మేఘం తన డ్యూటీని మరిచిపోయింది ఉరుము తన ఉనికిని విడిచిపెట్టింది చినుకుల చిత్తడి లేక నేలంతా నెర్రలు బారీ ఊరు చెరువంతా అడుగు తేలింది రైతన్న చినుకు కోసం కునుకు లేక కాళ్లు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మట్టిని మాతృమూర్తిగా ప్రేమించే రైతు ఎండను మింగి రక్తాన్ని చెమటగా మార్చి నరాలను పిండి నారుమల్లుగా మార్చితే ఎల్ ని నో దెబ్బకు ఎండిపోతుంటే దిగులు పక్షి లా దిగాలుగా చూస్తున్నాడు రైతన్న గుండె బరువై బతుకు చెరువై ఇప్పుడు ఎవరిని తడిమి చూసినా బాధల గుట్టలే కన్నీటి చుక్కలే మట్టిని నమ్ముకున్న మనిషి ఇప్పుడు జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా బోరు నా విలపిస్తున్నాడు కరువు రాక్షసి వలలో చిక్కి రైతన్న ఇప్పుడు గబ్బిలంలా వేలాడుతున్నాడు ఆలీ పుస్తెలను కుదువబెట్టి రైతన్న ఇప్పుడు అప్పుల కుంపటిని కాగుతున్నాడు కాలానికి తనువును తాకట్టు పెట్టి రైతన్న ఇప్పుడు దేహాలకు గాయాల ముళ్లను గుచ్చుకుంటున్నాడు ఏలికలకు రైతన్న ప్రచారం మూటై ఓట్లకు వర్షంలా మిగులుతున్నాడు దళారుల కుట్రలకు కేరాపై పరాన్న జీవిగా మారిపోతున్నాడు మట్టి మీద తన మనుగడ ప్రశ్నార్ధకమై మరో ఉషోదయం కోసం ఎదురుచూస్తున్నాడు
తాటిపాముల రమేశ్ (తారా), 7981566031






కామెంట్‌లు (0)