మోడీ పాలనలో ముస్లింలపై హింసకు కొత్త రూపం
మత విద్వేషాన్ని రాజకీయ సాధనంగా మార్చిన బీజేపీ
దేశంలో 2014 తర్వాత పరిస్థితులు మరింత తీవ్రం
మూకదాడులు, సామాజిక వెలివేత, భయభ్రాంతులకు గురిచేయడం పెరుగుతున్న వైనం
వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే ఆయుధం
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌లో ముస్లింలపై హింస స్వరూపం మారిందనే విమర్శలు బలపడుతున్నాయి. గతంలో ఎన్నికల ముందు మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టి ప్రజలను హిందూ, ముస్లిం వర్గాలుగా విడదీసి ఓట్లు పొందేందుకు బీజేపీ దాని అనుబంధ సంస్థల ద్వారా ప్రయత్నించేది. అయితే ఇప్పుడు ముస్లింలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకునే మూకదాడులు, సామాజిక వెలివేత, ఆర్థిక బహిష్కరణ, మతపరమైన గుర్తింపుపై దాడులు రోజువారీ వ్యవహారంగా మారుతున్నాయి. ఈ విధంగా హిందూ, ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తూ సమాజంలో శాంతియుత పరిస్థితులకు కాషాయ పార్టీ విఘాతం కలిగిస్తోంది.
న్యూఢిల్లీ : భారత్‌లో ముస్లింలపై హింసను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించు కుందనే విమర్శలు కొత్తవి కావు. 1980, 1990 దశకాల్లో అయోధ్య ఉద్యమం సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి హిందూ ఓటర్లను ఏకం చేసే రాజకీయానికి బీజేపీ పునాదులు వేసుకుంది. కులాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలో ముస్లింలను ‘ఇతరులు’గా చూపిస్తూ హిందూ సమాజాన్ని ఒకే రాజకీయ శక్తి కిందకు తీసుకురావడమే ఈ వ్యూహంలో కీలక భాగంగా మారింది. ఎన్నికలకు ముందు మతపరమైన అల్లర్లు పెరగడం, అనంతరం తగ్గిపోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2002 గుజరాత్ మారణకాండ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మతపరమైన ధ్రువీకరణను రాజకీయంగా ఉపయోగించుకున్నారని విమర్శలు వచ్చాయి. అత్యధిక హింస చోటుచేసుకున్న ప్రాంతాల్లో బీజేపీ భారీగా విజయాలు సాధించడం ఈ రాజకీయ వ్యూహం ప్రభావాన్ని చూపించింది. అయితే బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హింస స్వరూపం మారింది. అధికారంలో ఉన్న పార్టీగా నిరంతరం పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగితే శాంతిభద్రతల వైఫల్యంపై విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో సామూహిక అల్లర్లకు బదులుగా ముస్లింలను వ్యక్తిగతంగా టార్గెట్‌గా చేసుకునే హింస పెరిగింది.
మూకదాడులే కొత్త ఆయుధం
2014లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవుల పేరుతో ముస్లింలపై గోరక్షకులు, హిందూత్వ శక్తుల దాడులు తీవ్రరూపం దాల్చాయి. ఆవులను తరలిస్తున్నారనే అనుమానంతో రైతులు, పశువుల వ్యాపారులపై దాడులు చేసి హత్యలు చేసిన ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. గోరక్షకుల పేరుతో హిందూత్వ మూకలు రహదారు లపై వాహనాలను ఆపి తనిఖీలు చేయడం, ముస్లింలను కొట్టడం వంటి ఘటనలు భయానక పరిస్థితులను సృష్టించాయి. 2014–2024 మధ్య 1,733 మూకదాడులను నమోదు చేసినట్టు జాఫ్రుల్ ఇస్లాం ఖాన్ రచనలో పేర్కొన్నారు. దాడుల వీడియోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం ద్వారా ముస్లిం సమాజంలో భయాన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరిగాయి. ఈ దాడుల ప్రభావం ప్రాణనష్టానికే పరిమితం కాలేదు. ముస్లిం రైతులు పశువుల పెంపకాన్ని వదిలేయడం, బహిరంగ ప్రదేశాల్లో మతపరమైన గుర్తింపులు కనిపించకుండా జాగ్రత్తపడటం, ఉర్దూ మాట్లాడేం దుకు కూడా వెనుకాడటం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముస్లింలు ఇతర సముదాయాలతో కలిసి నివసించే ప్రాంతాల నుంచి దూరమవుతూ ప్రత్యేక కాలనీల్లోకి చేరడం కూడా పెరిగింది.
