చదువుకున్న యువతకు కొరవడిన ఉద్యోగాలు
డిగ్రీలు, పీజీలు ఉన్నాచిరుద్యోగాలే దిక్కు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోట్లాది మంది నిరుద్యోగుల పోటీ
అసంఘటిత రంగంలోనే 90 శాతం మంది కార్మికులు
ఆసియా దేశాలతో పోలిస్తే తయారీ, ఉత్పాదకతలో వెనుకబాటు
సంపద పెరుగుతున్నా సామాన్యుల ఆదాయాల్లో మాత్రం స్తబ్ధత
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మోడీ సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మిస్తామని చెప్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దేశంలో ఉన్నత చదువులు చదివిన యువతకు తగిన ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ కొలువుల కోసం కోట్లాది మంది పోటీ పడుతున్నారు. ఉపాధి దొరకక చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. పకోడీలు అమ్ముకోవడాన్నే ఉపాధిగా సమర్థించిన మోడీ ఆలోచనలతో దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మారుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు కేంద్రానికి ఎదురవుతున్నాయి.
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వ గణాంకాలు పూర్తిగా ప్రతిబింబించడం లేదు. ఏడాదిలో కనీసం 30 రోజులు ఏదో ఒక ఆర్థిక కార్యకలాపంలో భాగ మైనా.. ఉపాధి పొందినవారిగా లెక్కిస్తున్నా రు. దీంతో వీధుల్లో పకోడీలు అమ్ముకునేవారు, కుటుంబ వ్యవసాయ పనుల్లో ఉచితంగా పనిచేసేవారు కూడా ఉద్యోగులు అనే జాబితా లో చేరుతున్నారు. కేంద్రం చెప్తున్నట్టుగా వాస్తవానికి ఇది ఉపాధి కల్పనలో విజయం కాదనీ, నిరుద్యోగులు బతుకుదెరువు కోసం పడుతున్న కష్టాలని విశ్లేషకులు చెప్తున్నారు.
పకోడీలను ఉపాధిగా చూపిన మోడీ
2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కార్యాలయం బయట పకోడీలు అమ్ముకుని రోజుకు రూ.200 సంపాదించినా దాన్ని ఉపాధిగానే పరిగణిం చాలని వ్యాఖ్యానించారు. కానీ దేశంలో ఉపాధి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ తర్వాతి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యూపీలో 62 ప్యూన్ పోస్టులకు 3,700 మంది పీహెచ్డీ చేసినవారు, 28 వేల మంది పీజీలు చేసినవారు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల రైల్వేలో 32,438 ప్రారంభస్థాయి ఉద్యోగాల కోసం 1.08 కోట్ల మంది పోటీ పడ్డారు. ఇది దేశంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆసియా దేశాలతో పోలిస్తే వెనుకబాటు
ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. చైనా, మలేషియా, వియత్నాం వంటి దేశాలు యువతకు ఉపాధి కల్పనలో ముందుకు వెళ్తుంటే.. భారత్‌లో మాత్రం 24.3 శాతం మంది యువతకు ఉద్యోగం, చదువు, శిక్షణ ఏదీ లేదు. దేశ కార్మికుల్లో 42 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నా రు. తయారీ రంగం వాటా, మహిళల ఉపాధి కూడా పైన పేర్కొన్న దేశాల కంటే తక్కువగానే ఉండటం ఆందోళనకరం.
కార్మికులపై పనిభారం.. వేతనాల్లో స్తబ్ధత
ఉపాధి సంక్షోభం కార్మికుల వేతనాలపైనా ప్రభావం చూపుతోంది. సరైన ఉద్యోగాలు దొరకక తక్కువ వేతనాలకు పనిచేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లోనే కార్పొరేట్ సంస్థల అధినేతలు వారానికి 70 నుంచి 90 గంటలు పనిచేయాలని కార్మికులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. గంటలు పెంచితేనే ఉత్పాదకత పెరుగుతుందన్న వాదనకు ఆర్థిక సిద్ధాంతాల్లోనూ ఆధారం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఉద్యోగాల కల్పనే అభివృద్ధికి అసలైన బాట
ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే తయారీరంగంలో భారీగా ఉద్యోగాలు కల్పిం చాలి. దిగుమతి సుంకాలను తగ్గించి, పరిశ్రమ లకు అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్స హించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అనువైన పారిశ్రామిక కేంద్రాలను నిర్మించాలి. నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ విద్యను మెరుగుపరచాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులు, వైద్య సేవలను విస్తరించడం ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. మోడీ పాలనలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం పరిశ్రమల విస్తరణకు అడ్డంకిగా మారుతోందని వివరిస్తున్నారు.
నినాదాలతో కాదు.. ఉపాధితోనే వికసిత్ భారత్
మౌలిక సదుపాయాల పేరుతో రహదారులు, విమానాశ్రయాలు నిర్మించడం, కార్పొరేట్ సంస్థ లకు రాయితీలు ఇవ్వడం మాత్రమే అభివృద్ధి కాదనీ, ప్రజలకు స్థిరమైన ఉద్యోగాలు, గౌరవ ప్రదమైన వేతనాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమ వుతుందని అంటున్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు ప్యూన్ పోస్టులే గగనమవుతున్న మోడీ పాలనలో పకోడీలు అమ్ముకోవడమే ఉపాధి అని సమర్థిస్తున్నప్పుడు వికసిత్ భారత్ నినాదం ఆచరణకు దూరంగానే మిగిలిపోతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
చదువులకు తగిన కొలువులు కరువు
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదిక ప్రకారం.. 2022లో డిగ్రీ చదివిన యువతలో నిరుద్యోగం 29.1 శాతంగా ఉంది. సాంకేతిక విద్య పొందిన యువతలోనూ దాదాపు 40 శాతం మందికి తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు లేవు. దేశంలోని కార్మికుల్లో సుమారు 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఏటా కోటి నుంచి 1.2 కోట్ల మంది కొత్తగా ఉద్యోగాల కోసం వస్తుండగా.. ఇప్పటికే 2 నుంచి 2.5 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఉత్పాదకతలోనూ క్షీణిస్తున్న భారత్
మరోవైపు కార్మిక ఉత్పాదకతలోనూ భారత్ వెనుకబడుతోంది. కేంద్రంలో మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2015-25 మధ్య బీజేపీ పాలనలో భారత్ వార్షిక ఉత్పాదకత వృద్ధి 2.53 శాతానికే పరిమితమైంది. ఇదే సమయంలో సంపదలో అసమానతలు పెరిగాయి. దేశ ఆదాయంలో 58 శాతం వాటా మొదటి 10 శాతం సంపన్నుల చేతుల్లో ఉండగా, దిగువన ఉన్న 50 శాతం ప్రజలకు దక్కుతున్నది 15 శాతమే కావడం గమనార్హం.







కామెంట్లు (0)