Magazines

వైద్య కళాశాలలో ఆకలి కేకలు..

1 గంట క్రితం

Cries of hunger
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

16 రోజులుగా నిలిచిన మెస్
అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తకే కాంట్రాక్ట్..
అండగా నిలుస్తున్న అధికారులు?
నాసిరకం భోజనం.. అడిగితే బెదిరింపులు
దిక్కుతోచక ఇండ్లకు వెళ్లిపోతున్న వైద్య విద్యార్థులు
నవతెలంగాణ - గణపురం
భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. గణపురం మండలం చేల్పూర్ శివారు మాధవరావుపల్లి కాలనీ సమీపంలోని మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న 250 మందికి పైగా వైద్య విద్యార్థులు 16 రోజులుగా భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల తీరుతో విసిగిపోయిన పలువురు విద్యార్థులు ఇండ్లకు వెళ్లిపోతున్నారు.
​నాసిరకం తిండి.. నిలువు దోపిడీ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. నిబంధనల ప్రకారం రోజూ సమయానికి నాణ్యమైన టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు పాలు, స్నాక్స్ అందించాల్సి ఉంది. విద్యార్థులు క్రమం తప్పకుండా మెస్ బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ, ప్రస్తుత కాంట్రాక్టర్ అత్యంత నాసిరకం భోజనం పెడుతున్నారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజన నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాల్సిన కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తకే మెస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడమే ఈ సమస్యలకు మూలకారణమని విద్యార్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. భార్య కళాశాలలో అధికారిక హోదాలో ఉండటంతో, నాసిరకం భోజనం పెట్టినా అడిగేవారు లేరన్న ధీమాతో కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 15తో ఆయన కాంట్రాక్టు గడువు ముగిసినా కొత్త టెండర్లు పిలవకుండా మెస్ మూసి వేశారు. సహాయం కోసం గతంలో మెస్ నిర్వహించిన పోతర్ల అశోక్ అనే పాత కాంట్రాక్టర్‌ను విద్యార్థులు ఆశ్రయించగా, ఆయన హాస్టల్‌కు భోజనం తెచ్చే క్రమంలో ప్రస్తుత కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు అడ్డుకొని ఇబ్బందు లకు గురిచేసినట్టు తెలిసింది. కళాశాల యాజమాన్యం వాస్త వానికి మెస్ గడువు ముగియడానికి పది రోజుల ముందే ప్రణాళిక సిద్ధం చేసి విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల మధ్య నిర్వహించిన ఓటింగ్‌లో అత్యధికులు పాత కాంట్రాక్టర్‌కే మద్దతు పలికి నప్పటికీ, అధికారులు మాత్రం అనుభవం లేని ప్రొఫెసర్ భర్తకే మళ్లీ అప్పగించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఉన్నతాధికారు లకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా 16 రోజులు గా హాస్టల్‌లో తిండి దొరక్క పస్తులుంటున్న దుస్థితిపై విద్యార్థులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఆగడాలు, కళాశాల అధికారుల నిర్లక్ష్యంపై ఆధారా లతో సహా నివేదించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నాణ్య మైన భోజనం అందించే వారికి మెస్ బాధ్యతలు అప్పగించి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
​త్వరలోనే ఎంపిక చేస్తాం : 
వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు
రెండు నెలలుగా విద్యార్థులు మిస్ బిల్లు చెల్లించలేదని కాంట్రాక్టర్ భోజనం పెట్టనన్నాడు, కొంతమందికి అతనే భోజనం అందిస్తున్నాడు. మిగిలిన వారు బయట నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్