వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్తో ఎన్పీఆర్డీ బృందం చర్చలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించాలనే జీవో 34నువెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) కోరింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందిరమ్మ ఇండ్లలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేసి, ఇంటి నిర్మాణ వ్యయంలో 25 శాతం అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ విశ్వేశ్వర్ రెడ్డితో కె. వెంకట్, యం అడివయ్య, ఆర్ వెంకటేష్, జె రాజు, ఎస్ రాజు, యం బాలస్వామి లతో కూడిన ప్రతినిధి బృందం సమావేశమైంది. వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలపై ఆయా డిపార్ట్మెంట్ అధికారులకు లేఖలు రాసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
డిమాండ్లు ఇవే
2016 ఆర్పిడి చట్టం ప్రకారం సాధారణ లబ్ధిలో వికలాంగులకు 25 శాతం అదనంగా ఇవ్వాలనే నిబంధనను పటిష్టంగా అమలు చేయాలి. ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.
ప్రభుత్వ అనుమతి లేకుండా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ కేంద్రాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న స్పెషల్ స్కూల్స్,చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్, స్పీచ్ మరియు హియరింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి.
వికలాంగులపై దాడులు, వేధింపులు చేస్తున్న వారిపై 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలి.
గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పార్కు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాల్లో వికలాంగులకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పట్టణాలు మరియు మండల కేంద్రాల్లో ప్రభుత్వం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.
2016 ఆర్పిడి చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలి.
రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లలో వికలాంగులకు దుకాణాలు కేటాయించాలి. ఇండస్ట్రీయల్ పాలసీలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.
ఉద్యోగ నియామకాల్లో శరీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు మార్చేందుకు స్టేట్ సభార్డినేట్ సర్వీస్ రూల్స్కు సవరణలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలనే 2016 ఆర్పిడి చట్టాన్ని అమలు చేయాలి.గ్రేటర్ హైదరాబాద్ లో స్వచ్చంద సంస్థల పేరుతో వికలాంగులతో బిక్షటన చేయిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నైబర్ హుడ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో రద్దు చేసిన మండల, జిల్లా వికలాంగుల సమాఖ్యలను పునరుద్దరణ చేయాలి. ఎన్హెచ్ఎఫ్డీసీ రుణాలను పునరుద్దరణ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేస్తున్న స్వయం ఉపాధి రుణలలో 5 శాతం రిజర్వేషన్స్ అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలి.
ప్రయివేట్ పరిశ్రమల నుండి వచ్చే సీఎస్ఆర్ నిధులను వికలాంగుల సంక్షేమనికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. సాంస్కృతిక సారధిలో వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. సాంస్కృతిక శాఖ ద్వారా వికలాంగులలో ఉన్న కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి .క్రీడాలో ఆసక్తి ఉన్న వికలాంగులను గుర్తించి వారికి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇవ్వాలి.
రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం, సాధికారకత కోసం ప్రత్యేక వికలాంగుల పాలసీ రూపొందించాలి.హైదరాబాద్ లో డెఫ్ విద్యార్థుల కోసం మంజూరైనా డిగ్రీ కళాశాలను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలి. 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారం రాష్టంలో ఉన్న మానసిక వికలాంగుల కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ పెరగాలి. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ఆటీజం, స్పీచ్, హియరింగ్ థెరపి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.






కామెంట్లు (0)