Magazines

బతుకమ్మ పండుగ ఆంధ్ర మహాసభ సాంస్కృతిక ఉద్యమం

6 గంటల క్రితం

Andhra Mahasabha
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 4 నిమిషాల చదవడం

​బతుకమ్మ పండగ తెలంగాణా ప్రాంతంలో చాలా ప్రాధాన్యం కలిగిన స్త్రీల పండగ. ఈ పండగ సృష్టి కర్తలు కాకతీయ రాజవంశీకులని ప్రతీతి. రాజులు, సామంతులు, భూస్వాములు వారి కుటుంబీకుల స్త్రీల సంతోషానికై ప్రత్యేక ఏర్పాట్లతో, ఆర్భాటాలతో ఈ పండగలు నిర్వహించేవారు. హైదరాబాదు సంస్థానంలో ముస్లిం రాజరిక పరిపాలన ఉన్నా హైదరాబాద్‌లో ఈ పండగ చాలా గొప్పగా రాజలాంఛనాలతో జరిగేది. గ్రామీణ ప్రాంతాల నుండి కొందరు భూస్వాములు పనిగట్టుకొని ఈ పండగను చూడటానికి హైదరాబాద్ వచ్చేవారు. హైదరాబాద్‌లోని ముస్లిం స్త్రీలు నవాబుల కుటుంబాలతో సహా బతుకమ్మలను చూడటానికి హుస్సేన్‌సాగర్, గండిపేట చెరువుల దగ్గరికి మేనాలలో, కచ్చడాలలో వచ్చేవారని చెప్పుకొనేవారు.



అందాలు చిందుతున్న పూలతో స్త్రీలు తమ ఊహల్లోని కళలన్నీ నింపి, ఒకరిని మించి ఒకరు పోటీపడి బతుకమ్మలను పేర్చేవారు. తాము అలంకరించుకొని, ఆనందోత్సాహాలతో బతుకమ్మలను ఎత్తుకుని వెళుతుంటే గ్రామమే అలంకరించబడినట్లుండేది. ఇంటి నుండి బయటకు అడుగుపెట్టని స్త్రీలు ఈ తొమ్మిది రోజులు అందరూ కలిసి ప్రకృతి అందాలను, నిండుగా ఉన్న చెరువు నీటి అలలను చూసే, ఆస్వాదించే అవకాశం కలిగేది. బతుకమ్మలను ఆడుకుని రోజూ చెరువు నీటిలో చెదరకుండ విడిచేవారు. అవి ఆ వారం రోజులూ, నీటిలో అలలపై ఆడుతుంటే ప్రజలందరికీ, ఆ చెరువు అందాల కొలనులా కనువిందు చేసేది. ​ఈ పండగ ఆడపిల్లలకు ముఖ్యమైనది. ప్రతి ఇంటిలోని ఆడపిల్లలను తప్పని సరిగా తీసుకరావలనే నిబంధన ఉండేది. అత్తవారింట్లో కష్టనిష్టురాల నుండి పండగ పేరుతో బయటపడి స్వేచ్ఛను, ఊరటను పొందేవారు. రోజు బతుకమ్మను పేర్చుతూ ఎనిమిది రోజులు ఆడిన తర్వాత, తొమ్మిదవ రోజు పెద్ద బతుకమ్మను పేర్చి సాయంత్రం బతుకమ్మను, సద్దులను, పసుపు కుంకుమలను తీసుకుని పెద్ద ఉత్సవంలా బ్యాండు మేళాలతో ఊరేగింపుగా చెరువుకు బయలుదేరి వెళతారు. భూస్వాముల బతుకమ్మలను ముందుగా ఉంచి, మిగతా బతుకమ్మలను వాటి చుట్టూ వలయంగా పెట్టి బతుకమ్మల చుట్టూచేరి పాటలు, నృత్యాలు చేస్తారు. ​ఈ పాటల్లో ఆడ పిల్లల పుట్టుక నుండి పెళ్ళి, అత్తవారింట్లో జీవితం, పురుషాధిక్యత, శ్రమ భారం, సమిష్టి కుటుంబాల్లో జీవితం, మాతృత్వం, ఆరోగ్యాలు మొదలగు స్త్రీల సమస్యలన్నీ సోదాహరణంగా వర్ణించబడతాయి. అంతటి ఉత్సాహ వాతావరణంలో కూడా హృదయాలను కదిలిస్తాయి.

