ఏకాంత వేళ
చెట్లు మాట్లాడుకునే
రహస్య భాష వింటున్నా
అన్ని నీళ్లను తలపై గుమ్మరించుకొని
అంతటి వణికే చలికి ఒంటరిగా నిలబడి కాలాన్ని కౌగిలించుకుని
ఎదురుతెన్నులు చూస్తున్న
చెట్లు మాట్లాడుకునే
మాటలు వింటున్న
నిప్పులు కురిసే ఎండలు
నిలువెల్లా కలిచివేస్తున్నా
నిబ్బరంగా నిలబడాలని
చేసే పోరాటాన్ని కధలు కథలుగా
ఈ వేళ వింటున్నా
అడవిలో అగ్గి ఎందుకు రగులుతుందో..
పసిపిల్లలను పాము ఎందుకు
కబళిస్తుందో
రెక్కలు రాని పిల్లలను
గద్ద ఎందుకు తన్నుకు పోతుందో
కుందేలు పిల్లల కలవరపాటు దేనికో
చీమల పెట్టే పుట్టలపై
పాముల పట్టు ఎందుకో
చెకుముకి రాళ్ళు రాసుకునే
మంటల సవ్వడిలో
వెలిగే అడవి పాటను
చెట్ల తలలను నిమిరే
మబ్బులు పంచుకునే ప్రేమ గీతాన్ని ...
ఈ వేళ చెట్లు చెప్పుకునే
ముచ్చట వింటున్నా...
డా. సుంకర రమేశ్, 9492180764
చెట్ల భాష
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)