చంద్రబాబు లేఖ తెలంగాణకు మరణశాసనం
ఈ ప్రాజెక్టుకు ఒప్పుకుంటే కేంద్రం ద్రోహం చేసినట్టే
కేంద్రమంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నట్టు ?
నీటి హక్కులను కాలరాస్తే ప్రజా ఉద్యమమే
గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టు సమ్మక్క బ్యారేజీ నుంచి చేపట్టాలి
పోలవరం నుంచి చేపట్టే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి :మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు రాసిన లేఖ తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనమని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు అన్నారు. గోదావరి- కావేరి అనుసంధాన ప్రాజెక్టు ముసుగులో కొత్త కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. గోదావరి నదిని చంద్రబాబు కబళించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి- కావేరి అనుసం ధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి (సమ్మక్క బ్యారేజీ) నుంచి నాగార్జునసాగర్ ద్వారా తీసుకెళ్లాలని ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పోలవరం-బొల్లేపల్లి-నాగార్జునసాగర్ నుంచి కావేరికి నీళ్లు తీసుకెళ్లేలా ప్రతిపాదనలు పంపారని అన్నారు. వచ్చేనెల 3న సమావేశం ఉంటుందని అన్ని రాష్ట్రాలకూ జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమాచారం ఇచ్చిందని వివరించారు. గతంలో గోదావరి - బనకచర్ల, గోదావరి - నల్లమల్లసాగర్‌కు ప్రయత్నం చేసి చంద్రబాబు విఫలమయ్యారని చెప్పారు. అందుకే బొల్లేపల్లి వద్ద 150 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు గురుదక్షిణ కింద గోదావరి, కృష్ణా నీటిని రేవంత్‌రెడ్డి ఏపీకి వదిలేస్తున్నారని చెప్పారు.
ఏపీలో క్రాప్ హాలిడే ఎందుకు లేదు?
తెలంగాణలో 17 శాతం లోటు వర్షపాతం ఉంటే, ఏపీలో 25 శాతం ఉందని హరీశ్‌రావు చెప్పారు. అయినా ఏపీలో క్రాప్ హాలిడే ఎందుకు లేదని ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి 10 మోటార్లు 24 గంటలు నడిపి ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు వచ్చేది కాదన్నారు.
తెలంగాణకు రేవంత్‌రెడ్డి ద్రోహం
రేవంత్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచే, ఏపీ సీఎం చంద్రబాబు గోదావరీ జలాల దోపిడీ మొదలు పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. దీన్ని అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబుకు దాసోహమయ్యారని అన్నారు. ఇచ్చంపల్లి- కావేరీ అనుసంధానం విషయంలో 968 టీఎంసీలకు తెలంగాణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా పోతే 2,38,236 ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు. ఇప్పుడు ప్రతిపాదన మార్చితే తెలంగాణ పరిశ్రమలకు నీళ్లు, తాగు, సాగు నీరు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు బాధ్యత లేదా?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీకి వచ్చారని హరీశ్‌రావు అన్నారు. కర్నాటకను ఒప్పించేందుకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని చెప్పారు. పోలవరం డైవర్షన్‌లో 21 టీఎంసీలు, ఇప్పటికే 16 టీఎంసీలు కలిపి 37 టీఎంసీలు కృష్ణాలో ఆగితే పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ నీటి హక్కులను కాపాడే బాధ్యత లేదా?అని ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారని అడిగారు. ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)