నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలి: సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మంగంపల్లి దేవాలయ కుల వివక్ష ఘటనపై విచారణ జరపాలనీ, నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, మంగంపల్లి గ్రామంలో దళిత యువకుడు మాసాని సుధీర్ కుటుంబ సమేతంగా ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనానికి వెళ్లారని తెలిపారు. వారిపై ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డిలు కుల అహంకారంతో అడ్డుకుని కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు. 80 ఏండ్ల స్వాతంత్య్రం, 76 ఏండ్ల నుంచి రాజ్యాంగం అమల్లో తరుణంలో కూడా పోచమ్మ పండుగ నుండి వినాయక ఉత్సవాల వరకు దళితుల పట్ల కులవివక్ష ప్రదర్శించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 14ను కాలరాయటం తగునా? అని ప్రశ్నించారు. కుల దురహంకారం ప్రదర్శించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యం విడనాడి కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి సొంత గ్రామంలోనే ఈ అన్యాయం జరగడం అన్యాయమని తెలిపారు. దళితులు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యే మౌనం వహించి పెత్తందారులకు అండగా నిలవడం శోచనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, అధికారులు తక్షణమే మంగంపల్లి గ్రామంలోని అన్ని కులాల వారితో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైన సమానత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు చేపడుతున్న నిరసనలకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.





కామెంట్లు (0)