Magazines

జీతాల పెంపులో అంతరాలు

1 గంట క్రితం

Disparities in salary
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

నైపుణ్యమున్నవారికే పెద్దపీట
ఏఐ, డేటా సైన్స్‌ నిపుణులకు భారీ వేతనాలు..2027లో సగటు జీతాల పెంపు 9.1 శాతం
ద్రవ్యోల్బణంతో తగ్గుతున్న ఉద్యోగుల వాస్తవ ఆదాయం


న్యూఢిల్లీ : ఉద్యోగుల జీతాల పెంపులోనూ అంతరాలు పెరుగుతున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉన్నవారికి కంపెనీలు భారీ వేతనాలు ఇస్తుండగా, సాధారణ ఉద్యోగులకు మాత్రం తక్కువ పెంపుతో సరిపెడుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌, సెమీకండక్టర్లు, డేటా కేంద్రాల వంటి రంగాల్లో నైపుణ్యమున్నవారికి అధిక ప్రాధాన్యం లభిస్తోంది. మరోవైపు పెరుగుతున్న ఖర్చులు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితి, ద్రవ్యోల్బణం ఉద్యోగుల వేతనాలపై ప్రభావం చూపుతున్నాయి. 2027లో భారత్‌లోని సంస్థలు సగటున 9.1 శాతం జీతాలు పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ వృత్తిపరమైన సేవల సంస్థ 'అయాన్‌' అంచనా వేసింది. 2026లో నమోదైన 9 శాతం వేతన పెంపుతో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ. అయితే, ఈ పెంపు అందరికీ ఒకేలా ఉండటం లేదు. 2027లో 37 శాతం సంస్థలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ జీతాలు పెంచాలని భావిస్తున్నాయి. గతేడాది ఇలాంటి సంస్థల వాటా 12 శాతమే. అదే సమయంలో 8 నుంచి 10 శాతం మధ్య జీతాలు పెంచే సంస్థల వాటా గతేడాది 72 శాతం ఉండగా.. అది ఈసారి 38 శాతానికి తగ్గింది.

ఆర్థిక రంగంలోనూ వ్యత్యాసాలు

రంగాలవారీగా చూస్తే నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థల్లో అత్యధికంగా 10.1 శాతం, ఇంధన రంగంలో 9.9 శాతం, రియల్‌ ఎస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం వేతన పెంపు ఉండవచ్చని అంచనా. దేశవ్యాప్తంగా 45 రంగాలకు చెందిన 1200కుపైగా సంస్థల సమాచారాన్ని విశ్లేషించి అయాన్‌ ఈ అంచనాలను రూపొందించింది. మరోవైపు నాలుగింట ఒక వంతు సంస్థలు తమ ఉద్యోగులకు 8 శాతం కంటే తక్కువ జీతాలు పెంచనున్నాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. 2025లో ఇలాంటి సంస్థల వాటా 16 శాతం ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి పెరిగింది.

ద్రవ్యోల్బణంతో ఆదాయానికి కోత

2026లో 4.3 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2027లో 5.1 శాతానికి పెరగవచ్చని అంచనా. దీంతో జీతాలు పెరిగినా, ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉంది. అంటే చేతికి వచ్చే జీతం పెరిగినప్పటికీ, నిత్యావసరాల కోసం ఖర్చు చేసే మొత్తం కూడా పెరగడంతో వాస్తవ ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.నైపుణ్యమే వేతనానికి కొలమానం ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ వంటి రంగాల్లో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ విభాగాల్లోని ఉద్యోగులకు లభించే అదనపు వేతన ప్రయోజనాలు 2025తో పోలిస్తే సుమారు 10 శాతం పెరిగాయి. కంపెనీలు ఏఐ ఆధారిత సాంకేతికతల్లో పెట్టుబడులు పెంచుతుండటంతో ఈ నైపుణ్యాలున్నవారికి మెరుగైన వేతనాలు, ఇతర ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తయారీ, సాంకేతిక రంగాల్లోనూ నైపుణ్యమున్న ఉద్యోగులను ఆకర్షించేందుకు, తమ వద్దే కొనసాగించేందుకు సంస్థలు మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా జీతాలను సవరిస్తున్నాయి.

ఉద్యోగుల వలసలూ పెరుగుతున్నాయి

2025లో 16.2 శాతంగా ఉన్న ఉద్యోగుల వలసల రేటు 2026లో 18 శాతానికి పెరిగింది. కంపెనీలు తొలగిస్తున్న ఉద్యోగుల కారణంగా ఏర్పడిన వలసల రేటు 3.4 శాతం నుంచి 4 శాతానికి చేరింది. మరోవైపు మెరుగైన వేతనాలు, అవకాశాల కోసం ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థలను మారడం కూడా పెరుగుతోంది. మొత్తంగా నైపుణ్యమున్న ఉద్యోగులకు అధిక వేతనాలు, మిగిలిన వారికి పరిమిత పెంపు అనే ధోరణి బలపడుతోందని విశ్లేషకులు చెప్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్