ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. సమయానికి గుర్తించకపోవడం, సరైన అవగాహన లేకపోవడం ఎన్నో కారణాలు ఈ ముప్పును పెంచుతున్నాయి. అయితే లైఫ్స్టైల్లో పలు మార్పులు చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓ నివేదికలో ప్రచురించింది. రొమ్ము క్యాన్సర్ కేసులలో సుమారు 30 శాతం నేరుగా మనం మార్చుకోగలిగే అలవాట్లపైనే ఆధారపడి ఉంటున్నాయని స్పష్టం చేసింది. జన్యువులు, కుటుంబ చరిత్ర, వయసు వంటి కొన్ని అంశాలు మన చేతుల్లో లేకపోయినప్పటికీ.. రోజువారీ జీవితంలో చేసే కొన్ని పనుల ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం’ సందర్భంగా ముప్పును తగ్గించే ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం...
రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవాలంటే ఆరోగ్యకరమైన బరువు ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అధిక బరువు కేవలం శరీర పరిమాణాన్ని మాత్రమే కాకుండా, లోపల హార్మోన్లు, కణాల పనితీరును పూర్తిగా మార్చేస్తుందని, ఫలితంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత అధిక బరువు లేదా ఊబకాయం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెంచుతుంది. ఈ క్రమంలోనే నెలసరి ఆగిన, 50 ఏండ్లు దాటిన మహిళలు కనీసం 10 పౌండ్ల బరువు తగ్గితే, భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు 25 నుంచి 30 వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్‌ను తగ్గించుకోవాలి
కారణం ఏదైనా కానీ, ప్రస్తుతం చాలా మంది రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అధికంగా తీసుకుంటున్నారు. అయితే కొన్ని పరిశోధనల ప్రకారం రెడ్ మీట్, జంతువుల కొవ్వులు, బేకరీ ప్రొడక్ట్స్‌లోని కొవ్వులు, రసాయనాలు క్యాన్సర్‌కు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే మాంసాహారాన్ని తగ్గించి, దానికి బదులుగా మొక్కల ఆధారిత ప్రోటీన్లు(చిక్కుళ్లు, పప్పుధాన్యాలు), జీడిపప్పు/బాదం వంటి గింజలు, క్వినోవా వంటి వాటిని డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినాలి
ఆహారంలో కూరగాయలు, పండ్లు తక్కువగా తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు ‘ఈస్ట్రోజెన్ రిసెప్టర్ (ER) నెగటివ్’ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును తగ్గించుకునేందుకు బ్రోకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలతో పాటు తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే చిన్న వయసు నుంచే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
మంచి నిద్ర తప్పనిసరి
ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం, నెలల తరబడి నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం వంటివి బ్రెస్ట్ క్యాన్సర్‌కి దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మన శరీరం సహజంగా పాటించే జీవ గడియారాన్ని అనుసరించకుండా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మొత్తం శరీర వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్యాన్సర్ కంతులు రావడానికీ, అవి వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో మిగిలిన అవయవాలతో పోలిస్తే రొమ్ముల్లోని పాలను ఉత్పత్తి చేసే కణాలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం తప్పనిసరి
రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజులో కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్, గార్డెనింగ్, టెన్నిస్ వంటివి చేయడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా.. క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు.
బిడ్డకు పాలు ఇవ్వడం
పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల కూడా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డకు పాలివ్వడం వల్ల మహిళల జీవితకాలంలో వచ్చే పీరియడ్స్ సంఖ్య తగ్గుతుందని.. ఫలతంగా శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం తగ్గి, రొమ్ము క్యాన్సర్ రాకుండా చేస్తుందని చెబుతున్నారు.
హార్మోన్ మందుల వాడకాన్ని తగ్గించాలి
గర్భనిరోధక మాత్రలు లేదా మెనోపాజ్ తర్వాత ఎదురయ్యే సమస్యలను తగ్గించుకునేందుకు తీసుకునే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వీటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం అందరికీ ఒకేలా ఉండదని, చాలా మంది మహిళలకు ఈ చికిత్సల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాదాన్ని మించి ఉంటాయనే విషయాన్ని గమనించడం ముఖ్యమంటున్నారు. ఈ క్రమంలోనే మీ వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, లైఫ్‌స్టైల్ వంటివి పరిగణలోకి తీసుకుని వాడాలా వద్దా అనే విషయాన్ని డాక్టర్‌తో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివరిస్తున్నారు.
ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవం ముఖ్యం
రొమ్ము క్యాన్సర్‌కు కారణమయ్యే BRCA1, BRCA2 వంటి జన్యువులు తల్లిదండ్రులిద్దరి నుంచి సంక్రమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తల్లి తరపు కుటుంబంతో పాటు తండ్రి తరపున అంటే నానమ్మ, అత్తలకు క్యాన్సర్ చరిత్ర ఉందో లేదో తెలుసుకోవాలంటున్నారు. దీని ఆధారంగానే రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.







కామెంట్లు (0)