి ఉంది. అయితే, వాటిని తొలగించే బాధ్యత తీసుకున్న ఏజెన్సీలు, అనుమతులు లేని నిల్వ కేంద్రాలు, మధ్యవర్తుల ద్వారా సరుకులను బయటకు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటిలో అమ్మకానికి పనికివచ్చినట్టు కనిపించిన ప్యాకెట్లను వేరు చేసి, వ్యాపారులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు.

పది మందిపై కేసు

థానేలోని శాంతినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ పూర్తి కాలపు డైరెక్టర్‌ వి.సుబ్రమణియం, ఆ సంస్థకు చెందిన అశోక్‌ కుమార్‌ సింగ్‌, రిలయన్స్‌ రిటైల్‌ ప్రతినిధి విజయ్‌ భికాజీ ఖర్మలే, గోదాం నిర్వాహకుడు నీలేశ్‌ దేశ్‌ముఖ్‌, బ్లింకిట్‌ కామర్స్‌ డైరెక్టర్‌ అర్బిందర్‌ సింగ్‌ ధిండ్సా, దీపక్‌ సింగ్‌, జొమాటో హైపర్‌ప్యూర్‌కు చెందిన అబిద్‌ షేక్‌ సహా పలువురి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. బీకే డిస్పోజ్‌ సంస్థకు చెందిన బాబర్‌ సిద్ధిఖీ, సరఫరాదారు గుల్జార్‌ అబ్దుల్‌ ఖాన్‌, భివాండీకి చెందిన చవీంద్ర, డిస్కౌంట్‌ స్టోర్‌ నిర్వాహకుడు అబ్దుల్‌ మొబిన్‌ ఖాన్‌ కూడా నిందితులుగా ఉన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)-2023లోని సంబంధిత నిబంధనల కింద కేసు పెట్టారు.

రికార్డుల్లోనూ తేడాలు

భివాండీలోని సరుకుల తొలగింపు కేంద్రం నుంచి రూ.24 లక్షలకు పైగా విలువైన ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. వడపేలోని రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ గోదాం నుంచి రూ.4.92 లక్షలు, ఉసాటణేలోని జొమాటో హైపర్‌ప్యూర్‌ కేంద్రం నుంచి రూ.7.81 లక్షల విలువైన సరుకులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన సరుకులతో కలిపి మొత్తం స్వాధీనం విలువ రూ.48,09,924గా ఉంది. సరుకులను ధ్వంసం చేసినట్టు ధ్రువపత్రాలు జారీ చేసినప్పటికీ.. ఆ ప్రక్రియను సరిగా తనిఖీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. పంపిన, స్వీకరించిన సరుకుల వివరాలు, పరిమా ణాల్లోనూ తేడాలు గుర్తించారు. భివాండీ లోని గుల్జార్‌ నగర్‌లో కొనుగోలు బిల్లులు, అనుమతి లేకుండా నడుస్తున్న దుకాణంలో గడువు ముగిసిన, లీకవుతున్న ఉత్పత్తులు అమ్మకానికి ఉంచినట్టు అధికారులు గుర్తించారు.

లైసెన్సుల సస్పెన్షన్‌

ఏడు బృందాలతో తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌డీఏ అధికారులు.. సరుకుల జాబితా రూపొందించి, నమూనాలు సేకరించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల తరలింపు, విక్రయం, ధ్వంసం చేయడంపై నిషేధం విధించారు. అక్టోబర్‌ 15న విచారణ అనంతరం ఐదు సంస్థల లైసెన్సులను సస్పెండ్‌ చేయగా.. అనుమతులు లేని నాలుగు కేంద్రాల కార్యకలాపాలను నిలిపివేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్