ఇల్లు.. నివాసం కోసమే.. మనిషి బయట ప్రపంచపు అలసటను దించుకునే చోటు. అమ్మ ఒడిలా వెచ్చగా ఉండాల్సిన చోటు. అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు పరిఢవిల్లాల్సిన చోటు. కానీ, అదే ఇల్లు అందరికీ ఒక్క లాగే ఉంటుందా? అందరినీ ఒక్కలాగే నిలబెడుతుందా, అందరికీ ఒక్క నీడే పంచుతుందా, అందరినీ ఒక్కలాగే హృదయంలో పెట్టుకొని చూస్తుందా!? చివరిదాకా అందరినీ సమంగా నడిపిస్తుందా లేదనే చెప్పాలి..
ఒకరి చేతిలో నిర్ణయాధికారం, మరొకరి చేతిలో వంట వార్పు, చీపురుకట్ట, చీమిడి ముక్కులు.. ఒకరిని ఏడికో గెంటేస్తుంది, ఇంకొకరిని గుండెల్లో పెట్టుకుంటుంది..
ఒకరికి స్వేచ్ఛ సహజ హక్కు అయితే, మరొకరికి స్వేచ్ఛ కోసం అనుమతి అవసరం.!
ఇంటి గోడల మధ్య జరిగే ఈ నిశ్శబ్ద అధికార, ఆధిపత్య మౌన పోరాటాలనే ‘ఇల్లోక రాజకీయం’గా దర్శింప చేసిన ప్రముఖ కవయిత్రి డా.గీతాంజలి.
‘ఇల్లోక రాజకీయం’ అనే శీర్షికే ఈ సంపుటి అంతరార్థానికి అద్దం పడుతుంది. రాజకీయం అంటే కేవలం సభల్లో, అధికార కార్యాలయాల్లో, ఎన్నికల్లో, నాయకుల్లో కనబడేది కాదు, ఇంటి గడప దాటకుండానే మనిషి జీవితాన్ని శాసించే ఎన్నో రాజకీయాలు ఉంటాయి. అవీ ఇంట్లో ఎవరి మాట నడుస్తుంది? ఎవరి శ్రమకు విలువ ఉంటుంది? ఎవరి స్వరం వినిపిస్తుంది? ఎవరి భావాలు అణచబడతాయి? ఇవన్నీ రాజకీయాలే కాబట్టి కవయిత్రి ఈ విస్తృత అర్థాన్నే తన కవితా సంపుటికి శీర్షికగా తీసుకున్నారు..
ఈ అరుదైన గ్రంథం యుగాలుగా వస్తున్న ఇంటినీ, ఇంటి అంతరంగాన్ని, ఇంటి ఆవరణాన్ని లోతుగా ఎన్నో కోణాల్లోంచి విశ్లేషించి చూపిన సీక్వెల్ కవితా సంపుటి.నలభైయొక్క కవితలు 225 పేజీలతో వాస్తవితకు దర్పణం పట్టిన దీర్ఘ కవితలతో కూడిందే గ్రంథం.
మార్క్స్, ఎంగెల్స్ రచన "ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో"లో కుటుంబం అనేది ఒక నిర్దిష్ట ఆర్థిక వ్యవస్థ యొక్క మేనిఫెస్టో నని పేర్కొన్నారు. లెనిన్ అభిప్రాయంలో కూడా కుటుంబం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక రకమైన ఆస్తి సంబంధం అని చెప్పాడు.. కుటుంబం ఒక ఆర్ధిక సంబంధంగా ఉన్నప్పుడు భార్యా, పిల్లలు కూడా ఆస్తిగా పరిగణించబడతారు. కుటుంబం స్త్రీలను అణచివేసే శ్రమ దోపిడీ కేంద్రంగా మారుతుందనేది ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం..!
దీని ప్రకారం కుటుంబం లోపల బయట స్త్రీలు ఏ అధికారాలు, హక్కులు లేకుండా ఉక్కిరిబిక్కిరి తనంతో బతుకుతున్నారని, ఒకరకంగా ఇల్లు స్త్రీల సమస్త అధికారాన్ని హక్కుల్ని గుంజేసుకునే అమానవీయ పితృస్వామ్య యూనిట్ తప్ప మరేమీ కాదు అంటారు ఇల్లు మీది డొల్లతనం విప్పుతూ కవయిత్రి. అనడమే కాదు, అదెలాగో వారి కవితల్లో సుస్పష్టంగా కనబడుతుంది..!
