ప్రియమైన వేణు గీతికకు
నాన్నా, ఎలా ఉన్నావు? దసరా పండుగ అయిపోయింది. దసరాకి అక్కడ గర్భ ఆడతారు కదా! నువ్వు ప్రతి ఏడాది ఆడుతున్నావు. కిందటి సారి గర్భ చూడటానికి నేనూ వచ్చాను. అసలు సమయమే తెలియదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సరే నాన్నా, ఈ సారి ఉత్తరంలో కూడా ప్రయాణం గురించే చెప్తాను. ఇది సొంత వాహనాల్లో ప్రయాణం గురించి.
చాలా మంది కారుంది కదా.. ‘అందులో మా ఊరికి వెళతాము, రాత్రి బయలుదేరితే తెల్లారేలోపు ఇంట్లో ఉంటాము’ అనుకుంటారు. రాత్రి పూట ప్రయాణాలు అంత సురక్షితం కాదు. ప్రమాదాలు ఎక్కువగా జరిగేది రాత్రి పూటనే. కుటుంబంతో వెళ్తున్నప్పుడు జాగ్రత్త చాలా అవసరం. ఒక్క మనిషి రాత్రి పూట దూర ప్రాంతాలకు వాహనం నడపడం సరైనది కాదు. ఒక్క క్షణం కంటి మీద రెప్ప పడితే చాలు జరగ కూడని ఘోరం జరిగిపోతుంది. అత్యంత ముఖ్యమైతే తప్ప రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు.
ఒకవేళ చేయాల్సి వస్తే డ్రైవర్‌ని పెట్టుకోవడమో, డ్రైవింగ్ వచ్చిన వారిని వెంట తీసుకుని వెళ్లాడమో చేయాలి. కుటుంబంతో వెళ్తున్నప్పుడు పిల్లలకు కావాల్సిన ఆహారం, మంచినీళ్లు , మందులు వంటివి దగ్గర పెట్టుకోవాలి. దారిలో ఎవరైనా బండి ఆపమని సంకేతాలు ఇస్తే ఆపకుండా వెళ్లిపోవాలి. ఎందుకంటే వాళ్ళు దొంగలు కావొచ్చు, రౌడీలు కావొచ్చు, మరెవరైన కావొచ్చు. మహిళలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
ప్రమాదాలు తొంభైశాతం జరిగేది రాత్రి పూటనే. పగలు ప్రమాదాలు జరగవా అని అనొచ్చు, జరుగుతాయి. కానీ జన సంచారం ఉంటుంది. ఎవరైనా వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. అంతే కాక నిద్ర రాకుండా ఉంటుంది. అయితే పగలు కూడా భోజనం చేసిన వెంటనే ఇంటినుండి బయలుదేరకూడదు. ఒక వేళ భోజనం దారి మధ్యలో చేయాల్సి వస్తే కొంచం తక్కువ తింటే మంచింది. అవసరం అనుకుంటే వాహనం ఆపి నీళ్లతో మొహం కడుక్కుని పది నిమిషాలు సేదతీరి బైల్దేరాలి.
మనకు సొంత వాహనం ఉన్నా ఇప్పటి వరకు రాత్రి ప్రయాణం చేయలేదు.
ఇంటికి కూడా చీకటి పడేలోపు చేరుకునే వాళ్ళం. వాహనం మనం సరిగానే నడుపుతున్నా, ఎదుటివాళ్ళు అలా నడపకపోవచ్చు. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని అతి వేగంగా వెళ్తుంటారు. అనుకోకుండా ఏదైనా జంతువు, మనిషి వాహనానికి అడ్డంగా వస్తే సడన్‌గా బ్రేక్ వేస్తే బండి అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. లేదా రోడ్డు పక్కాగా కొందరు వాహనాలు నిలిపి వేస్తారు, అవి చూసుకోక గుద్దే అవకాశం ఉంటుంది. వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబం క్షేమం, తన క్షేమం గురించి ఆలోచించుకుని ప్రయాణాలు పగటిపూట చేస్తే మంచింది. ఉంటాను నాన్నా, నువ్వు జాగ్రత్తగా బండి నడుపు. రాత్రిళ్ళు అసలు నడపకు. ఆరోగ్యం జాగ్రత్త.
ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి






కామెంట్‌లు (0)