​అమ్మ చెప్పిన గత బతుకమ్మ చరిత్ర

​ఈ పండగకు తిరుగుబాటు చరిత్ర కూడా ఉంది. పూర్వం రాజకుటుంబీకులు, దేశముఖులు, రెడ్లు, భూస్వాములతోబాటు వారి తాబేదారులైన కరణాల కుటుంబాల స్త్రీలు బతుకమ్మలు పేర్చుకుని పెద్దదొర గడీలముందు బతుకమ్మలు పెట్టి ఆడేవారు. వారి ఇళ్లల్లో అయ్యవార్లు, సాతానివారు, వైశ్యులు మొదలగు కుటుంబాల స్త్రీలు, బతుకమ్మను పేర్చటం, పలహారాలు తయారు చేయటం, సద్దుల వంటలు, పిండి వంటలు మొదలగునవి వంతుల వారీగా చేసి రావాల్సివచ్చేది. వీరిలో బతుకమ్మ పండగ తాము కూడా స్వతంత్రంగా ఆనందంగా చేసుకోవాల్సిన స్వేచ్ఛకై ఈ వెట్టి నుండి విముక్తికై ఆలోచన, ఆవేదన, అలజడి కలిగింది. వారి ఇళ్లలో మగవారితో మాట్లాడి వారందరూ కలిసి కొందరు పెద్ద వారిని దొరల వద్దకు రాయబారం పంపారు. దొరలు ససేమిరా అన్నారు. ఉగ్రులయ్యారు కూడా. అయినా వారి ఇళ్లలో పని చేయవలసినవారు ఇతర కారణాలు చెప్పి తప్పించుకొనే ప్రయత్నాలు చేశారు. పండుగ పనులు అస్తవ్యస్తం అవుతుంటే దొరసానులు వారికి కబురు పంపడం, వారి ఇళ్లలోని అత్తలు, అమ్మలు వెళ్లి బతుకమ్మ ఆటకు దొరసాన్ల వద్ద అనుమతి పొంది పనిచేయడానికి ఒప్పుకుని వచ్చారు. కాని దొరల గడీలోకే బతుకమ్మలను తీసుకురావాలనే షరతు విధించారు. ఇది వారికి అసంతృప్తిగానే మిగిలింది.

​తెలంగాణలో ఆంధ్ర మహాసభ ఉద్యమం ఊపందుకుంటున్న నాటికి ఇది పరిస్థితి. ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పని చేస్తున్న మహిళలం ఈ సమస్యను తీసుకుని బతుకమ్మను ఆడుకునే హక్కు గ్రామంలో అందరి స్త్రీలకూ ఉందని, పై వర్గాలవారేగాక బీసీలు, దళితులు అందరూ ఆడుకోవాలని నినాదమిచ్చాము. అప్పటికే ఆంధ్ర మహాసభ ఉద్యమ ప్రభావాన వెట్టి పనులు తప్పించారు. దొరల దౌర్జన్యాల భయం సన్నగిల్లింది. ఆంధ్ర మహాసభ నినాదాలు ఊరూరా ఊపునిచ్చాయి. ప్రవాహాల్లా గ్రామాల్లో బతుకమ్మల ఊరేగింపులు జరిగాయి. గడీల ముందుకు రామని వెనకబడిన కులాలవారు నిరాకరించి చెరువుగట్టుకు వెళ్లారు. పాటలు పాడటం రాక తమ కొచ్చిన పాటలు పాడి, ఆడి ముగించిన సందర్భాలున్నాయి. బతుకమ్మలను పేర్చడానికి ఇత్తడి తాంబూలాలు లేక ఈత బుట్టల్లో పూలు నింపుకుని వెళ్లిన వారు ఉన్నారు. దొరల గడీల ముందుకెళ్లి మా వద్దకు వచ్చి పాటలు చెప్పమని (పాడేవారని) విజ్ఞప్తి చేసిన వారు ఉన్నారు. ఎమైతేనేమి దొరల కుటుంబాలు తప్ప తతిమ్మ వారంతా స్పందించి వారితో చేరారు. ఈ తీరున బతుకమ్మ పండుగ సాంస్కృతిక ఉద్యమంగా రూపొందింది.

