సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతిభతోపాటు కొత్తదనాన్ని ఆహ్వానించే తత్వం కూడా ఉండాలి. పాత్రల ఎంపికలో వైవిధ్యం, నటనలో సహజత్వం, కథల పట్ల ఆసక్తి.. ఈ లక్షణాలతో ముందుకు సాగుతున్నారు జో శర్మ. నటిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ దశమ వార్షికోత్సవ వేడుకల్లో సినీరంగ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆమెతో మానవి సంభాషణ....
హైదరాబాద్‌లో జన్మించిన జో శర్మ బాల్యం నాగ్‌పూర్, ముంబయి నగరాల్లో గడిచింది. ఆంధ్రప్రదేశ్‌తోనూ, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాలతోనూ ఆమెకు అనుబంధం ఉంది. ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోతో అనుబంధం కొనసాగిస్తున్న ఆమెకు తెలుగు, హిందీ, మరాఠీ భాషలు తెలుసు. భిన్న ప్రాంతాలు, సంస్కృతుల మధ్య పెరగడం తన ఆలోచనా పరిధిని విస్తృతం చేసిందని ఆమె అంటారు. విభిన్న వ్యక్తుల జీవితాలు, వారి భావోద్వేగాలు, జీవనశైలిని అర్థం చేసుకోవడం నటిగా తనకు ఉపయోగపడుతోందంటున్నారు. నటనపై ఆసక్తితో రంగస్థల ప్రదర్శనల్లోనూ పాల్గొన్నారు. అమెరికాలో థియేటర్ ద్వారా పొందిన అనుభవం ఆమెకు నటనలో మరింత పరిణతిని అందించింది. పాత్రను అర్థం చేసుకోవడం, సంభాషణలకు అనుగుణంగా భావాలను పలికించడం, ప్రేక్షకులతో అనుసంధానమవడం వంటి అంశాల్లో రంగస్థలం ఎంతో నేర్పిందంటారు.
సొంతంగా నిర్మాణ సంస్థ
సొంతంగా థియేటర్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కళాత్మక ప్రయోగాలకు కూడా అవకాశం కల్పించుకుంటు న్నారు. ‘M4M’లో జర్నలిస్టుగా.. జో శర్మ నటనా ప్రయాణంలో M4M – Motive for Murder చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె రాధ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రను పోషించారు. నిజాన్ని వెలికితీయాలనే పట్టుదలతో ముందుకు సాగే జర్నలిస్టుగా కనిపించారు. పాత్రలోని ఆత్మవిశ్వాసం, పరిశోధనాత్మక దృక్పథం, భావోద్వేగాలను తెరపై సహజంగా పలికించేందుకు కృషి చేశారు. ఈ పాత్ర కోసం దర్శకుడు మోహన్ వడ్లపట్ల వద్ద మూడేండ్లు శిక్షణ పొందారు ఆమె. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం నుంచి దాన్ని తెరపై ఆవిష్కరించే విధానం వరకు ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నటనంటే కేవలం సంభాషణలు చెప్పడం మాత్రమే కాదని, పాత్రలోని భావాలను ప్రేక్షకులకు చేరవేయడమే అసలైన సవాలని ఆమె అంటారు.
విడుదలకు ముందే అవార్డులు
ఈ సినిమాలో ఆమె నటనకే పరిమితం కాలేదు. మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడవాలాతో కలిసి కథా రచనలోనూ భాగస్వామ్యం వహించారు. నిర్మాతగానూ వ్యవహరించారు. ఒక సినిమా నిర్మాణంలో వివిధ విభాగాల పనితీరును దగ్గరగా గమనించడం వల్ల కథను చూసే తన దృక్పథం మరింత విస్తృత పరుచుకున్నారు. నటిగా ఒక పాత్రను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, రచయితగా కథలోని పాత్రల బలాబలాలను గుర్తించడం కూడా అంతే ముఖ్యమని ఆమె అభిప్రాయం. 2026 మే 8న విడుదలైన M4M – Motive for Murder ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ఈ చిత్రం గుర్తింపు పొందింది. విడుదలకు ముందే 15 అవార్డులు అందుకుంది. ఈ అనుభవం భవిష్యత్తులో మరిన్ని మంచి కథల్లో భాగమవ్వాలనే ఉత్సాహాన్ని కలిగించిందని ఆమె చెబుతున్నారు.