"
ఎక్కడికి పిలువను నిన్ను?" అనే కవిత చదువుతూ ఉంటే హృదయం తడిబారక మానదు.. "నా ఇంటికి వస్తానంటావు / కానీ నాకు ఇల్లేది?/ అమ్మిళ్లు, అత్తిల్లు, పిల్లల ఇల్లు, నా ఇల్లెలా అవుతాయి చెప్పు? ఆడదాన్ని కదా మరి" అంటారు. నిజమే ఆడవాళ్లకు ఆస్తి, సంపద, ఇల్లు ఎవరిస్తున్నారనీ, న్యాయాలు చట్టాలు ఇవ్వమంటాయి.. కానీ, వాటినెవరు లెక్కిస్తున్నారు కనుక, జీవితాంతం చాకిరీ చేసినా ఆమె పేరు మీద చిల్లి గవ్వ కూడా ఉండదు, ఇంక ఇల్లెక్కడనుంచీ.!? ఇల్లే లేని ఆమె ఎవరిని ఇంటికి పిలుస్తుందనీ.!?
మరోచోట 'ఇల్లు మారాలి' అనే కవితలో.. ఇల్లు మారడం అంటే సామాన్లు సర్దుకోవడం, పాత ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్లడం. కానీ గీతాంజలి దృష్టిలో అది అంత సులభమైన ప్రక్రియ కాదు. చివరకు సమస్త అనుభూతులు ఇల్లుతో ముడిపడి ఉంటాయి, ఇప్పుడు వాటిని ఇంటితో పాటు మోసుకెళ్ళాలి" అంటారు.
కవయిత్రికి ఇల్లు ఒక వస్తువు కాదు; ఒక సజీవ అనుభవం..
“నేను నవ్వితే నవ్విన ఇల్లు/ నేను ఏడిస్తే తాను ఏడ్చిన ఇల్లు!” అని ఇంటిని ఓ స్పందించే సహచరిగా అనుభూతిస్తుంది.
“ఇల్లొక రాజకీయం” అనే కవిత ఇల్లు సౌందర్యాత్మకంగా, సమిష్టి లక్షణాలతో కనిపించినా ఒక్కోసారి మహా కిలాడి కూడా అంటారు.. కత్తుల్ని గరిటల్ని, పోపు డబ్బాలని, గ్రైండర్లని అమ్మలకిచ్చి, పేపర్లని, పెన్నులని, పుస్తకాలని, టీవీలని సెల్లులని, లాప్టాప్ లని నాన్నలకు అందించిన ఇల్లు ఎంత పక్షపాతో చూడండి అనడం మెత్తని చురక లాగే ఉంటుంది..!
ఇంకా అంటారు పండగలప్పుడయితే అమ్మల్ని మూకుట్లో గారెల్లా వేయించుకు తింటుంది..
ఒక్కో సందర్భంలో ఒక్కోలా కనిపించే ఇల్లు మనం లేకుంటే దుఃఖిస్తుందట.. అప్పుడప్పుడన్నా.. వెళ్ళి ఇంటిని పలకరించి రావాలి అంటారు..!
‘పద, ఇల్లు నీకోసం ఎదురు చూస్తుంది’ అనే కవితా స్ఫూర్తితో.. నేను ఈ మధ్యే రెక్కలొచ్చి పిట్టలెగిరిపోతే, మిగిలిన గూడులా ఉన్న మా పుట్టింటికి వెళ్లి, ఇంటి గుమ్మాన్ని కడిగి బొట్టు పెట్టి వచ్చాను. కదిలించేది కదా కవిత్వమంటే..!
ఇక 'స్నానాల గది' సిరీస్ చదువుతుంటే.. హోమ్ స్కావెంజర్గా మారిన అమ్మ కళ్ళ ముందు చెమట మోముతో మెదులుతుంది..
నాన్న మాత్రం ఉతికి ఆరేసిన తెల్లని పంచెలా మెరిసిపోతాడు.. నిజమే, ఎందుకు ఇట్లా మారిపోయారు..!?
ప్రశ్నించుకోవలసిందే..
