భూమి సక్సెషన్‌కు రూ.2.50లక్షల లంచం
విద్యుత్ మీటర్ల మంజూరుకు రూ.1.20లక్షలు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ముగ్గురు కీసర రెవెన్యూ అధికారులు
మాదన్నపేటలో ఏఈ పట్టివేత
నవతెలంగాణ-కీసర/చార్మినార్
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తున్న అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝలిపించారు. భూమి సక్సెషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేసి, రూ.2.50 లక్షలు తీసుకుంటూ కీసరలో ముగ్గురు రెవెన్యూ అధికారులు పట్టుబడగా.. విద్యుత్ మీటర్ల మంజూరుకు రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ మాదన్నపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు.
సక్సెషన్‌కు రూ.5 లక్షలు డిమాండ్
కీసరకు చెందిన పన్నాల బుచ్చిరెడ్డి భార్య సుశీల మృతిచెందారు. ఆమె పేరుపై సర్వే నంబర్లు 183, 184లో ఉన్న మూడు ఎకరాల భూమిని వారి కుమారుడు పన్నాల గిరిధర్ రెడ్డి తన పేరుపై సక్సెషన్ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఈ పనికి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. భూమి 22ఏ జాబితాలో ఉండటంతో సక్సెషన్ పూర్తి చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి సుమారు రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు తహసీల్దార్‌కు, ఆర్డీవో కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో గిరిధర్ రెడ్డి తొలి విడతగా రూ.2.50 లక్షలను ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ రెడ్డికి అందజేశాడు. ఆయన ఆ నగదును రికార్డు అసిస్టెంట్ బాలకృష్ణకు ఇవ్వగా, దాన్ని డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి గదిలోని ఆయన బ్యాగులో పెడుతుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ముగ్గురు అధికారులను అదుపులోకి తీసుకున్న అధికారులు, వారి ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఇతర అధికారుల పాత్రపైనా విచారణ కొనసాగుతోందని డీసీపీ తెలిపారు.
రూ.1.20 లక్షలు తీసుకుంటూ ఏఈ పట్టివేత
హైదరాబాద్ మాదన్నపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ పండాల సంధ్యా రాకేష్ రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులకు చిక్కాడు. సంతోష్‌నగర్ సబ్‌డివిజన్ పరిధిలోని మాదన్నపేట సెక్షన్లో ఆమె ఏఈగా పనిచేస్తున్నారు. గతంలో ఉన్న విద్యుత్ మీటర్లు కనిపించకుండా పోవడంతో వాటి స్థానంలో ఆరు కొత్త మీటర్లు మంజూరు చేయాలని బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తులను ఆమోదించి కొత్త మీటర్లు మంజూరు చేసేందుకు ఆమె లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. గురువారం రూ.1,20,000 తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితురాలిని నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి..
ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సప్ నంబర్ 9440446106, ఫేస్బుక్లో తెలంగాణ ఏసీబీ, ఎక్స్ ఖాతా @TelanganaACB ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.





కామెంట్లు (0)