వాతావరణం వల్ల చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటప్పుడు నోటికి ఏదీ అంతగా రుచించదు. ఇటువంటప్పుడు వేడి వేడి సూప్ తాగితో నోటికీ, గొంతుకు రెండింటికీ ఎంతో మంచిది. వేడి వేడి సూపు గొంతులోకి దిగుతుంటే వచ్చే ఆ హాయి ఎంతో బాగుంటుంది. అలాంటి రుచికరమైన, ఆరోగ్యకరమైన కొన్ని సూప్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా చేసుకోవాలో ఈ రోజులు తెలుసుకుందాం...
మునక్కాడలతో
కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన మునక్కాడలు - ఆరు నుంచి ఎనిమిది వరకు, తరిగిన అల్లంవెల్లులి, పచ్చిమిర్చి- చెంచా, పసుపు, మిరియాలపొడి- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె- సరిపడా.
తయారు చేసే విధానం: మునక్కాడలను కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత బయటికి తీసి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని పక్కకుపెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లంవెల్లులి, పచ్చిమిర్చి, పసుపు వేసి కలపాలి. కాసేపయ్యాక మిక్సీ పట్టిన మునక్కాడ మిశ్రమం వేసి మొత్తం కలిసేలా కలపాలి. రెండు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి ఐదు నిమిషాలు మరగనివ్వాలి. అంతే వేడి వేడి మునక్కాడల సూప్ రెడీ.
కొత్తిమీర నిమ్మరసం
కావాల్సిన పదార్థాలు: చిన్నగా తరిగిన కొత్తిమీర- కప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు, నూనె, ఉప్పు, నీళ్లు- తగినన్ని, తరిగిన అల్లంవెల్లుల్లి, మిరియాలపొడి, కార్న్‌ఫ్లోర్- చెంచా.
తయారు చేసే విధానం: ఒక చిన్న పాత్రలో కార్న్‌ఫ్లోర్ వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లం వెల్లుల్లి, కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్ మిశ్రమం, నీళ్లు, ఉప్పు, మిరియాలపొడి వేసి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. సూప్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండాలి. కొత్తిమీరకు బదులు పుదీనా వేసి కూడా చేయొచ్చు.
పాలకూరతో..
కావాల్సిన పదార్థాలు: పాలకూర కట్ట- ఒకటి (సన్నగా తరగాలి), ఉల్లిగడ్డ, అల్లంముక్క- చిన్నది, వెల్లుల్లిరెబ్బలు- రెండు, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం - చెంచా, పాలు - రెండు చెంచాలు.
తయారు చేసే విధానం: ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, పచ్చిమిర్చి, పాలకూరను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. పాలకూర ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. చల్లారాక ఆకుకూర మిశ్రమం, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో కార్న్‌ఫ్లోర్‌లో పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని క్రీమీలా గార్నిష్ చేసుకుంటే సరి. ఎంతో హెల్దీ అయిన పాలక్ సూప్ రెడీ! పాలకూరకు బదులు బచ్చలికూర, ఇంకా ఏదైనా ఆకుకూరతో కూడా ఇలా సూప్ చేసుకోవచ్చు.
ఉల్లికాడలతో..
కావాల్సిన పదార్థాలు: చిన్నగా, సన్నగా తరిగిన ఉల్లికాడలు- కప్పు, అల్లంవెల్లుల్లి- చెంచా(తరిగిన), బిర్యానీ ఆకు-ఒకటి, ఉప్పు, నూనె, నీళ్లు- సరిపడా, వెన్న, మిరియాలపొడి- చెంచా, కార్న్‌ఫ్లోర్- రెండు చెంచాలు, చక్కెర- చిటికెడు.
తయారు చేసే విధానం: ఒక చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి (చిక్కటి పేస్ట్‌లా అవుతుంది). తర్వాత ఒక పాన్ పెట్టి వెన్న కరిగించి బిర్యానీ ఆకు, ఉల్లికాడలు వేసి పది నిమిషాలపాటు వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. కాసేపయ్యాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలిపి ఇంకాసేపు మరిగితే ఉల్లికాడల సూప్ రెడీ.







కామెంట్‌లు (0)