ఆడ పనులు, మగ పనులు వేరువేరుగా ఉంటాయా.. అలా పెంచి పోషించబడ్డాయి..
ఈ అంతరాలన్నీ అందరికీ తెలిసినవే, చూస్తున్నవే..! అయితే.. అనాదిగా స్త్రీలు పుట్టిందే వీటిని ఉద్ధరించడం కోసం అనుకునేంతగా సమాజంలో జీర్ణించుకు పోయాయి.. ఈ పుస్తకాన్ని చదివి కొందరన్నా భుజాలు పునుక్కుంటే బాగుండు..!
ఇక 'పడక గది' సిరీస్ చదువుతుంటే.. హృదయం ద్రవించి మూగబోతోంది..
"పెళ్ళికి ముందు / ఆమెకు ఏకాంత కలలగది/ దాంట్లోనే ఆమెను ఆమె వెలిగించుకునేది/ పెళ్లి తర్వాత../ఆమెకు పడకగది కదలకుండా ఎగరకుండా పెదాలు కుట్టివేసే గది, రోజు లిట్మస్ పరీక్ష చేసే లాబరేటరీ..! ఇక్కడ కొన్ని పడక గదుల గాధలకు చలించి పోతాం.
ఇక "ఆడ కంచం - మగకంచం" చూస్తే మగ కంచంలో నిండు భోజనం, ఆడ కంచంలో సగం.. మనుశాస్త్రం ప్రకారం రెండు తరీఖల కంచాలు.. మంచాలు ఉంటాయి..
కవిత ముగింపులో.. మాత్రం ఇప్పుడు కంచాలని మార్చి పడెయ్యాల్సిన అవసరం ఉందంటారు..
సమస్యను మెత్తగా చూపిస్తూనే, పరిష్కారం కూడా సూచిస్తారు కవయిత్రి.
"నువ్వు రిటైర్ అయితే నాకేంటి చెప్పు" కవితలో ఆమె అతని సహకారంతో ఏవేవో చేయాలని కలలు కంటుంది ఏమీ చేయలేని అసహాయ స్థితిలో..
"
ఇప్పుడు నాకు /ఇల్లొక శరణార్థుల శిబిరం" నేనిప్పుడు నీకు ఫుల్ టైం ప్యూన్ని, నర్స్ని / నువ్వేమో పక్షవాతం వచ్చినట్టే / ఉన్న కాడికి తెప్పించుకునే వికలాంగుడివి" ఎంత హృదయ విదారకంగా ఉంది.. ఆమె గోస..
చివరగా.. కవయిత్రి తన కలల ఇల్లు ఎలా ఉండాలో కూడా చెప్పారు.. "My dream house without kitchen" నాకు ఇల్లు కావాలి వంటిల్లు లేని ఇల్లు కావాలి అంటారు.. ఎంత విసిగి వేసారి ఉండకపోతే అలా కోరుకుంటారు.
ఇంకా ఇల్లు ఇలా ఉండాలట... ఇల్లొక వెన్నెల రేయి / ఇల్లొక పున్నమి రేడు / ఇల్లొక సముద్రపు గూడు / ఇల్లొక పరిమళాల పువ్వులా విలసిల్లాలని.!
ఈ సంపుటిలో వంటగది, పడకగది, స్నానాల గది, వాకిలి, పెరడు వంటి ఇంటి భాగాలన్నీ స్త్రీ జీవితంతో అనుసంధానించ బడతాయి.
ఈ కవితల్లో గీతాంజలి గారి శైలి ప్రశ్నాత్మకంగా, సంభాషణాత్మకంగానూ సరళ సుందరంగా సాగుతుంది.
పంకజ్ ఉదాస్ గజల్ను, ఫరీదా భాను గానాన్ని ఆలపింప చేయడం.. కవితలకు జీవం పోసిన్నట్టే ఉంది..
టైటిల్ కి తగిన ముఖచిత్రంతో పుస్తకమంతా ఏక బిగిన చదివించింది..
గీతాంజలి గారు.. మీ కలం లోంచి మరిన్ని ఇలాంటి పదునైన కవితలు వెలువరించాలని కోరుకుంటూ అభినందనలతో..
నాంపల్లి సుజాత అన్నవరం
9848059893






కామెంట్లు (0)