మహిళా పాత్రలకు ప్రాధాన్యం
నటనలో ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం జో శర్మకు ఇష్టం లేదు. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకోవాలనుకుంటారు. ముఖ్యంగా స్వతంత్రంగా ఆలోచించే, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మహిళల పాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. మహిళా పాత్రలు కథకు అలంకారంగా కాకుండా, కథను ముందుకు నడిపించే శక్తిగా ఉండాలని ఆమె భావిస్తారు. పాత్రలో గ్లామర్ మాత్రమే కాకుండా, వ్యక్తిత్వం, తెలివితేటలు, కథకు అవసరమైన బలం ఉండాలని ఆమె అంటారు. అందం, ఆలోచనాశక్తి కలగలిసిన మహిళా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, మహిళల సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయని ఆమె నమ్మకం. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనే భావనకు తగిన పాత్రల ద్వారా తన ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటున్నారు.
నేర్చుకోవడమే విజయానికి బాట
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు నచ్చిన నటీనటులు ఉన్నారని చెప్పే జో శర్మ, నటనలో నిరంతర అభ్యాసానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి పాత్ర ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుందని, ప్రతి కథ కొత్త అనుభవాన్ని అందిస్తుందని ఆమె భావిస్తారు. నటనతోపాటు రచన, నిర్మాణ రంగాల్లోనూ అనుభవాన్ని పెంచుకోవడం తనకు కొత్త అవకాశాలను అందిస్తోందని చెబుతున్నారు.
విభిన్నమైన పాత్రల్లో మెప్పిస్తా..
నటనలో వైవిధ్యం చూపించాలంటే పాత్రను ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రలోని భావోద్వేగాలను ఆకళింపు చేసుకుని, తెరపై సహజంగా ఆవిష్కరించగలగాలి. ఈ సూత్రాన్ని నమ్ముతూ సినీ ప్రయాణంలో ముందుకు సాగుతున్నారు జో శర్మ. థియేటర్ రంగం నుంచి పొందిన అనుభవాన్ని వెండితెరపై ఉపయోగించుకుంటూ, తనకు లభించిన పాత్రలకు న్యాయం చేయాలనే తపనతో పనిచేస్తున్నారు. అందం, ఆత్మవిశ్వాసంతో పాటు నటనలోనూ ప్రత్యేకతను చాటుకోవాలన్నది ఆమె ఆకాంక్ష. ‘ఎం4ఎం’ చిత్రంలో ధైర్యవంతురాలైన పరిశోధనాత్మక జర్నలిస్టుగా కనిపించిన జో శర్మ పాత్రలోని బలాన్ని, భావోద్వేగ తీవ్రతను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నటనతో పాటు కథా రచనలోనూ భాగస్వామ్యం కావడం ఆమెకు పాత్రపై మరింత అవగాహన కల్పించింది. ఒకే మూసలో ఇమిడిపోకుండా, కొత్త కథలు.. సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకోవాలన్న ఆసక్తి ఆమెలో కనిపిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో జో శర్మ ముందుకు సాగుతున్నారు.
ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా...
భిన్న భాషల ప్రేక్షకులకు చేరువయ్యే కథల్లో నటించాలన్నది ఆమె ఆకాంక్ష. మంచి కథ, బలమైన పాత్ర, సహజమైన నటన.. ఈ మూడింటి కలయికే ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. నటిగా తన ప్రతిభను నిరూపించుకుంటూనే, కథల ఎంపికలోనూ సృజనాత్మకతను ప్రదర్శించాలనుకుంటున్న జో శర్మ, రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఐదారు కొత్త ప్రాజెక్టులతో నిర్మాణరంగంలోనూ, నటిగానూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
- యడవల్లి శ్రీనివాసరావు






కామెంట్లు (0)