అసమ సమరంలో అన్నింటిని కోల్పోయినా అమరత్వపు ఆయువుపట్టు ఇంకా మిగిలే ఉంది రుధిర జ్వలనంతో క్షణ క్షణం రగులుతూ రణగుడారం! భుగభుగ పొగులుతూనే ఉంది కుడి ఎడమ కన్నీటి తడులను కోల్పోయినా ఎదను తడిమే కంటిచూపు లక్షణంగానే ఉంది పచ్చినెత్తురు గాయాలు పదేపదే సలపరిస్తున్నా కాలనాగుల కపటనాటకాల్ని కనిపెడుతూనే ఉంది చిదిమేసిన చీకటి యుద్ధమరకలకు తలవంచక మండిలేచిన మంటలసాక్ష్యాలను తడుముకొంటూనే మళ్లీ నిలవడానికి మనోబలాల్ని కూడబలుక్కొంటోంది చిరకాలపు నిప్పులను ఆర్పేసిన ఛిద్రవ్యూహాల్ని చిత్రగ్రీవులై ఛేదించడానికి సమరసన్నద్ధమౌతోంది కాలి బూడిదైన కలల్లోని కాల్పనిక ఫీనిక్స్ పిట్ట కాలపు ఒరిపిడిలో రక్త మాంసాలతో ప్రాణంపోసుకొని పునరుత్థానం చెందడానికి పరిపరివిధాల పరితపిస్తోంది కడుపునింపుకొనే కాలధర్మ నియమాలకు కట్టుబడి కాళ్ళకింద నలిగి బతికిపోయిన కాడెడ్ల కైలి కంకలు కయ్యానికి కసిగా కొమ్ముల్ని కొచ్చగా నూరుతున్నాయి.
కరిపె రాజ్ కుమార్, 8125144729






కామెంట్‌లు (0)