మతపరమైన గుర్తింపే నేరమా?
ముస్లిం టోపీ ధరించడం, గడ్డం పెంచుకోవడం వంటి సాధారణ మతపరమైన గుర్తింపులు కూడా దాడులకు కారణాలుగా మారిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 2014లో పూణేలో మసీదు నుంచి తిరిగి వస్తున్న మోహ్సిన్ సాదిక్ షేక్(24)ను టోపీ, గడ్డం కారణంగా కాషాయ మూకలు లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన ఘటన ఈ పరిస్థితికి ఉదాహరణగా నిలిచింది. ముస్లిం మత పెద్దలు, రైతులు, పిల్లలు, మహిళలు కూడా హింసకు గురి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొన్ని ఘటనల్లో బాధితులను చంపడమే కాకుండా తీవ్రంగా హింసించి ఆ దృశ్యాలను చిత్రీకరించి ప్రచారం చేశారు. ఇది కేవలం హత్యలు చేయడం కాదని.. బాధితులను అవమానించి, భయపెట్టి, లొంగదీసుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి.
మహిళలపై కూడా విద్వేష దాడులు
ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగికదాడులకు పిలుపునిచ్చే విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా బీజేపీకి చెందిన నేతలు, హిందూత్వ వర్గాల నుంచి వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం మహిళల పేర్లు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వేలం వేసినట్టు చూపిస్తూ అవమానించిన ఘటనలు కూడా తీవ్ర కలకలం రేపాయి. లైంగికదాడిని మతపరమైన ప్రతీకార చర్యగా సమర్థించే తీరు కూడా కనిపించడం ప్రమాదకర పరిణామంగా మారింది. దీంతో ముస్లిం మహిళలు, బాలికలపై లైంగిక హింసను కూడా మత విద్వేష రాజకీయాల్లో భాగంగా ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అల్లర్లకంటే ప్రమాదకరమైన కొత్త దశ
2014కు ముందు మతపరమైన హింస ప్రధానంగా సామూహిక అల్లర్లు, రాజకీయ ధ్రువీకరణ చుట్టూ తిరిగేది. ఇప్పుడు మాత్రం ముస్లింలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం, మూకదాడులు, సామాజిక, ఆర్థిక బహిష్కరణ, మతపరమైన గుర్తింపుపై దాడులు, మహిళలు, పిల్లలు, వృద్ధులపై హింస వంటి రూపాల్లో విస్తరిస్తోంది. అందుకే మోడీ పాలనలో ముస్లిం వ్యతిరేక హింసను కేవలం అప్పుడప్పుడు జరిగే అల్లర్లుగా చూడలేమనే వాదన బలపడుతోంది. తక్కువ సంఖ్యలో ప్రాణనష్టం జరిగినప్పటికీ.. ఒక సముదాయాన్ని నిరంతరం భయపెట్టడం, సామాజికంగా వేరు చేయడం, ఆర్థికంగా బలహీనపరచడం, ప్రజా జీవితంలో వారి ఉనికిని తగ్గించడం లక్ష్యంగా మారితే అది మరింత లోతైన, వ్యవస్థీకృత విద్వేష రాజకీయంగా మారే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే బీజేపీ వంటి మతపరమైన విద్వేషాలు సృష్టించే పార్టీలను ఓడించాలనీ, హిందూత్వ శక్తులను బహిష్కరించాలని సూచిస్తున్నారు.
‘ప్రతీకారం’ పేరుతో విద్వేష రాజకీయాలు
ముస్లిం పాలన కాలం నాటి చరిత్రను ప్రస్తావిస్తూ ‘ప్రతీకారం’ తీర్చుకోవాలనే భావనను హిందూత్వ రాజకీయ వర్గాలు ముందుకు తెస్తున్నాయి. మోడీ సైతం ముస్లిం దండయాత్రలతో ప్రారంభమైన ‘1200 ఏండ్ల బానిసత్వం’ ముగించాల్సిన అవసరం ఉందని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. జాతీయ భద్రతా సలహా దారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ కూడా గత చారిత్రక నష్టాలకు ‘ప్రతీకారం’ అనే భావనను ప్రస్తావిం చినట్టు కూడా కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇలా చరిత్రను ప్రస్తుత ముస్లింలపై ప్రతీకారానికి కారణంగా చూపడం ద్వారా ఒక మొత్తం సముదాయాన్ని నిందితులుగా నిలబెట్టే ప్రమాదకర రాజకీయానికి బీజేపీ, హిందూత్వ శక్తులు బలం చేకూరుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.







కామెంట్‌లు (0)