మా ఊరు రమ్ము, మా వూరు రమ్ము అని పాట పాడేవారి కోసం వచ్చేవారు. పాటగాళ్లకు డిమాండు పెరిగింది. మగవారు కూడా నేర్చుకుని పాడేవారు. ఆంధ్ర మహాసభ ఉద్యమం గ్రామ రాజ్యాలేర్పాటులో, గ్రామ కమిటీలో ఇద్దరు ముగ్గురు ఆడవారిని నియమించారు. వారిలో దళిత స్త్రీలు ఉన్నారు. వారి నాయకత్వాన దళితులు పండగల్లో కలిశారు. అయినా వేరుగుంపులుగానే ఆడారు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలమైన మేము దళిత గుంపుల్లో చేరాము. సంఘ సంస్కరణ పాటలు పాడుతుంటే అన్ని గుంపులూ మాతో చేరి ఉత్సాహంతో నాట్యమాడటం ఎప్పటికీ మర్చిపోలేని స్మృతి. కొందరు యువతులు బతుకమ్మ పాటలకోసం నెలరోజుల ముందే తెల్లకాగితాలు తీసుకుని పాటలొచ్చిన వారి వెంట పడేవారు. ఒకసారి విని చాలా వరకూ ఒంట పట్టించుకుని తామే అదనపు పాటను అల్లుకుని పోరాటాలనూ, సమస్యలను జోడించి గంటల కొలదీ పాటను సాగించేవారు. అవి విని మేము పునఃస్ఫూర్తి, పునరుత్సాహం పొందేవారం. ఆ జ్ఞాపకాలు మరువలేం. ఏవీ ఆ రోజుల బతుకమ్మలు? ​వీర తెలంగాణా రైతాంగ పోరాటం విముక్తి చేసిన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ రాజ్యాల పరిపాలనలో భూమి పంపకం జరిగి, పంటలు బాగా పండి, రైతు కూలీలు స్వేచ్ఛను పొందారు.

అందుకే కష్టాలు మరిచి ఈ బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు, దసరా రెండు రోజులు కలిసి పదకొండు రోజులు గ్రామ రక్షణ దళాల భద్రతతో ఆనందోత్సాహాలతో గడిపేవారు. 50 ఏండ్ల తర్వాత నేడు గ్రామాలను చూస్తే నిరుత్సాహ వాతావరణం తాండవిస్తోంది. కరువు కాటకాలు, వ్యవసాయం దివాళా, బీడు భూములు. బతుకమ్మకు అతిముఖ్యమైన తంగేడు పూలే కనబడవు. గొప్ప గొప్ప పువ్వుల పేర్లు వినిపిస్తున్నాయి. అవి సామాన్యుల బతుకమ్మను చేరవు. సామూహికంగా స్ర్తీలు కూడా గ్రామాలను వదలి అన్నమో రామచంద్ర అని వలసల పాలయ్యారు. గ్రామాలు నిర్వీర్యమైపోయాయి. పట్టణ ప్రాంతాల కొత్త కొత్త మోసాలతో దోచే దొరల మధ్య బందీలైన పల్లె రైతు కూలీజనం బతుకమ్మ నెలా తలంచెదరు? విదేశీ సంస్కృతి, ప్రపంచీకరణ, మరొక ప్రక్క టీ.వీలు, టేపు రికార్డులు, క్యాబరే డాన్సులు, విచ్చలవిడిగా సాగుతున్న మద్యం వ్యాపారం పల్లెల్లోచేరి పల్లె జీవితాలను చిందర వందర చేస్తుంటే బతుకమ్మ ఉసూరు మంటోంది. పల్లె ఏమైతేనేం, ఆనాటి స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన పండగల వాతావరణం, అలనాటి రంగురంగుల ప్రకృతి అందాల పూలతో పసుపు కుంకుమలతో ముస్తాబై కదిలే బతుకమ్మలు నిండుగా కనిపించక తెలంగాణ చిన్నబోయింది. బతుకమ్మ మళ్లీ తిరగబడి తన ఉనికిని నిలబెట్టుకుం టుందని ఆశిద్దాం. తెలంగాణ స్త్రీలు మళ్లీ తిరగబడి కుల వివక్షతను విడనాడి, అందరికీ చెందె బతు కమ్మను నిలబెట్టి ఆనందోత్సాహాలతో ఆడుకుం టారని ఆశిద్దాం. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి మాతకు అల్పజీవి లేదు, గొప్పజీవి లేదు. అంతాసమానమే. ఆ సత్యమే సమసమాజం. సమసమాజ స్థాపనలో స్త్రీ శక్తి అజేయంగా నిలుస్తుంది.

- మల్లు స్వరాజ్యం
(ఐద్వా ​మానవి, అక్టోబర్-డిసెంబర్ సంచిక, 2005లో ప్రచురితం)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్